18 నుండి 23వ తేదీ వరకు విశాఖలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ -టిటిడి జెఈవో వీరబ్రహ్మం
తిరుపతి ముచ్చట్లు:
విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి 18 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్నామని టిటిడి జెఈవో వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై శుక్రవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఆలయ, పరిపాలన సిబ్బంది తగినంత మందిని డెప్యుటేషన్‌పై పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అన్నప్రసాదాల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలన్నారు. అటవీ, ఉద్యానవన విభాగాల ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. భక్తుల కోసం పాదరక్షలు భద్రపరుచుకునే కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సర్వాంగ సుందరంగా విద్యుత్ అలంకరణ పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అగరబత్తీలు, ఫొటోఫ్రేమ్‌లు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం వద్ద గల ధ్యానమందిరంలో శబ్దం రాకుండా ప్రశాంతంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం వద్ద సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, భక్తులు తిలకించేందుకు డిస్ప్లే స్క్రీన్లు అమర్చాలని ఆదేశించారు.అనంతరం ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో అధికారులతో సమీక్షించారు.ఈ సమావేశంలో ఎస్ఇలు వేంకటేశ్వర్లు, సత్యనారాయణ, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు గోవిందరాజన్, లక్ష్మణ్ నాయక్, విజివో మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:Srivari Temple Mahasamprakshana-TTD JEO Veerabrahman in Visakhapatnam from 18th to 23rd