టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధం

Date:13/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పై దాడిచేసిన ఎమ్మెల్యేలపై చర్యలకు ప్రభుత్వం సిద్దమయిందా? ముగ్గురు లేదా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు రెడీ అయిపోతున్నారా? అవుననే అనిపిస్తోంది. స్వామి గౌడ్ పై జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సోమవారం గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ ను లక్ష్యంగా చేసుకుని మైక్ విసిరేశారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఆ మైక్ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగలడంతో ఆయన కంటికి తీవ్రగాయమయింది. ఆయనకు సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా దాడి ఘటనపై చర్చకు వచ్చింది. అయితే కాంగ్రెస్ నేతలు స్వామిగౌడ్ పై జరిగిన దాడి పట్ల విచారం వ్యక్తం చేశారు.కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పోలీసుల దాడిలో తనకూ గాయాలయ్యాయని చెబుతున్నారు. గవర్నర్ అన్నీ అసత్యాలు చెబుతుండగా తాము అడ్డుకున్నమాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్ణకరమని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ దాడిని తాము సీరియస్ గా తీసుకున్నామని చెప్పారు. రేపు సభలో స్పీకర్ దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశముంది. తాము సభలో ప్రసంగించేందుకు అవకాశమిస్తామని చెబుతున్నా దాడి చేయడం హేయమైన చర్యగా టీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తున్నారు.కాగా ఈ దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దాడికి పాల్పడిన ముగ్గురు లేదా నలుగురి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. వారిపై అనర్హత వేటు వేయాలన్న ఆలోచనలో ఉన్నారని టీఆర్ఎస్ నేత ఒకరు తెలిపారు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. అయితే అనర్హత వేటు వేస్తారా? ఈ బడ్జెట్ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలే తీసుకోవాలని నిర్ణయించింది. కాగా సీఎల్పీనేత జానారెడ్డి మాత్రం తమ సభ్యులు ఆవేదనతో ఆవేశపడ్డారన్నారు. సభకు తాగి వచ్చారన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై జానారెడ్డి సీరియస్ అయ్యారు. ఇది సభను అవమానించడమేనన్నారు.
Tags: Tea Congress MLAs prepare for action

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *