Sun riders do magic ..!

సన్ రైజర్స్ మ్యాజిక్ చేస్తుందా..!

Date:27/05/2018
 హైదరాబాద్‌ ముచ్చట్లు :
సన్ రైజర్స్ హైదరాబాద్…. ఐపీఎల్ టోర్నీలో ఈ పేరు వింటే చాలు… ప్రత్యర్థి జట్టుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఐపీఎల్ టోర్నీలోని 8 జట్లల్లో అత్యంత పటిష్టమైన బౌలింగ్ లైనప్ తో ఉన్న ఏకైక జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. తక్కువ స్కోరును కూడా కాపాడుకుంటూ… ఘన విజయాలు సాధించిన సన్ రైజర్స్ టీమ్… టైటిల్ పోరుకు సిద్ధమైంది.సన్ రైజర్స్ హైదరాబాద్… అనూహ్య పరిణామాలతో ఐపీఎల్ లోకి వచ్చిన హైదరాబాద్ టీమ్… తనదైన శైలిలో చెలరేగిపోతోంది. 2013లో ఐపీఎల్ లో ప్రవేశించిన సన్ రైజర్స్… వచ్చిన తొలి ఏడాదిలోనే ప్లే ఆఫ్ లో నాలుగో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనూహ్య విజయాలతో 2016లో బెంగళూరును మట్టికరిపించి టైటిల్ విజేతగా నిలిచింది.
ప్రస్తుత టోర్నీ ఆరంభానికి ముందు అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్ డేవిడ్ వార్నర్ టోర్నీకి దూరమయ్యాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడాది పాటు వార్నర్ దూరమవ్వడంతో జట్టు బాధ్యతలను స్వీకరించిన విలియమ్ సన్… సారధిగా జట్టును ముందుండి నడిపించాడు. బ్యాటింగ్ లైనప్ లో శిఖార్ ధావన్, యూసుఫ్ పఠాన్, విలియమ్ సన్ కు తోడుగా ఆల్ రౌండర్లు హూడా, బ్రీత్ వైట్, షకీబ్ అల్ హసన్ లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 16 మ్యాచ్ లు ఆడిన విలియమ్ సన్ 8 హాఫ్ సెంచరీలతో 688 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అటు ఓపెనర్ శిఖార్ ధావన్ చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి. అయితే టోర్నీలో అంచనాలకు తగ్గట్టుగా రాణించకుండా యూసుఫ్ పఠాన్ అందరినీ నిరాశపరిచాడు. చివరికి కీలక మ్యాచ్ లలో సైతం పేలవమైన షాట్ లతో పెవిలియన్ చేరుతున్నాడు.బౌలింగ్ లో సన్ రైజర్స్ జట్టుకు మరే ఇతర టీమ్ లు కూడా సాటి రావనే చెప్పాలి. టోర్నీలో బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. తక్కువ స్కోరును కాపాడుకుంటూ సునాయాసంగా విజయం సాధించిన సన్ రైజర్స్ బలం పూర్తిగా బౌలర్లే. రషీద్ ఖాన్, కౌల్, భువనేశ్వర్, సందీప్ శర్మ, షకీబ్ అల్ హసన్, బ్రీత్ వైట్…. టోర్నీలో టాప్ 10 బౌలర్లలో సగం మంది సన్ రైజర్స్ లోనే ఉన్నారు. ఆరంభ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడం… కీలక సమయంలో వికెట్లు తీయడం సన్ రైజర్స్ ప్రత్యేకత. చివరి ఓవర్లలో భువనేశ్వర్, బ్రీత్ వైట్ బౌలింగ్ చేస్తే… ప్రత్యర్థికి చుక్కలు కనిపిస్తాయి. సరైన లైన్ అండ్ లెగ్త్ తో ప్రత్యర్థిని అన్నివిధాలుగా కట్టడి చేయగల సమర్థులు రైజర్స్ బౌలర్లు. చెన్నై తో జరిగిన క్వాలిఫైయిర్ -1లో 90 పరుగులకే 7 వికెట్లు తీసి ఆ జట్టును దాదాపు ఓటమి అంచుల్లోకి తీసుకెళ్లారు. ఇక క్వాలిఫైయిర్-2లో కూడా చివరి ఓవర్లలో నైట్ రైడర్స్ ను కట్టడి చేసి టైటిల్ పోరుకు సిద్ధమైంది.వరుస విజయాలతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్… అనూహ్యంగా చివర్లో తడబడింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో మూడు మ్యాచ్ ల్లో ఓడిన హైదరాబాద్… టైటిల్ పోరులో విజయం సాధించి బదులు తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ముంబై వేదికగా జరిగే టైటిల్ పోరుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:Sun riders do magic ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *