త్వరలో రూ.5కే భోజనం (నల్గొండ)

Date:19/06/2018
నల్గొండ ముచ్చట్లు:
నల్గొండ, కోదాడ, భువనగిరిటౌన్‌, ఎవరూలేని అనాథలు.. చాలీచాలనీ జీతంతో.. రెక్కల కష్టంమీద బతుకుతూ అర్థాకలితో అలమటించేవారు.. కడుపు నిండా అన్నం తినాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో రూ.5కే భోజనం అందిస్తూ పేదలకు అన్నదానం చేస్తోంది. అదే తరహాలో మునిసిపాలిటీల్లో పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈక్రమంలో  మునిసిపల్‌ అధికారులకు ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ లక్ష్యం ఉన్నతంగా ఉన్న లక్ష్యసాధనకు అమలుకు అనేక అడ్డంకులున్నాయి. కారణం మునిసిపాలిటీల్లో నిధులు, సిబ్బంది కొరతలు ఉండటం, మరో పక్క స్వచ్ఛంద సంస్థల సహకారం లేకుండా సాధ్యం కాదంటున్నారు మునిసిపల్‌ అధికారులు. తక్కువ మెనూ ఇచ్చిన ఒక్కొ భోజనంపై రూ.50ఖర్చు వస్తోందని చెపుతున్నారు.
రూ.45 మునిసిపాలిటీ భరించాలంటే కష్టమంటున్నారు. దాతల సహాయంలేకుండా అన్నదానం కుదరదని చెపుతున్నారు. ఇప్పటికే మునిసిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు డబ్బులు లేవని, కొన్ని మునిసిపాలిటీల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వటానికే నిధులు లేవంటున్నారు. అలాంటప్పడు రూ.5కే భోజనం ఫథకం సాధ్యంకాదని తెగేసి చెప్తున్నారు. జీహెచ్‌ఎంసీలో హరేరామ, హరేకృష్ణ సంస్థ పథకం అమలులో సింహభాగం పాలుపంచుకోవటంవల్లే పథకం విజయవంతమవుతున్నట్లు సమాచారం. అదే తరహాలో ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సంస్థలు భాగం పంచుకుంటే భోజనం ఇవ్వవచ్చునని వారంటున్నారు. లేదంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏడు మునిసిపాలిటీలపై నిత్యం రూ.75వేలు, సంవత్సరానికి రూ.2కోట్ల70లక్షల భారం పడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు సహకరించకపోతే ప్రభుత్వం ఎంతవరకు పథకాన్ని ముందుకు తీసుకువెళ్తుందో వేచిచూడాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ, భువనగిరి, హుజుర్‌నగర్‌, దేవరకొండ ఏడు మునిసిపాలిటీలున్నాయి. ఒక్కొ మునిసిపాలిటీలో పథకం అమలుకు రెండునుంచి 5అన్నదాన కౌంటర్లను ఏర్పాటుచేయాలి. ఆ లెక్కన ఏడు మునిసిపాలిటీల్లో సుమారు 15 కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా కౌంటర్లద్వారా సుమారు 15వందల మంది అన్నం తినే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఒక్కొ భోజనంపై ఖర్చు రూ.50 వస్తోందని వారు చెప్తున్నారు. నిత్యం మునిసిపాలిటీలపై రూ.75వేలు, నెలకు రూ.2లక్షల25వేలు, సంవత్సరంలో రూ.2కోట్ల70లక్షల భారం పడుతోందని చెప్తున్నారు.
రూ.5కే భోజన పథకంలో రైస్‌, ఒక విజిటబుల్‌ కర్రీ, పప్పు, చట్నీ, సాంబరు, నీళ్ల మజ్జిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు సుమారు ఒక్కొక్కరిపై సుమారు రూ.45 ఖర్చు అవుతుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో అమలు చేస్తున్న పథకంలో అయ్యే ఖర్చులో హరేరామ, హ రేరామ కృష్ణ సంస్థ ఎక్కువగా భరిస్తున్నట్లు సమాచారం. మునిసిపాలిటీల్లో ఖర్చు ఎవరు భరించాలన్నదే ప్రశ్న
రూ.5కే భోజనం పథకం అమలు చేయాలంటే మునిసిపాలిటీలు ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంతేకాక మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మాణం చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇదిలా ఉంటే చాలా మునిసిపాలిటీలను నిధులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. మిర్యాలగూడ మునిసిపాలిటీలో సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని సమాచారం. అన్నదాన సెంటర్లలో అన్నం వండేవీలుండదు. ఎక్కడో ఓఇంట్లో అన్నం వండి వాహనాల్లో తరలించాలి. అందుకు వాహనాలతోపాటు, వంట సిబ్బంది, పంపిణీ చేసేవారు కావాలి. ఈక్రమంలో ఇప్పటికే మునిసిపాలిటీల్లో సిబ్బంది లేక పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహకారం, వారి అనుచరులు లేకుండా పథకం అమలు సాధ్యంకాదంటున్నారు. ఇన్ని సమస్యల నడుమ ప్రభుత్వం రూ.5కే భోజనం అందిచాలనే నిర్ణయం ఎంతవరకు అమలు అవుతుందో వేచిచూడాలి.
Tags:Soon Rs 5 KE (Nalgonda)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *