శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి వేడుకగా స్నపనతిరుమంజనం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 16వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు.మొదటిరోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పలపై విహరించడం ఆనవాయితీ. తెప్పోత్సవాలు ఏకాంతం కావడంతో తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు.శుక్రవారం నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో రోజు శ్రీ పార్థసారథిస్వామి వారు, మూడో రోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, నాలుగో రోజు ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, చివరి మూడు రోజులు శ్రీ గోవిందరాజ స్వామి వారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపపరింటెండెంట్ రమేష్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు జయకుమార్, మునిరత్నం పాల్గొన్నారు.
Tags: Sri Govindarajaswami’s Theppotsavalu begins