Sleeping surveillance system

నిద్రరోతున్న నిఘా వ్యవస్థ

Date : 14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఇక్కడ ల్యాండయితే చాలు తమ బంగారం సేఫ్‌ అనుకుంటున్నారా? కస్టమ్స్‌ అధికారులు, సీసీ కెమేరాలు, హై ఎండ్‌ స్కానర్లు, అన్నీ తూతూ మంత్రమేనా? స్మగ్లర్లు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారా? హైదరాబాద్‌ అంతర్జాతీయ గోల్డ్‌ స్మగ్లింగ్‌ ముఠాలకు అడ్డాగా మారుతోందా? బట్టల్లో బంగారం, షూలో బంగారం, సూట్‌ కేస్‌ అంచుల్లో బంగారం కాఫీ పౌడర్‌లో బంగారం… ఒంటిమీద వేసుకుని తెస్తున్నారు… లోపల దాచుకుని మరీ తెస్తున్నారు. కళ్లుగప్పటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి గుట్టు చప్పుడు కాకుండా దాటిస్తున్నారు. అసలీ అక్రమ రవాణా ఎందుకు జరుగుతోంది? దిగుమతిపై ఆంక్షలే కారణమా? స్మగ్లింగ్‌ అడ్డాగా హైదరాబాద్‌ మారుతోందా? బంగారం స్మగ్లింగ్‌ ర్యాపిడ్‌గా పెరుగుతోంది. సర్కారు అడ్డంకులు పెట్టే కొద్దీ మరింతగా తెస్తున్నారు. నిత్యం కిలోల కొద్దీ బంగారం బయట పడుతోంది. అధికారులు ఆపలేకపోతున్నారా? లేక స్మగ్లర్లు కొత్త టెక్నిక్స్‌ కనిపెడుతున్నారా? ప్రతిరోజు కిలోలకొద్దీ బంగారం దొరుకుతోంది. ఎక్కడ వీలైతే అక్కడ దాచుకుని తెస్తున్నారు. బ్యాగుల్లో వీలు కాకపోతే, ఒంటిమీద వేసుకునో, లేదంటే షూలో దాచిపెట్టో, లోదుస్తుల్లో ఉంచో… ఎలాగోలా తేటానికి ఆరాటపడుతున్నారు. వీరిలో ప్రొఫెషనల్‌ స్మగ్లర్లు, వ్యాపారులతో పాటు మామూలు జనం కూడా ఉంటున్నారు… ఎందుకీ అక్రమ రవాణా? ఏ పరిస్థితులు దీన్ని ఎంకరేజ్‌ చేస్తున్నాయి? ప్రతి నెలా 20 నుంచి 30 టన్నుల గోల్డ్‌ను స్మగ్లర్లు భారత్‌లోకి తరలిస్తున్నారని మార్కెట్‌ వర్గాలు చెప్తుంటే, అధికారిక లెక్కలు మాత్రం చాలా తక్కువ గోల్డ్‌ స్మగ్లింగ్‌ అవుతున్నట్టు చెబుతున్నాయి. కానీ, వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ మాత్రం ప్రతి సంవత్సరం 2 వందల నుంచి 3 వందల టన్నుల వరకు బంగారాన్ని స్మగ్లర్లు భారత్‌లోకి తరలిస్తున్నట్టు చెప్తోంది. అసలు బంగారం ఎందుకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. దుబాయ్‌లో అయినా సింగపూర్‌లో అయినా, ఇక్కడయినా అదే బంగారం, మరి అక్రమ రవాణాకు కారణాలేంటి? బంగారానికి, భారతీయులకు పూర్వ కాలం నుంచి ఎడతెగని సంబంధం ఉంది. నిత్య జీవితంలోని అనేక సందర్భాలలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు వివిధ దేశాలనుండి బంగారం అక్రమంగా తీసుకురావటం వెనుక ఎలాంటి కారణాలున్నాయి? దుబాయ్‌, సింగపూర్‌, నేపాల్‌, ధాయిలాండ్‌, శ్రీలంక, ఇండోనేషియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి ఇండియాకు భారీగా స్మగ్లింగ్‌ జరుగుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే గతంలో దుబాయ్‌ నుంచే గోల్డ్‌ స్మగ్లింగ్‌ ఎక్కువగా జరిగేది. ఇప్పుడు మలేసియా, సింగపూర్‌ కూడా ముందు వరుసలో ఉన్నాయి. భారత్‌లో కంటే దుబాయ్‌లో బంగారం ధర తక్కువ. దుబాయ్‌ నుంచి కిలో బంగారం తెచ్చి ఇక్కడ అమ్మితే 3, 4 లక్షల వరకు లాభం వస్తుంది. అందుకే అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ సమాచారం ప్రకారం రెండేళ్ల కిందట భారత్‌లో 975 టన్నుల బంగారం డిమాండ్‌ ఉంటే, ప్రస్తుతం 9 వందల నుంచి వెయ్యి టన్నుల బంగారం డిమాండ్‌ ఉందని అంచనా. మరో పక్క మనదేశంలో భారత్‌లో బంగారం ఉత్పత్తి లేదు. ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇందుకోసం డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది. దీంతో బంగారం దిగుమతులు పెరిగి రూపాయి పతనానికి దారితీస్తోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఇంపోర్ట్‌ టాక్స్‌ను పెంచుకుంటూ వస్తోంది. మార్చి 2012 ఆగస్టు 2013 మధ్య దిగుమతి సుంకాన్ని 4 శాతం నుంచి 10 శాతంగా గత యూపీఏ ప్రభుత్వం పెంచింది. అయితే, దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల బంగారం దిగుమతి తగ్గటం మాట అటుంచి, పన్ను ఎగ్గొడుతూ దొంగతనంగా వచ్చే బంగారం మరింత ఎక్కువయింది. స్మగ్లింగ్‌ భారీగా పెరిగింది. బంగారంపై దిగుమతి సుంకం పెరిగిన తర్వాత నుంచి స్మగ్లింగ్‌ బాగా పెరిగిపోయింది. సరిహద్దులనుంచి బంగారం స్మగ్లింగ్‌ అవుతోంది. ఎయిర్‌ పోర్టుల దగ్గర తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం బాగా బయటపడుతోంది. అసలు బంగారంపై ఆంక్షలు అంటేనే… మాఫియా డాన్‌ లకు చేతినిండా పనిచెప్పడమే. ఏ రకంగా చూసినా, గోల్డ్‌ దిగుమతులపై ఆంక్షలు విధించడం సమస్యకు పరిష్కారం కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. స్విట్జర్లాండ్‌ నుంచి కనివినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున బంగారం, వెండి భారత్‌కు ఎగుమతి కావటం కలకలం రేపుతోంది. స్విట్జర్లాండ్‌ ఒక్క జూన్‌లోనే భారత్‌కు 11వేల కోట్ల విలువైన బంగారం, వెండిని ఎగుమతి చేయటమే ఇందుకు కారణం. స్విట్జర్లాండ్‌ మొత్తం ఎగుమతుల్లో ఇది 42 శాతానికి అంటే 26 వేల కోట్లకు సమానం. ఈ ఏడాది భారత్‌కు స్విట్జర్లాండ్‌ రూ.50 వేల కోట్ల విలువైన బంగారం, వెండి ఎగుమతి చేసిందంటే ఇందులో అనుమానించాల్సిన అంశాలు బలంగా కనిపిస్తున్నాయని పరిశీలకుల అభిప్రాయం. భారత కుబేరుల నల్లధనం గుట్టలు గుట్టలు స్విస్‌ బ్యాంకుల్లో పోగుపడిందనేది చాలా పాత విషయం. అయితే, ఎన్నికల వాగ్దానాలు, ఆ తర్వాత పరిణామాల మధ్య బ్లాక్‌ మనీని వెలికి తీస్తామని సర్కారు చెప్తూ వస్తోంది. పైగా కొంత వత్తిడి కూడా వస్తోంది. ఈ నేపధ్యంలో బ్లాక్‌ మనీ బయటపెట్టేందుకు కేంద్రం సిట్‌ని ఏర్పాటు చేయడంతో బ్లాక్‌ కోబ్రాలు అలర్ట్‌ అయ్యాయంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. ఆ డబ్బును నేరుగా రూపంలో కాకుండా బంగారం రూపంలో నల్లకుబేరులు భారత్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అక్కడి అధికారవర్గాలు కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి నల్లధనం వెలికితీత విషయంలో తమ పూర్తి సహకారం ఉంటుందని స్విస్‌ ప్రభుత్వం భారత్‌కు హామీ ఇచ్చింది. బెర్న్‌కు వచ్చి చర్చల్లో పాల్గొనాలని ఆహ్వానించింది. కానీ, ఈ లోపే ఆ సొమ్మును తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? బంగారం, వెండి రూపంలో ఎగుమతులు జరుగుతున్నాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఓవైపు నల్ల కుబేరుల వివరాలు ఇవ్వడానికి సహకరిస్తామని చెబుతూనే గుట్టు చప్పుడు కాకుండా నల్లధనాన్ని గట్టు దాటించేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లధనం బంగారం రూపంలో స్విట్జర్లాండ్‌ నుంచి తరలిపోతోందని, ఈ వివరాలను కూడా వెల్లడించాలని స్విస్‌ ప్రభుత్వంపై పలు దేశాలు ఇప్పటికే ఒత్తిడి తేవటంతోనే ఎగుమతులు వెలుగు చూశాయి. స్విట్జర్లాండ్‌ నుంచి బంగారం ఎగుమవుతున్న దేశాల్లో భారత్‌ ఒక్కటే కాదు యుఎఇ, సింగపూర్‌, హాంకాంగ్‌, యుఎస్‌, యుకె, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలకూ కూడా బంగారం ఎగుమతులు భారీగా జరుగుతున్నాయి. ఓ పక్క స్విస్‌ బంగారం, మరో పక్క విదేశాలనుంచి వచ్చే గోల్డ్‌ వెల్లువలా వస్తోంది. వాస్తవానికి బంగారం భారతీయుల జీవితాల్లో భాగం. అవునన్నా, కాదన్నా ఇది ఒప్పుకోవాల్సిన విషయం. అలాంటి గోల్డ్‌పై ఆంక్షల వల్ల ఒరిగేదేంటి? రూపాయి దిగజారుతుందంటూ విధించిన ఆంక్షలే ఈ గోల్డ్‌ అక్రమ రవాణాకు దారి తీశాయా? ఆంక్షల కారణంగా గత సంవత్సరం స్మగ్లింగ్‌ బంగారం 942 కోట్లకు పెరిగింది. గత మన్మోహన్‌ ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన తర్వాత స్మగ్లింగ్‌ ముఠాల పంట పండుతోంది. ఈ స్మగ్లింగ్‌ వల్ల దేశానికి, ప్రజలకు రెండు రకాలైన నష్టం. స్మగ్లింగ్‌ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం వుండదు. నల్లధనం విచ్చలవిడిగా చెలామణి అవుతుంది. రెండో నష్టం ఏమిటంటే… భారతీయులు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ రేటుకంటే ఎక్కువ రేటు పెట్టి బంగారం కొనుక్కోవాల్సి వుంటుంది. ఇప్పటికే ఆ ఎఫెక్ట్‌ మార్కెట్లో కనిపిస్తోంది. బంగారం దిగుమతులపై ఆంక్షల వల్ల పరిస్థితులు మెరుగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు. నిజానికి బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించేకంటే.. ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి చర్యలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. భారత్‌లోకి బంగారం భారీ ఎత్తున స్మగ్లింగ్‌ అవుతోంది. ఒకటి కాదు… రెండు కాదు… ప్రతియేటా 2 వందల టన్నుల బంగారం స్మగ్లింగ్‌ అవుతోందంటే నమ్మలేం, కానీ ఇది నిజం. దీని విలువ సుమారు 60 వేల కోట్లు… ఇది అధికారికంగా పట్టుబడ్డ గోల్డ్‌. ఇక చీకట్లో తరలిస్తున్న బంగారం ఎన్ని టన్నులుంటుందో ఊహకందని విషయం. ఇంతకీ ఈ పుత్తడి ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? జనాలకు పుత్తడిపై ఉన్న క్రేజే స్మగ్లర్ల పాలిట వరంగా మారుతోంది. బంగారం దిగుమతులపై కేంద్రప్రభుత్వం నిబంధనలు కఠినం చేయడంతో బంగారం స్మగ్లింగ్‌ భారీగా పెరిగిపోయింది. దక్షిణ ఆసియా, గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌లోకి టన్నుల కొద్దీ అక్రమ బంగారం తరలి వస్తోంది. బంగారం దిగుమతిని పాకిస్తాన్‌ పూర్తిగా నిషేధించింది. అదే సమయంలో భారతీయ కస్టమర్లు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు సింగపూర్‌, థాయ్‌ లాండ్‌ వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. భారతీయుల నుంచి భారీగా బంగారం ఆర్డర్లు వస్తున్నట్టు సింగపూర్‌కు చెందిన గోల్డ్‌ సిల్వర్‌ సెంట్రల్‌ పీటీఈ లిమిటెడ్‌ కంపెనీ చెప్తోంది. స్విస్‌ బంగారమో, దుబాయ్‌ సరుకో మొత్తానికి ఎగురుకుంటూ ఇండియాను చేరుతోంది. అదీ మన హైదరాబాద్‌ ద్వారా. ఈ మొత్తానికి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ కేంద్రమవుతోంది. ఇక శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు చెకింగ్‌లు పెరిగిన కొద్దీ, సరికొత్త పద్ధతుల్లో బంగారాన్ని రవాణా చేస్తున్నారు.. సొమ్ము చేసుకుంటున్నారు. బంగారం ఏ రూపంలో ఉంటుంది? బిస్కట్లు… కడ్డీలు… ఆభరణాలు ఇది మనకు తెలిసిన విషయం. కానీ ఇలా తీసుకొస్తే దొరికే అవకాశాలు ఎక్కువ. అందుకే నిత్యం కొత్త మార్గాలతో ఇన్నోవేటివ్‌గా స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మొన్నటివరకు బంగారం స్మగ్లర్లు కోచి విమానాశ్రయంలో పట్టుబడేవారు. ఇటీవలి కాలంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకుంటున్నారు. అయితే స్మగ్లింగ్‌ అవుతోన్న బంగారాన్ని పూర్తిగా పట్టుకోలేకపోతున్నామని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. రాంగ్‌రూట్లో వెళుతున్న బంగారంలో తాము కేవలం 10 శాతం మొత్తాన్నే పట్టుకోగలుగుతున్నామని కస్టమ్స్‌ అధికారులు చెబుతున్నారు. ఓ ప్రబుద్ధుడు బంగారాన్ని కండోమ్‌లలో పెట్టి తీసుకొచ్చాడు. ఘన రూపంలో కాదు… ద్రవ రూపంలో… ఒకటి కాదు రెండు కాదు… కిలోల కొద్దీ బంగారాన్ని రసాయనాల్లో కరిగించి తెచ్చాడు. ఇక ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో దుబాయ్‌ నుంచి వస్తున్న దంపతుల నుంచి ఆరు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంటే, బ్యాంకాక్‌ నుంచి వచ్చిన భార్యభర్తల దగ్గర 3.9 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఇక శంషాబాద్‌లో ఓ ప్రయాణికుడి చేతిలోని ఐస్‌ క్రీమ్‌ కోన్‌లో ముప్పావు కిలో బంగారం దొరికింది. బట్టల్లో, లో