ys-jagan-padayatra_2

ముస్లింలకు సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తాం : వైఎస్‌ జగన్‌

సాక్షి

Date:06/01/2018

సాక్షి, చిత్తూరు :  నవరత్నాల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయటమే తన లక్ష్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం పుంగనూర్‌ నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో ముస్లింల కోసం సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తామన్నారు.

‘ఇవాళ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఒక్కటే చెప్పదల్చుకున్నా. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి మరుగున పడిపోయింది. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది సమర్థవంతమైన పాలన. రాజకీయాలంటే విశ్వసనీయత కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబు. నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి. మహానేత వారసుడిగా ప్రజల శ్రేయస్సు కోసం ఎందాకైనా వెళ్తా. అదే నా అంతిమ లక్ష్యం’ అని జగన్‌ పేర్కొన్నారు.

చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేజీలో.. ఒక్కో కులానికి హామీలు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఎలా దగా చేయాలో రీసెర్చ్‌ చేసిన వ్యక్తి చంద్రబాబు. హామీలు నెరవేర్చకపోగా పైగా ప్రశ్నించిన వారిని ఓ వ్యక్తి తోలు తీస్తా.. తాట తీస్తా అని బెదిరిస్తున్నారు. ఇక్కడే చంద్రబాబు అసలు స్వరూపం బయటపడిందని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

ఇంకా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే… 

  •  చంద్రబాబు మైనార్టీలకు ఇచ్చిన హామీలను ఒక్కసారి పరిశీలిద్దాం. నిరుద్యోగ యువకులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రుణ సదుపాయమన్నారు. వడ్డీ లేని ఇస్లామిక్‌ బ్యాంక్‌ ద్వారా ఆర్థిక పరిపుష్టి కల్పిస్తానని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. వీటిల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా? అని జగన్‌ ప్రశ్నించారు. (జనాల నుంచి లేదు అన్న సమాధానం వినిపించింది)
  •  ప్రతీ దాంట్లోనూ చంద్రబాబు మోసం స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడి దీవెనలు, మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తే ఏం చేయాలో సలహాలు, సూచనలు తీసుకుంటా. అంతకు ముందు నవరత్నాల ద్వారా వైఎస్సాఆర్‌సీపీ ఏం ఏం చేయదల్చుకుందో వివరిస్తానని వైఎస్‌ జగన్‌ అన్నారు.
  • పేదరికంలో ఉన్న వాళ్ల ప్రధాన సమస్యల్లో ఒకటి. పిల్లలు చదువు. లక్షల్లో ఫీజులు ఉంటే రీఎంబర్స్‌మెంట్‌ పేరిట చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేస్తోంది. పండగలు వస్తే ఆయా మతాల మీద చంద్రబాబు ప్రేమ కురిపిస్తారు. కానీ, నిజమైన ప్రేమంటో నేను చెబుతున్నా విను చంద్రబాబు.. ఎంత ఖర్చైనా సరే పిల్లల చదువులకు భరోసా ఇవ్వటమే అసలైన ప్రేమ. అది నేను అందిస్తా. చదివించటమే కాదు.. వారికి ఖర్చుల కోసం 20 వేల రూపాయలను కూడా అందజేస్తానని జగన్‌ పేర్కొన్నారు.
  • పేదలు అప్పులపాలు కాకుండా ఉండేందుకు సాయం చేస్తాం. ఆరోగ్యశ్రీలో అవసరమైన మార్పులు తీసుకొస్తా. ఏపీలోనే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్న ఆరోగ్యశ్రీ కిందకు వర్తింపజేస్తాం. ఆపరేషన్‌ తర్వాత రెస్ట్‌ పీరియడ్‌లో డబ్బులు అందజేస్తాం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి 10 వేల రూపాయల పెన్షన్ అందజేస్తాం అని జగన్‌ వివరించారు.
  • గతంలో అనంతపురంలో చెప్పిన విధంగా ఇమామ్‌లకు 5 వేల రూపాయలకు బదులు 10 వేల రూపాయలు.. మౌసమ్‌లకు 3 వేల రూపాయలకు బదులు.. 5 వేల రూపాయలు అందజేస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
  • ఇక ముస్లిం సోదరులకు ఎంత చేసినా తక్కువేనన్న జగన్‌.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా సబ్‌ ఫ్లాన్‌ను తీసుకొస్తానని హామీనిచ్చారు. నవరత్నాలకు అవసరమైన మార్పులను  సూచించాల్సిందిగా అక్కడ హాజరైన ముస్లిం ప్రజానీకాన్ని ఆయన కోరారు.
  •  ‘మీ కష్టాలను పక్కన పెట్టి చెరగని చిరునవ్వులతో ప్రేమానురాగాలు చూపిస్తూ.. నా భుజాన్ని తడుతూ వెంట నడుస్తున్నా ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ముస్లిం సోదరులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Tags : ys-jagan-padayatra_2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *