కడుపు కోత

Date:07/12/2018
కడప ముచ్చట్లు:
జిల్లాలో మాతా, శిశు మరణాలతో ఎంతోమందికి కడుపుకోత, కన్నీళ్లు మిగులుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 383 మంది తల్లి కడుపులోనే కరిగిపోయారు. ఏడాది లోపు వయస్సు ఉన్న 261 మంది చిన్నారుల ఊపిరాగింది. 1-5 ఏళ్లలోపు పిల్లలు 28 మంది కన్నుమూశారు. మాతృ మరణాలు 13 జరిగాయి. ఇవన్నీ అధికారిక గణాంకాలే. అనధికారికంగా సాగిన మృత్యుఘోష లెక్కలెన్నో. వైద్య సేవలు, పౌష్టికాహారం సక్రమంగా సరఫరా కావడం లేదు. నివారణ దిశ చూస్తే నేలచూపులు, అంతులేని అలసత్వం, పాలకుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. న్యూమోనియా, అతిసారం, శ్వాసకోశ, రక్తహీనత, పోషకాహారం అందక, ఉమ్మనీరు తాగడం, దవాఖానాల్లో సౌకర్యాలు నాస్తి, సకాలంలో అందని వైద్యం వంటి అంశాలు బంగరు బాల్యంపై మరణశాసనం రాస్తున్నాయి.
జిల్లాలో సమగ్ర మాతా శిశు అభివృద్ధి పథకాలు 15 ఉన్నాయి. 3,621 ప్రధాన, మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా తల్లి, బిడ్డకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 74, ఉప కేంద్రాలు 448, సమగ్ర అత్యవసర గర్భిణీ, శిశు కేంద్రాలు (సీమాంక్‌) ఎనిమిది, పీపీ యూనిట్లు నాలుగు, ఏపీ వైద్య విధాన పరిషత్తు వైద్యశాలలు 12, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు 11, రిమ్స్‌, జిల్లా వైద్యాలయం, వైద్య కళాశాలలు నడుస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఎవరూ కూడా సంపూర్ణంగా పనిచేయడం లేదు. దాంతో ప్రభుత్వాశయం నెరవేరడం లేదు. కళ్లెదుటే ఎంతోమంది కన్నుమూస్తున్నారు.
జిల్లాలో 2013-14 నుంచి 2017-18 వరకు ఐదేళ్లలో అమ్మ కడుపులోనే 4,301 మంది కన్నుమూశారు. ఏడాది లోపు చిన్నారులు 3,791 మంది, 1-5 ఏళ్లలోపు పిల్లలు 314 మంది, తల్లులు 221 మంది మృత్యుఒడిలోకి చేరారు. మునుపటి కంటే శిశు మరణాలు తగ్గినా కన్నీటి విలాపం ఆగట్లేదు. మాతృ ఒడిలోనే కన్నుమూసే వారి సంఖ్య తగ్గుమఖం పట్టడం లేదు.
Tags:Stomach cutting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *