Telangana polls will be supported by Jagan, Pawan

తెలంగాణ ఎన్నికలు సహాయ పాత్రలోనే జగన్, పవన్

 Date:11/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ఏపీ లో ప్రధాన భూమిక పోషించే పార్టీలు తెలంగాణలో నిర్వహించనున్న పాత్ర పై ప్రస్తుతం ఆసక్తి వ్యక్తమవుతోంది. 2014లో తెలంగాణ గడ్డపై నుంచి అన్ని పార్టీలు పోటీ చేశాయి. ఎనిమిది పార్టీలకు శాసనసభలో ప్రాతినిధ్యం లభించింది. ఇప్పుడు వాటి సంఖ్య కుదించుకుపోవచ్చనే భావన వ్యక్తమవుతోంది. వామపక్షాలు, వైసీపీ అసెంబ్లీలో తిరిగి అడుగుపెట్టడం కష్టమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. సీపీఐ, సీపీఎంలు ఇప్పటికే చెరో బాట పట్టాయి. వైసీపీ వైఖరేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. తెలుగుదేశం కాంగ్రెసుతో కలిసి వెళుతోంది. బీజేపీ బలంపైనా అనుమానాలున్నాయి . లోపాయికారీగా అధికారపార్టీ సహకరిస్తే అంతోఇంతో బలం చాటుకుంటూ నాలుగైదు సీట్లలో గట్టెక్కవచ్చనే బావన వ్యక్తమవుతోంది.
తెలంగాణ జనసమితి, జనసేన వంటివి నామమాత్రమే. గెలుపు సాధించేంత ప్రజాదరణ వాటికి లేదని పరిశీలకులు బాహాటంగానే చెప్పేస్తున్నారు. అయితే ఏ కాంబినేషన్ కారణంగా ఎవరు నష్టపోతారనే ఆసక్తి కి మాత్రం కొదవ లేదు. సామాజిక వర్గ పరంగా వైసీపీకి, పవన్ గ్లామర్ పరంగా జనసేనకు కొంత ఆదరణ ఉంది. అది చట్టసభల్లోకి ప్రవేశించేస్థాయిలో లేదు. కానీ ఆయా పార్టీలు మద్దతిస్తే ప్రధాన పార్టీలకు అదనపు బలం చేకూరుతుంది.ప్రధాన నాయకపాత్రలో రెండు దశాబ్దాలకు పైగా చలనచిత్రరంగంలో రాణించిన పవన్ కల్యాణ్ సహాయపాత్రకు పరిమితం కాబోతున్నారు. 2014లో జనసేనను స్థాపించాక తొలి ఎన్నికకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఆయనది కీలకమైన పాత్రే. రాజకీయంగా విశిష్టమైన భూమికను పోషించింది. వైసీపీ, టీడీపీ కూటముల గెలుపోటముల్లో ఏపీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది.
తెలంగాణలోనూ టీడీపీకి సహకరించింది. ఇప్పుడు సొంతంగా ఒకపార్టీగా రంగంలోకి దిగుతోంది. తెలంగాణలో పవన్ కు వీరాభిమానులున్నారు. యూత్ లో కొంతమేరకు క్రేజ్ ఉంది. పార్టీ నిర్మాణం పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన గతంలో ఉండేది. ముందుగా ఇంట గెలవాలనే ఉద్దేశంతో పవన్ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెట్టారు. ఇప్పుడు తెలంగాణ ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పార్టీని సన్నద్ధం చేసి ఎన్నికల బరిలో దింపేంత వెసులుబాటు లేదు. అర్బన్ పాకెట్లలో తప్ప ఇతర నియోజకవర్గాల్లో పెద్దగా ఓటింగు లభించకపోవచ్చు. ఆయా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేయదని పవన్ తేల్చేశారు. ఎవరో ఒకరికి మద్దతిస్తామంటూ చెప్పేశారు. ఆ ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు.2014 ఎన్నికల్లో తెలంగాణలో సైతం వైసీపిని ఒక ప్రబలమైన శక్తిగానే చెప్పుకోవాలి.
