Strong stray on internet pornography

అంతర్జాల అశ్లీల‌తపై కరడుగట్టిన అలసత్వం

Date : 21/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

అంతర్జాల అశ్లీల‌తపై దేశీయంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా సీతకన్ను పడింది. పాలకుల్లో కరడుగట్టిన అలసత్వాన్ని అదనుగా చేసుకుంటున్న అశ్లీల మాఫియా తన ఉనికిని చాటుకోవడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. యువ‌త‌రంపై విప‌రీత ప్ర‌భావం చూపుతున్న అశ్లీల‌ వెబ్‌సైట్లను క‌ట్ట‌డి చేయ‌డంలో భారత ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్య వైఖ‌రిపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు తీవ్ర‌ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. పోర్న్ వెబ్‌సైట్ల‌ను నిరోధించ‌డానికి ప్ర‌భుత్వం క‌ఠిన‌మైన చ‌ర్య‌లెందుకు తీసుకోవ‌డం లేద‌ని జ‌స్టిస్ హెచ్. ద‌త్తుతో కూడిన ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని సూటిగా ప్ర‌శ్నించింది. అశ్లీల‌, న‌గ్న దృశ్యాల‌తో ఉన్న వెబ్‌సైట్ల‌ను నిరోధించ‌డానికి అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటామ‌ని, ముఖ్యంగా చిన్నారుల‌తో చిత్రీక‌రించిన న‌గ్నదృశ్యాల‌ను చూపుతున్న చైల్డ్ పోర్నోగ్ర‌ఫీ వెబ్‌సైట్ల ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సుప్రీం కోర్టుకు గ‌తంలో కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, ఇంత‌వ‌ర‌కూ కేంద్రం ఆ దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అశ్లీల‌ వెబ్‌సైట్ల‌ను వీక్షించే హ‌క్కు పెద్ద‌వారికి ఉంది క‌నుక వారికి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ వేసిన పిల్‌ను సుప్రీం కోర్టు తిరస్క‌రించడంతో పాటు అశ్లీలత కనిపించే సైట్లపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించింది. అయితే, ఈ కేసు స‌మాచార ప్ర‌సార శాఖ ప‌రిధిలోకి రాద‌ని, టెలీ క‌మ్యూనికేష‌న్స్ విభాగం ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని అడిషిన‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ పింకీ ఆనంద్ కోర్టుకు విన్న‌వించారు. ఇంతటితో ఈ కేసు మరుగునపడిపోతుందనుకుంటే పొరపాటే. అశ్లీలతపై న్యాయమూర్తులు వ్యక్తంచేసిన ఆవేదన బట్టిచూస్తే వారిలో మానవీయత కోణం కనిపిస్తోంది. ఇక దేశంలో అశ్లీల వెబ్‌సైట్ల విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా బూతు వైబ్‌సైట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అశ్లీల వెబ్‌సైట్లను కట్టడి చేయాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తించి, అందుకు తగిన చర్యలకు ఉపక్రమించినట్లు ప్రచారం జరిగినప్పటికీ అమలులో ఎక్కడా అది మచ్చుకైనా కనిపించలేదు. అశ్లీల వెబ్‌సైట్లు దేశంలో దాదాపు 4 కోట్ల దాకా ఉంటాయని కంప్యూటర్స్ ఎమర్జెన్సీ టీమ్ అంచనా వేసింది. అశ్లీల వైబ్‌సైట్ల కట్టడి చేసి, నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ప్రధాని ఆదేశించినప్పటికీ ఆచరణలో అది సాధ్యం కాలేదు. దీనికి సంబంధించి అశ్లీల వెబ్‌సైట్స్‌ జాబితాను తయారు చేయాల్సిందిగా ప్రధాని మోడీ సూచించారు. భారతీయ సంస్కృతికి ఇవి విరుద్ధం కాబట్టి వాటిని నిరోధించాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. కాగా, అశ్లీల వెబ్‌సైట్ల వల్ల అత్యాచారాలు, మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని, కాబట్టి వీటిని నిరోధించాలని న్యాయవాది కమలేశ్‌ వాస్వానీ సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. మరోవైపు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్న అశ్లీల వెబ్‌సైట్లపై తెలంగాణ రాష్ట్ర సీఐడీ అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేయని పనిని చేసేందుకు తెలంగాణలోని సీఐడీ అధికారులు ముందుకు వస్తున్నారు. అశ్లీల సైట్లను కట్టడి చేయాల్సిందిగా పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోవడంతో చట్టపరంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బూతుసైట్లను మూసేందుకు చర్యలు చేపట్టారు. 1400 అశ్లీల వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేసిన అధికారులు వీటిపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అశ్లీల వెబ్‌సైట్ల వల్ల తలెత్తుతున్న పరిణామాలను పిటిషన్‌లో వివరించారు. చిన్నారులు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో ఎక్కువమటుకు అవే కారణమనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఒక్కో వెబ్‌సైట్‌కు అనుబంధ లింకులు ఉంటాయని ఇలా వేల సంఖ్యలో అశ్లీల సైట్ల లింకులు చిన్నపిల్లలు, యువతను పెడదారి పట్టిస్తున్న విషయాన్ని కోర్టుకు నివేదించారు. కోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాల ప్రకారం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అశ్లీల సైట్లను నిలువరించాలని తెలంగాణ సీఐడీ అధికారులు భావిస్తున్నారు. అశ్లీల వెబ్‌సైట్ల నుంచి యువత తమ సెల్‌ఫోన్లలో నీలి చిత్రాలను ఎక్కువగా డౌన్‌లౌడ్‌ చేస్తున్నట్లు తెలంగాణ సిఐడి అధికారులు గుర్తించారు. ఫలితంగా మైనర్లు సైతం నేరాలకు పాల్పడుతున్నారని భావించిన తెలంగాణ సీఐడీ అధికారులు గతంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పోర్న్‌ సైట్లను నిషేధించాలని కోర్టులో పిటీషన్‌ దాఖలుచేశారు. ఈ అంశంపై కేంద్రానికి, మొబైల్‌ ఆపరేటర్లకు ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మొబైల్‌ ఫోన్లలో పోర్న్‌ సైట్లు ఓపెన్‌ కాకుండా చేయడంపై అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు, అంతర్జాలం అంటేనే అశ్లీలం. అశ్లీలానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఇంటర్నెట్‌ అనేంతగా ఇంటర్నెట్‌ ‘బూతు’తో నిండిపోయింది. బూతు సినిమాలు, బూతు కథలు, బూతు బొమ్మలు ఒకటేమిటి? వెతికే ఓపిక ఉండాలేగానీ, ఇంటర్నెట్‌లో దొరకని ‘బూతు’ అంటే ఏమీ వుండదు. ఇది ఇప్పటి మాట కాదు. ఇంటర్నెట్‌ పుట్టిన దగ్గర్నుంచీ ఇంటర్నెట్‌ బూతు మయమే. చూసుకున్నోడికి చూసుకున్నంత అన్న ప్రస్తావన ఇంటర్నెట్‌లో బూతుకు సరిగ్గా సరిపోతుందేమో. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్నెట్‌ అశ్లీలంపై కొరడా ఝుళిపించాలనే నిర్ణయం తీసుకున్నప్పటినుంచీ, పరిస్థితులు వేగవేగంగా మారిపోతున్నాయి. వివిధ రాష్ట్రాలూ ఇంటర్నెట్‌ అశ్లీలంపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతున్నాయి. అందరికన్నా ముందుగా తెలంగాణ రాష్ట్ర సీఐడీ ఓ అడుగు ముందుకేసింది. ఆహ్వానిందచగ్గ పరిణామమే ఇది. అయితే ఇంటర్నెట్‌ అశ్లీలంపై పోరాటం అనేది ఈనాటి వ్యవహారం కానే కాదు. ఎప్పటినుంచో ఎన్నో విమర్శలు ఇంటర్నెట్‌ అశ్లీలంపై వెల్లువెత్తుతున్నాయి. అందరికీ అందుబాటులోకి ఇంటర్నెట్‌ వచ్చేశాక, అశ్లీలాన్ని నియంత్రించడం సాధ్యం కావడంలేదు. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు బూతు వెబ్‌సైట్లను నియంత్రించలేకపోతున్నారు. అవి ఆదాయ మార్గాలుగా మారడంతో, సైట్ల నిషేధానికి వ్యతిరేకంగా వివిధ రకాల ఒత్తిళ్ళు తీవ్రాతి తీవ్రంగా పనిచేస్తున్నాయి. పాకెట్‌లో వుండే మొబైల్‌ సైతం బూతు సినిమాలకు నిలయంగా మారిపోతున్న రోజులివి. స్మార్ట్‌ మొబైల్‌ తెరిచినా, ల్యాప్‌ టాప్‌ చూసినా, డెస్క్‌టాప్‌లో వెతికినా ఎక్కడంటే అక్కడ బూతు సినిమాలు దొరికేస్తున్నాయి. అన్నీ ఇంటర్నెట్‌ నుంచి దిగుమతి అవుతున్నవే. ఇప్పటికే దేశంలో చాలావరకు కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు బూతు సినిమాలతో నిండిపోయాయనేది ఓ అంచనా. యువతపై ఈ అశ్లీల సినిమాల ప్రభావం తీవ్రంగా వుండటం, సమాజంలో జరుగుతున్న అనేక అకృత్యాలకు ఈ బూతు సినిమాలే కారణమని తేలడంతో, ఇంటర్నెట్‌ అశ్లీలంపై తక్షణం ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. కానీ, ప్రతిసారీ సందడి చేసినట్లే ఇంటర్నెట్‌ అశ్లీలంపై హడావిడి చేయడం మినహా, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరికీ కలుగుతున్నాయి. సర్వర్‌ మార్చేయడం, లేదా వెబ్‌సైట్‌ అడ్రస్‌ మార్చేయడం ఇలా రకరకాల మార్గాలు బూతు సైట్ల ముందున్నాయి నిషేధం నుంచి తప్పించుకోవడానికి. సో, హడావిడి చేసినంత తేలిక కాదు ఇంటర్నెట్‌ బూతుని అదుపుచేయడం. అయినాగానీ, ఇంటర్నెట్‌ బూతు అంతరించాల్సిందే. ఇందుకు కావాల్సిందల్లా చిత్తశుద్ధి మాత్రమే. అది మన పాలకుల్లో ఎంత వుందో అందరికీ తెల్సిన విషయమే కదా! తాజాగా సుప్రీం కోర్టు వ్యక్తంచేసిన అనుమానాలు, అసంతృప్తి నేపథ్యంలోనైనా కేంద్రం ఈ అంశంపై తీవ్రంగా ఆలోచన చేస్తుందేమో చూడాలి.

Tags : Strong stray on internet pornography

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *