జూన్ 30 వరకు తాత్కాలికంగా ఆర్జితసేవలు రద్దు-డయల్ యువర్ ఈవోలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుమల ముచ్చట్లు:
వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేశామని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. జోగిరెడ్డి – గుంటూరు
ప్రశ్న: ఎస్వీబీసీలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కల్యాణాన్ని శని, ఆదివారాల్లోనూ ప్రసారం చేయండి, ఊంజల్‌సేవను ప్రసారం చేయండి?
ఈవో : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర ఆలయాలకు సంబంధించిన ప్రత్యక్షప్రసారాలు ఉండడంతో ఎస్వీబీసీలో స్లాట్ దొరకడం లేదు. శ్రీ పద్మావతి అమ్మవారి కల్యాణాన్ని, ఊంజల్‌సేవను ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తాం.
2. విజయేంద్ర – హిందూపురం
ప్రశ్న: ఎస్వీబీసీలో ఆడియో, వీడియో సింక్ కావడం లేదు?
ఈవో : దాతల సహకారంతో రూ.7 కోట్ల వ్యయంతో అత్యాధునిక స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు తెప్పించాం. ఈ సమస్య పునరావృతం కాకుండా చూస్తాం.
3. భావన – వైజాగ్
ప్రశ్న: శ్రీవారి సేవ కోసం ఆన్లైన్లో గ్రూపుగా బుక్ చేసుకోవడం సాధ్యం కావడం లేదు ?
ఈవో : భక్తుల సంఖ్య పెరగడంతో శ్రీవారి సేవకులను ఎక్కువమందిని ఆహ్వానిస్తున్నాం. మీకు ఫోన్‌చేసి శ్రీవారి సేవ అవకాశం కల్పిస్తాం.
4. సుచిత్ర – హైదరాబాద్, యాదగిరి – హైదరాబాద్, ప్రభాకర్ – హైదరాబాద్.
ప్రశ్న: వృద్ధులు దర్శనానికి ఎలా రావాలి ?
ఈవో : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ఆన్లైన్లో రోజుకు 1000 టికెట్లు కేటాయిస్తున్నాం. ఈ టికెట్లు బుక్ చేసుకుని వస్తే నిర్దేశిత స్లాట్‌లో దక్షిణ మాడ వీధిలోని పాయింట్ నుండి దర్శనానికి పంపుతాం. రూ.300/- టికెట్ బుక్ చేసుకుని కుటుంబంతో కలిసి వచ్చే వృద్ధులను బయోమెట్రిక్ ద్వారా దర్శనానికి అనుమతిస్తాం.
5. రమేష్ – పశ్చిమగోదావరి
ప్రశ్న: ఆర్జిత సేవలు లక్కీడిప్‌లో కాకుండా ఎలా పొందాలి?
ఈవో : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో చాలావరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భక్తులు బుక్ చేసుకున్నారు. కొన్ని సేవా టికెట్లను ఆన్లైన్లో లక్కీడిప్ ద్వారా కేటాయిస్తున్నాం. విచక్షణ కోటాలో 10 శాతం టికెట్లు మాత్రమే ఉంటాయి.
6. వెంగళరావు – తెలంగాణ
ప్రశ్న: డిసెంబరులో రూ.300/- టికెట్ బుక్ చేసుకుని దర్శనానికి వచ్చాం. గదులు దొరక్క ఇబ్బందిపడ్డాం?
ఈవో : తిరుమలలో 35 వేల మందికి మాత్రమే బస ఉంది. ఇందులోనూ దాదాపు 60 శాతం అడ్వాన్స్ బుకింగ్ కోసం కేటాయిస్తున్నాం. దర్శన టికెట్లతో గదులను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
7. వెంకట్ – కాకినాడ
ప్రశ్న: ఆన్లైన్ లక్కీడిప్‌లో ఒకే వ్యక్తికి 9 సార్లు సేవ లభించింది. పరిశీలించగలరు?
ఈవో : ఆన్లైన్లో లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించే విధానం చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఈ విషయంపై విచారణ జరుపుతాం.
8. మస్తానయ్య – నెల్లూరు
ప్రశ్న: వారపు సేవలన్నింటినీ రద్దు చేస్తున్నారు ?
ఈవో : తిరుమల శ్రీవారి ఆలయంలో పలు రకాల సేవలున్నాయి. ఆలయంలో ప్రతిరోజూ జరిగే సేవలను నిత్యకట్ల సేవలు అంటారు. వీటిలో సుప్రభాతం, తోమాల, అర్చన, కొలువు, మూడుసార్లు నైవేద్యం, కల్యాణం, ఏకాంత సేవ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆగమం ప్రకారం ఈ సేవలను తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కోవిడ్ సమయంలోనూ టిటిడి ఉద్యోగులు, అర్చక బృందం ఎంతో అంకితభావంతో విధులు నిర్వహించడం ద్వారా ఈ సేవలను ఏకాంతంగా నిర్వహించాం. ఆలయ నిర్వహణకు కావాల్సిన ఆదాయం కోసం నిర్వహించే సేవలను ఆర్జిత సేవలు అంటారు. వీటిలో వారపు సేవలైన విశేషపూజ, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ తదితర సేవలుంటాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం లాంటి ఆర్జిత ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. జియ్యంగార్లు, ఆగమ సలహామండలి, అర్చకుల నిర్ణయం మేరకు విశేష పర్వదినాల సమయంలో ఆర్జిత సేవలను రద్దు చేయడం జరుగుతుంది. కోవిడ్ సమయంలోనూ ఆర్జిత సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 365 రోజుల్లో దాదాపు 450 ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో నిర్వహించే అభిషేకాల వల్ల స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా నివారించేందుకు విశేషపూజ, సహస్రకలశాభిషేకం, వసంతోత్సవం లాంటి ఆర్జితసేవలను వార్షిక సేవలుగా నిర్వహిస్తున్నాం.
అష్టదళపాదపద్మారాధన సేవకు 100 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఈ సేవ నిర్వహించే సమయంలో దాదాపు 7 వేల మందికి దర్శనం కల్పించవచ్చు. అదేవిధంగా, తిరుప్పావడ సేవకు 60 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఈ సేవా సమయంలో దాదాపు 9 వేల మందికి దర్శనం కల్పించవచ్చు. తోమాల, అర్చన తదితర సేవల సమయంలో ఉదయాస్తమాన సేవ భక్తులు జయవిజయుల ద్వారం దాటి లోపలే ఉంటారు కావున సామాన్య భక్తులు కూడా ఆ సేవను దర్శించే అవకాశం కలుగుతుంది.
9. శ్రీనివాస్ – గుంటూరు
ప్రశ్న: ప్రస్తుతం దర్శన విధానం ఎలా ఉంది ?
ఈవో : ఆన్లైన్లో రూ.300/- టికెట్లు బుక్ చేసుకున్న వారికి నిర్దేశించిన స్లాట్లలో దర్శనం కల్పిస్తున్నాం. టికెట్ లేకుండా తిరుమలకు నేరుగా దర్శనానికి వచ్చే వారికి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 నుండి దర్శనానికి పంపుతున్నాం.
10. నరసింహన్ – హైదరాబాద్
ప్రశ్న: తక్కువ మంది భక్తులను అనుమతించి సంతృప్తిగా దర్శనం కల్పిస్తే బాగుంటుంది ?
ఈవో : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు 1999వ సంవత్సరంలో టిటిడి మాన్యువల్ సుదర్శన టోకెన్లను ప్రారంభించింది. ఆ తరువాత 2004లో ఇ-దర్శన్ కౌంటర్ల ద్వారా కంప్యూటర్ బుకింగ్‌ను మొదలుపెట్టింది. ఈ టోకెన్లు పొందినవారు నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనానికి వెళ్లే అవకాశం ఉండేది. ఆ తరువాత 2009లో ఆన్లైన్ ద్వారా రూ.300/- దర్శన టికెట్లు ఇవ్వడం ప్రారంభించింది. 2011లో కాలినడక భక్తుల కోసం నడకదారుల్లో ఉచితంగా టికెట్లు ఇచ్చి దివ్యదర్శనం మొదలుపెట్టింది. 2016 నుండి తిరుపతిలో 3 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తోంది. ఈ విధంగా రోజుకు 20 వేల ఎస్ఇడి టికెట్లు, 20 వేల దివ్యదర్శనం టోకెన్లు, 20 వేల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేసేవారు. రోజుకు దాదాపు 10 వేల మంది వరకు దర్శన టికెట్ లేకుండా తిరుమలకు వెళ్లి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా దర్శనం చేసుకునేవారు. కోవిడ్ సమయంలో దివ్యదర్శనం, ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేయడం జరిగింది. కోవిడ్ అనంతరం తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్ల జారీ ప్రారంభించాం. ఏప్రిల్ 12న ఒకేరోజు ఎక్కువమంది భక్తులు తిరుపతిలోని ఎస్ఎస్డి కౌంటర్ల వద్దకు చేరుకోవడంతో తోపులాట జరిగింది. ఈ కారణంగా ప్రస్తుతం ఎలాంటి టికెట్ లేకపోయినా తిరుమలకు అనుమతించి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా దర్శనం కల్పిస్తున్నాం.
11. అనూరాధ – తణుకు
ప్రశ్న: అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా సహస్రదీపాలంకార సేవలో పాడే అవకాశం కల్పించండి ?
ఈవో : అవకాశం కల్పిస్తాం.
12. మురళీకృష్ణ – చిత్తూరు
ప్రశ్న: శ్రీవారి ఆలయంలో సిబ్బంది లాగేస్తుండడంతో స్వామివారిని దర్శించుకున్న అనుభూతి ఎక్కువసేపు మిగలడం లేదు ?
ఈవో : శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను దేవుళ్లుగా భావించి సేవలందించాలని ఆలయంలోని సిబ్బందికి సూచిస్తున్నాం. భక్తులతో ఎలా మెలగాలి అనే విషయంపై వీరికి తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. శ్రీవారి సేవకుల ద్వారా కూడా భక్తులను క్రమబద్ధీకరిస్తున్నాం.
జయంతి ఉత్సవాలు
– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు మే 14, 15వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి.
– శ్రీ అన్నమాచార్యుల 614వ జయంతి ఉత్సవాలు మే 16 నుండి 22వ తేదీ వరకు తాళ్లపాక, తిరుపతిలో ఘనంగా జరుగనున్నాయి.
అనంతరం ఏప్రిల్ నెలలో నమోదైన వివరాలను ఈవో తెలియజేశారు.
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 20.64 లక్షలు
– హుండీ కానుకలు – రూ.127 కోట్లు
– తిరుమల శ్రీవారి ఇ-హుండీ కానుకలు – రూ.4.41 కోట్లు
– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఇ-హుండీ కానుకలు – రూ.13 లక్షలు
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 99.07 లక్షలు
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 27.76 లక్షలు
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 9.91 లక్షలు.
ఈ కార్యక్రమంలో జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, విజివో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Temporary Cancellation of Acquired Services till June 30-TTD Evo AV Dharmareddy at Dial Your Evo