ఒక ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. కొన్ని సామాజిక వర్గాలు, మైనారిటీలు వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత తెలంగాణలో పార్టీ రాజకీయ కార్యాచరణను కుదించివేసుకుంది. అధికారపార్టీలో ఎమ్మెల్యేలంతా చేరిపోయారు. నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల నాయకులూ గులాబీ తీర్థం తీసేసుకున్నారు. దీనిని ప్రతిఘటించేందుకు వైసీపీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జగన్ సన్నిహిత సంబంధాలనే కోరుకున్నారు. ఒకటి రెండు సందర్బాల్లో టీఆర్ఎస్ కు ఎన్నికల్లో మద్దతు అందించారు. రాజకీయాసక్తులు లేకపోవడంతో ఈసారి ఎన్నికలలో ఏం చేయాలనే అంశంపై ఇంతవరకూ కార్యాచరణ మొదలుపెట్టలేదు. గతంలో తెలంగాణ బాధ్యతలను జగన్ సోదరి షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం సాగింది.
ఇప్పుడు ఆ దిశలో ఆలోచన చేయడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణలో చాలామంది అభిమానులున్నారు. జగన్ ప్రస్తుతం అధికారపార్టీతో జగడానికి దూరంగా ఉండాలనే చూస్తున్నారు. ఇది అభిమానులకు రుచించని పరిణామమే.జనసేన, వైసీపీలు రెండూ క్రియాశీల పాత్ర పోషించకుండా ముందస్తు ఎన్నికలను ముగించేయాలని చూడటం చాలామందికి నచ్చడం లేదు. తెలంగాణలో పవన్ అభిమానుల్లో ఎక్కువమంది యువకులు. విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నవారు, కొంతవరకూ సంస్కరణాత్మక భావాలున్నవారు, తెలంగాణ సంస్కృతి జానపదాలను ఇష్టపడేవారు పవన్ అభిమానుల్లో ఎక్కువగా ఉన్నారు. పవన్ అభిమానుల్లో ఎక్కువ శాతం అధికారపార్టీని వ్యతిరేకిస్తున్నారు.
నిరుద్యోగం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం, విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛను నియంత్రించడం వంటి విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందువల్ల జనసేన కచ్చితంగా పోటీ చేయాల్సిందేనంటున్నారు. పవన్ మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. కేసీఆర్ తో ఆయనకు సత్సంబంధాలున్నాయి. అదే సమయంలో కాంగ్రెసుకు చెందిన జగ్గారెడ్డి, హనుమంతరావు వంటి నాయకులంటే ఆయనకు అభిమానం. అధికారపార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెసుతో చేతులు కలిపి కష్టాలు కొనితెచ్చుకునే ప్రసక్తే లేదు. అందులోనూ తెలుగుదేశం , కాంగ్రెసు కలిసి వెళుతున్నాయి కాబట్టి సులభంగానే దూరంగా ఉండవచ్చు.
ఇది టీఆర్ ఎస్ కు సంతోషాన్నిస్తుంది. తమకు స్వేచ్చనిచ్చి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పవన్ అభిమానులు డిమాండు చేస్తున్నారు. వైసీపీ మద్దతు దారులు, వైఎస్ అభిమానులు సైతం తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారు. జగన్ ఇంకా ఈ విషయంలో పూర్తి నిర్ణయం తీసుకోలేదు. అయితే అధికారపక్షానికి అనుకూలిస్తూ, మహాకూటమి ఓట్ల చీలికకు దోహదం చేసే విధంగా పోటీ ఉండొచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. కానీ వైసీపీ అభిమానులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అన్నిస్థానాల్లో పోటీ చేయాలని డిమాండు చేస్తున్నారు.
Tags:Telangana polls will be supported by Jagan, Pawan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *