తెలుగు రాష్ట్రాల్లో చెరకు రైతు కష్టాలు సరిహద్దు ప్రాంతాల్లోనూ తప్పని శ్రమదానం

ఖమ్మం ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌ ఇలా దేశంలో ఎక్కడకు వెళ్లినా చెరకు రైతుకు చివరకు చేదే మిగులుతుంది. చెరకు రైతుల జీవితాలను పీల్చిపిప్పి చేస్తున్న షుగర్‌ ఫ్యాక్టరీల యాజమన్యాలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించడం లేదు. ప్రతి ఏటా క్రషింగ్‌ సీజన్‌లో మిల్లు యాజమాన్యాలు రైతులతో పేచీ పడుతున్నాయి. ఒక టన్ను చెరకు ద్వారా 40వేల రూపాయలకు పైగా ఆదాయం సంపాదించే షుగర్‌ ఫ్యాక్టరీలు అందులో పది శాతం కూడా రైతులకు ఇవ్వడం లేదు. అదేమి ఖర్మో కాని అందరి నోళ్లు తీపి చేసే చెరకు రైతులు జీవితాంతం చేదు బతుకులే బతకాల్సి వస్తోంది. అందుకే చాలామంది రైతులు చెరకు పంట సాగు చేయాలంటేనే భయపడుతున్నారు. మనదేశంలో దాదాపు 50 లక్షల ఎకరాల్లో చెరకు సాగవుతోంది. 60 నుంచి 70 లక్షల మంది చెరకు రైతులుగానో, చెరకు ఫ్యాక్టరీలలో ఉద్యోగులుగానో, కార్మికులుగానో జీవిస్తున్నారు. మన దేశంలో అయిదు వందలకు పైగా చెరకు మిల్లులున్నాయి. ఓ వైపు చెరకు మిల్లు యజమానుల ఆస్తులు పెరిగి, ముఖాలు విప్పారుతుంటే, మరోవైపు లక్షలాది చైరకు రైతుల అప్పుల పాలై, జీవితంలో చిన్న చిరునవ్వుకి దూరమవుతున్నారు. ప్రపంచ గణాంకాలు తిరగేస్తే చెరకు ఉత్పత్తిలో మనం నెంబర్‌ టూ స్థానంలో వున్నామన్న ఫీలింగ్‌ చాలా సంతోషాన్నిస్తుంది. బ్రెజిల్‌ తర్వాత అత్యధికంగా సాగుచేసే దేశం మనదేనన్న మాట వినప్పుడు మన మనస్సు పరవశిస్తుంది. చైనా, అమెరికాలాంటి దేశాలు చెరకు ఉత్పత్తిలో మనకంటే వెనకబడి వున్నాయన్న సంగతి విన్నప్పుడు మనలో గర్వం తొణికిసలాడుతుంది. చెరకు ఉత్పత్తిలోనే కాదు పంచదార వాడకంలోనూ మనది టాప్‌ పొజిషనే. పంచదార, బెల్లం లేనిదే ఇల్లు గడవదు. బెల్లం వాడకం తగ్గుతూ పంచదార వాడకం పెరుగుతోంది. మన దేశంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 35 కిలోల చక్కెర వినియోగిస్తారని అంచనా. 2030 నాటికి మన దేశంలో చక్కెర వాడకం 52 మిలియన్‌ టన్నులకు చేరుతుందని భావిస్తున్నారు. ఇందులో పంచదార డిమాండే 33 మిలియన్‌ టన్నులు వుంటుందనే అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు మనదేశంలో ఉత్పత్తి అవుతున్నది 19 నుంచి 20 మిలియన్‌ టన్నులే. రాబోయే పదిహేనేళ్ల కాలంలో చక్కెర ఉత్పత్తిని భారీగా పెంచుకోకపోతే ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన దురావస్థ దాపురిస్తుంది. మనకు ఆ దుస్థితి రాయకుండా చేయగలిగింది ఒక్క చెరకు రైతులే. అయితే ఇవాళ చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా వుంది. గత పదేళ్లలో మన దేశంలో చెరకు సాగు విస్తీర్ణం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. చెరకు ఉత్పత్తి 230 నుంచి 350 మిలియన్‌ టన్నుల మధ్య ఊగిసలాడింది. దేశీయ అవసరాలు తీర్చాలంటే మరో పదిహేనేళ్ల కాలంలో చెరకు ఉత్పత్తిని 520 మిలియన్‌ టన్నులకు పెంచుకోకతప్పదు. మన దేశ అవసరాలకు తగ్గట్టుగా చెరకు ఉత్పత్తి పెంచుకోవాలంటే దానిని సాగు చేసే రైతులు యోగ క్షేమాలు కూడా ఆలోచించాల్సి వుంటుంది. కానీ, మనదేశంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. రైతు కుటుంబాల నెలసరి సగటు ఆదాయం కేవలం 2400 రూపాయలు మాత్రమే. ఇది కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి పార్లమెంట్‌లో చెప్పిన లెక్క. నెలసరి ఆదాయం ఇంత తక్కువ స్థాయిలో వుంటే రైతులు బతికేదెలా? వారి కుటుంబాలను పోషించుకునేదెలా? అందుకే చాలామంది రైతులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ పని చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు. 60శాతం మంది రైతులు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా తమ జీవన నౌకను సాగిస్తున్నారన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. వాస్తవాలు ఇంత కఠినంగా వున్నప్పటికీ ప్రభుత్వాలు చెరకు రైతుల సంక్షేమానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం బాధాకరం. కేవలం నాలుగైదు వందల మంది చక్కర పరిశ్రమల యజమానులే 60 లక్షల మంది చెరకు రైతుల జీవితాలను శాసిస్తున్న దురావస్థ. మనదేశంలో చక్కర మిల్లు యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా చలామణి అవుతోంది. ఏ ఒక్క సంవత్సరమూ వారు చెరకుకు గిట్టుబాటు ధర ఇచ్చిన పాపానపోలేదు. రైతులకు ఇవ్వాల్సిన పైకం సకాలంలో చెల్లించరు. ఇవాళ మిల్లులో చెరకు అప్పగిస్తే ఏ మూడు నాలుగు నెలలకైనా బిల్లు చెల్లిస్తారో, లేదో తెలియని దురావస్థ అనేక ప్రాంతాల్లో వుంది. ప్రయివేట్‌ మిల్లు యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్టు చట్టాలు ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో చెరకు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. చెరకులో వ్యర్థంగా పోయేదంటూ ఏమీలేదు. రసం తీయగా మిగిలిన పిప్పి నుంచి కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చు. చెరకు గడల నుంచి 24 రకాల బై ప్రొడక్ట్స్‌ వస్తాయి. ఒక టన్ను చెరకు నుంచి 100 కేజీల పంచదార, 150 యూనిట్ల విద్యుత్‌, 35 లీటర్ల ఆల్కహాల్‌ ఉత్పత్తి చేయొచ్చని బెంగళూరు అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ పరిశోధనలో నిగ్గుతేలింది. వీటి ద్వారా మిల్లు యాజమాన్యాలకు 40వేల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందనడంలో సందేహం లేదు. అందులో పదిశాతం రైతులకు ఇచ్చినా, వారి జీవితాలు కాస్తంత ఒడ్డున పడతాయి. కానీ, యాజమాన్యాలు 2500 రూపాయలకు మించి ఇవ్వడానికి అంగీకరించడం లేదు. ప్రతి క్రషింగ్‌ సీజన్‌లోనూ కనీస ధర కోసం రైతులు పోరాడాల్సి వస్తోంది. చెరకు ఫ్యాక్టరీల యాజమాన్యాలతో విసిగిపోయిన రైతులు చివరకు సాగుచేయాలంటేనే జంకుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఒకప్పుడు తెలుగు నేల మీదే రెండు లక్షల ఎకరాల్లో చెరకు సాగు విస్తీర్ణం పడిపోయింది. ఇలా రైతులు చెరకు సాగుకు దూరమైతే భవిష్యత్‌లో పంచదార, బెల్లంకు తీవ్ర కొరత వచ్చే ప్రమాదం వుంది. అదే జరిగితే వాటి ధరలు మరింత కొండెక్కి కూర్చుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే చైరకు రైతుల సంక్షేమానికీ ప్రభుత్వాలు ప్రయత్నించాల్సి వుంటుంది. ప్రయివేట్‌ షుగర్‌ ఫ్యాకర్టీ యాజమాన్యాల ఒత్తిడికి లొంగకుండా రైతుల శ్రేయస్సు కోసం గట్టి చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.

Tag : Sugarcane farmers’ difficulties in territories in Tamil Nadu are also inadequate


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *