పాకిస్తాన్ కు మళ్లీ సర్జికల్ భయం

Date:13/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
సుంజ్వాన్ సైనిక స్థావరంపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తోన్న భారత్, సరిహద్దులు దాటి ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడరాదని పాక్ హెచ్చరికలు జారీచేసింది. రెండు రోజుల కిందట సుంజ్వాన్ క్యాంప్‌లోని సైనికులు, వారి కుటుంబాలపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరో పదకొండు మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ తీవ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారని భారత్ చేస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని, ఎలాంటి విచారణ లేకుండా ఓ నిర్ణయానికి రావడం సరికాదని పాక్ వ్యాఖ్యానించింది.ఈ ఘటనపై ఎలాంటి దర్యాప్తు చేయకముందే భారత అధికారులు బాధ్యతరహితమైన ప్రకటనలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఇలాంటి ప్రకటనలతో ప్రజల దృష్టిమరల్చి కశ్మీర్‌లో సాయుధ పోరాటాన్ని క్రూరంగా అణచివేయడానికి కుట్రలు పన్నుతోందని, వాస్తవాధీన రేఖను దాటి ప్రతీకార చర్యలకు పాల్పడితే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ, అమానుషంగా వ్యవహరిస్తోన్న భారత్‌ను అంతర్జాతీయ సమాజం నిలదీస్తుందని ఆశిస్తున్నామని, వాస్తవాధీన రేఖ వెంబడి ఎటువంటి దుస్సాహసానికి పాల్పడదని భావిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలను అందించే పాకిస్థాన్, జమ్మూ కశ్మీర్‌లో వారి చొరబాట్లకు సాయం చేస్తుందనేది జగమెరిగిన సత్యం.జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్‌లో ప్రబలంగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాదులతో వేలాది మంది భారత సైనికులు పోరాటం చేస్తున్నారని అన్నారు. రైఫిల్స్, యూబీజీఎల్, గ్రనేడ్లతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని ఆర్మీ తెలిపింది. 2016 సెప్టెంబరులో ఉరి సెక్టార్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు 18 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. అయితే తాము కశ్మీర్‌లో పోరాటాలకు ఎలాంటి సాయం అందించడంలేదని, స్వీయ ఉనికి కోసం పోరాడుతోన్న వారికి కేవలం నైతిక మద్దతు మాత్రమే తెలుపుతున్నామని పాక్ పేర్కొవడం గమనార్హం.
Tags: Surgical fear to Pakistan again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *