Solar irregularities (Adilabad)

సోలార్ అక్రమాలు (ఆదిలాబాద్)

Date:20/06/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
సౌరశక్తి రాయితీ పరికరాల మంజూరులో భారీగా అక్రమాలు జరిగాయి. దళారులు, అధికారులు కలిసి బోగస్‌ లబ్ధిదారులను సృష్టించుకున్నారు. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్థి సంస్థ లిమిటెడ్‌ (టీఎస్‌ఆర్‌ఈడీసీఎల్‌) కార్యాలయం సాక్షిగా రూ.కోట్ల రాయితీ సొమ్మును కాజేశారు. అవినీతి వెలుగులోకి రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలిస్తే.. సగానికి సగం మంది ఇళ్లల్లో లేకపోయాయి. కొందరు పంట పొలాల వద్ద అమర్చుకున్నామని.. మరికొందరు వ్యాపార దుకాణాల్లో ఏర్పాటు చేసుకున్నామనే తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో నలుగురు అధికారులపైన సస్పెన్షన్‌ వేటు పడింది. విజిలెన్స్‌ అధికారులు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సౌరశక్తిని వినియోగించి విద్యుత్తు శక్తిని ఆదా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా రాయితీ పరికరాలను అందిస్తోంది. 2014-15 నుంచి సోలార్‌ ఇన్వర్టర్లను పంపిణీ చేస్తుంది. 1.కి.వా సామర్థ్యం కలిగిన ఒక్కో సోలార్‌ పవర్‌ ప్యాక్‌ ధర రూ.1.58 లక్షల నుంచి రూ.1.68 లక్షల వరకు పలుకుతుంది. ఇందులో రూ.45 వేలు కేంద్ర ప్రభుత్వ రాయితీకాగా.. మరో రూ.45వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నాయి. ప్రతి ఏటా 2వేల వరకు లబ్ధిదారులకు అందిస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. వీటిలో సగానికి పైగా బోగస్‌ లబ్ధిదారులను సృష్టించి రాయితీ సొమ్మును కాజేస్తున్నారు.
గడిచిన మూడేళ్లల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 5 వేల బయోగ్యాస్‌ ప్లాంట్లు మంజూరయ్యాయి. ఒక్కో ప్లాంటుకు రూ.9 వేలు రాయితీ. వీటిలోనూ బోగస్‌ పేర్లుతో రాయితీ సొమ్మును కాజేశారు. కనీసం వెయ్యి యూనిట్లు కూడా ఏర్పాటు చేయలేదు. వీటిపైన వచ్చిన ఆరోపణలపైన ఆడిటర్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తప్పని పరిస్థితుల్లో విచారణ జరపాల్సి వచ్చింది. దీంతో ఆదిలాబాద్‌ జిల్లా జిల్లా మేనేజర్‌, క్షేత్ర పరిశీలకుడిని సస్పెండ్‌ చేశారు. వీళ్లపైన చర్యలు తీసుకుని వదిలేశారే తప్పా.. రికవరీకి ఆదేశాలు లేకుండాపోయాయి.
ఇన్వర్టర్ల సరఫరాకు టెండర్లు లేకుండానే మాయ చేస్తున్నారు. 2014-15లోనే టెండర్లు నిర్వహించగా.. దాదాపు 25వేల కంపెనీలు పాల్గొన్నాయి. ఆ మరుసటి ఏడాది 2015-16లో టెండర్లు నిర్వహించకుండానే పలు కంపెనీలకు కట్టబెట్టారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడే అధికంగా ధర చెల్లిస్తుండటంతో దిల్లీకి చెందిన మినిస్టర్‌ ఆఫ్‌ న్యూ ఎనవేబుల్‌ ఎనర్జీ (ఎంఎన్‌ఆర్‌ఈ) తప్పుపట్టింది. వీటిపైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. కానీ ఇప్పటికీ విచారణ నివేదిక పంపకపోవడంతో కేంద్ర ప్రభుత్వ రాయితీని నిలిపివేసింది. వీటిపైన విచారణ జరపగా..  సగానికి సగం పరికరాలు లేవని తేలింది. అదే నివేదిక ఇస్తే అధికారుల అవినీతి బయటపడుతుందేమోనన్న భయంతో అక్రమాలు జరగలేదని గుత్తేదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సరఫరా చేస్తున్న కంపెనీల్లో ఎక్కువ మంది ఆ శాఖ ఉద్యోగులే. బినామీలను గుత్తేదారులుగా అవతారమెత్తించారు. దీంతో అక్రమాలు వెలుగులోకి రాకుడా జాగ్రత్త పడుతున్నారు.
సౌరశక్తి రాయితీ పరికరాల్లో జరిగిన అక్రమాలపైన రాష్ట్ర స్థాయిలో విచారణకు ఆదేశించారు. విచారణకు వచ్చిన అధికారులకు కూడా బురడీ కొట్టించారు. దళారులు అధికారులు కలిసి ఆడిన నాటకీయ పరిమాణాలు ఎక్కడ బయటకు వస్తాయో అనే భయంతో సోలార్‌ ఇన్వర్టర్లు ఇచ్చారు.. కానీ.. వాటిని వ్యవసాయ పొలాల వద్ద బికించుకున్నామని కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ప్రాంతాల్లో దుకాణాల్లో ఏర్పాటు చేసుకున్నట్లు సమాధానం చెప్పారు. వాస్తవానికి ఇంటి అవసరాలకు మాత్రమే వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాణిజ్య పరంగా వాడకూడదు. సగానికి సగం పరికరాలు ఏర్పాటు చేయకుండానే రాయితీ సొమ్మును కాజేశారు. విచారణలో బయట పడకుండా లబ్ధిదారులకు ఎంతోకొంత డబ్బు ఇచ్చేసి.. వాళ్లకు ఇన్వర్టర్లు ఇచ్చారు కానీ.. వాటిని వ్యవసాయ పొలాల్లో అమర్చుకున్నామని కాగితాలపైన ముందు జాగ్రత్తగా రాయించుకున్నారు.
Tags:Solar irregularities (Adilabad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *