ఫిబ్రవరి 16న ఏకాంతంగా శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమల ముచ్చట్లు:
 
కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ఫిబ్రవరి 16వ తేదీ తిరుమలలో నిర్వహించే  శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఫాల్గుణ మాసం, పుబ్బ నక్షత్రంలో పౌర్ణమినాడు నిర్వహించనున్నారు. తిరుమల శేషాచలగిరుల్లో ముక్కోటి తీర్థాలున్నాయని ప్రసిద్ధి. తీర్థాలను ధర్మరతిప్రదాలు, జ్ఞానప్రదాలు, భక్తివైరాగ్యప్రదాలు, ముక్తిప్రదాలు అని నాలుగు రకాలుగా విభజించారు.
వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.
పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.
 
Tags; Sri Kumaradhara Tirtha Mukkoti on February 16 in solitude

Natyam ad