దుస్తుల్లో, షూస్‌ లోపల, ఒంటి లోపల… ఇలా బంగారం రవాణాకు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాలు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. దొరికితే దొంగ… లేకుంటే దొర అన్నట్టు చాలావరకు గోల్డ్‌ స్మగ్లర్లు ఎయిర్‌ పోర్టులోనే దొరికిపోతున్నారు. మరికొందరు అధికారుల కళ్లు గప్పి తప్పించుకుంటున్నారు. కస్టమ్స్‌ అధికారుల కళ్లు గప్పుతూ, కొన్ని ఫ్యామిలీ ముఠాలు ఈ బిజినెస్‌లో బిజీగా మారుతున్నాయి. నెల రోజులు విజిటింగ్‌ వీసాపై దుబాయ్‌, ఆబుదాబి, మస్కట్‌కు వెళ్తున్న ఈ ఫ్యామిలీ ముఠాలు వచ్చేప్పుడు కిలోల కొద్ది బంగారాన్ని వెంట తీసుకొస్తున్నాయి. ఈ మధ్యే మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అరకిలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాఫీ పౌడర్‌లో చిన్న కణికల రూపంలో ఉన్న బంగారాన్ని గుర్తించారు. పుణె ఎయిర్‌ పోర్టులో విత్తనాల రూపంలో ఉన్న అరకిలో గోల్డ్‌ను అధికారులు పట్టుకున్నారు. గోవాలో ఓ ప్రయాణికుడు అతి తెలివిగా ట్రాలీ బ్యాగ్‌ హ్యాండిల్‌లో బంగారాన్ని తెస్తూ దొరికిపోయాడు. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో వాటర్‌ ప్యూరిఫైయర్‌లోని వైర్‌ లోపల 4 కిలోల గోల్డ్‌ను గుర్తించారు. కోచి ఎయిర్‌ పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద ముడతలు ఉన్న రిబ్బన్‌లో ఉన్న గోల్డ్‌తో పాటు సాండిల్స్‌లో రెండు బిస్కట్లు దొరికాయి. ఇవే కాదు టివి సెట్లు, ల్యాప్‌ టాప్‌, మొబైల్‌ బ్యాటరీ స్లాట్‌, ఎమెర్జెన్సీ లాంప్స్‌, పెన్‌ సెట్స్‌, షూ, కట్లరీ సెట్స్‌ లాంటి వాటిలో అక్రమ బంగారాన్ని తరలిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. స్మగ్లర్ల కొత్త టెక్నిక్‌లు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి. వాస్తవానికి బంగారం దిగుమతులపై ఉన్న ఆంక్షలే స్మగ్లింగ్‌కు ప్రధాన కారణమవుతున్నాయి. 1991లో పివి నరసింహారావు ఆర్థిక సరళీకరణ ప్రకటించేంత వరకు బంగారం స్మగ్లింగ్‌ జోరుగా ఉండేది. సరళీకరణ వచ్చి, బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగిన తర్వాత 20 ఏళ్లదాకా బంగారం స్మగ్లర్లకు పనిలేకుండా పోయింది. ఇక యూపిఏ ప్రభుత్వం బంగారం దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో స్మగ్లింగ్‌ ఊపందుకుంది. ఓ పక్క డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మరో పక్క మార్కెట్లో అంత బంగారం లేదు. పైగా పన్ను వాయగొడుతోంది. దీంతో స్మగ్లింగ్‌ పెరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఇతర ఎగుమతుల ద్వారా రూపాయిని బలోపేతం చేసుకోవాలి కానీ, బంగారం దిగుమతిపై ఆంక్షలు సరికాదని వ్యాపార వర్గాలు ఆర్థిక నిపుణులంటున్నారు.

Tags : Sleeping surveillance system


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *