తెలంగాణలో మహాకూటమి దిశగా అడుగులు

Date:13/02/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో కొత్త ఫ్రంట్‌ దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌పార్టీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు, ఇతర సామాజిక శక్తుల ఆధ్వర్యంలో బహుజన లెఫ్ట్‌ ప్రంట్‌(బీఎల్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ కూడా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలతో కలిసి ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ‘మహాకూటమి’, ‘సామాజిక తెలంగాణ సాధన ఫ్రంట్‌’, ప్రజా ఫ్రంట్‌ వంటి పేర్లను కాంగ్రెస్‌ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్‌పార్టీ ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో ఈ ఫ్రంట్‌ పనిచేస్తుందని కాంగ్రెస్‌పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి విభజన అనంతరం ఆ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన మారింది. తెలంగాణ ఇచ్చామని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నా ఇక్కడి జనం నమ్మటంలేదు.దీంతో టీఆర్‌ఎస్‌ ను వ్యతిరేకించే వర్గాలను,సమూహాలను తమవైపు తిప్పుకుంటే..2019లో ఎన్నికల నావ గట్టెక్కించవచ్చన్న భావన గాంధీభవన్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అందులో భాగంగా..వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ఆ పార్టీని అనేక బలహీనతలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు తగాదాలు, ముఖ్యమంత్రి పదవి కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ, చిన్న చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం వంటి కారణాల వల్ల ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం పొందలేకపోతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్నుంచి బయట పడి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్‌పార్టీ ఫ్రంట్‌ ఏర్పాటును తెరపైకి తేవడం అందులో భాగంగా తెలుస్తోంది. టీజేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆధ్వర్యంలో ఏర్పడబోయే పార్టీ కూడా తమకు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే కోదండరామ్‌తో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ కొప్పుల రాజు, కుంతియా, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ప్రాథమికంగా చర్చలు జరిపారు. కోదండరామ్‌కు మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంగానీ, లేదా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎంపీగా పోటీ చేయించాలనే ఆఫర్‌ ఇచ్చినట్టు తెలిసింది. కోదండరామ్‌ 15 సీట్లు అడుగుతుంటే…కాంగ్రెస్‌ మాత్రం ఐదారు సీట్లకే పరిమితమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించిన గాదె ఇన్నయ్యకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గం టికెట్‌ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ కూడా టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌తో జతకట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇటీవల ఆయన కుంతియాతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. గత ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యను ఈ సారి తమవైపు నుండి పోటీ చేయించాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌పార్టీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కృష్ణయ్య నిర్ణయం చెప్పలేదని తెలిసింది. బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, మాలమహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌ కాంగ్రెస్‌తోనే ఉన్నారు. వారితో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను కూడా తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతలు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయన్ను ఒప్పించేవిధంగా కోదండరామ్‌కు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతున్నది. జేఏసీ చైర్మెన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో పార్టీ ఏర్పాటుకు ముహూర్తం కూడా ఖరారైంది. వచ్చే నెల 10న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ పేరును ప్రకటించాలని జేఏసీ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని జేఏసీలోని కొంతమంది సభ్యులు తెలిపారు. త్వరలో పార్టీ పేరు, గుర్తుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. తెలంగాణ జన సమితి, తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజా సమితి పేర్లపై చర్చిస్తున్నారు. ఈ మూడు పేర్లలో తెలంగాణ ప్రజా సమితి గతంలోనే రిజిస్టర్‌ కాగా, మిగిలిన రెండు పేర్లలో తెలంగాణ సకల జనుల పార్టీ పేరు పెద్దగా ఉందన్న అభిప్రాయాన్ని జేఏసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన తెలంగాణ జన సమితి పేరువైపు జేఏసీ నేతలు మొగ్గు చూపుతున్నారని సమాచారం. పార్టీకి ‘రైతు నాగలి చక్రం’ గుర్తును ఎంపిక చేసే అంశంపై జెఎసిలో చర్చ జరుగుతున్నది. మిలియన్‌ మార్చ్‌ను 2010 మార్చి 10న నిర్వహించింది. అందుకే ఆ తేదీని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.
Tags: Steps towards the Mahakotami in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *