ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు

Date:14/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ లో మంత్రి గురువారం ఉదయం ఎస్ఎస్ సీ పరీక్షల టైంటేబుల్ విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు ఉంటాయని, కంపోజిట్ కోర్సులకు మరో అర్ధగంట అదనంగా ఉంటుందని 12.45 వరకు జరుగుతాయని తెలిపారు.2016లో 6,17,030 మంది విద్యార్థులు, 2017లో 6,09,502 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని, 2018లో 6,36,831 మంది హాజరుకానున్నట్లు వివరించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 18 వరకు స్పాట్ వాల్యూషన్ జరుగుతుందని, మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిచాలని అనుకుంటున్నట్లు తెలిపారు.పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కింద కూర్చొని పరీక్షలు రాయవలసిన అవసరంలేదని, 100 శాతం ఫర్నీచర్ సమకూరుస్తామని, లేని చోట అద్దెకు తీసుకోమని కూడా సంబంధిత అధికారులకు చెప్పినట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో ఉంచుతామని, ప్రత్యేక బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడామని, మళ్లీ ఒకసారి మాట్లాడి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కూడా చివరి నిమిషంలో కంగారు కంగారుగా రాకుండా ఒక అర్థగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు.మార్చి 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఏ), 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 కాంపోజిట్ కోర్స్, 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్- II (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్- II కాంపోజిట్ కోర్స్, ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 17న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్ పేపర్-1, 20న ఇంగ్లీష్ పేపర్-II, 21న మ్యాథ్స్ పేపర్-1, 22న మ్యాథ్స్ పేపర్-II, 23న జనరల్ సైన్స్ పేపర్-1, 24న జనరల్ సైన్స్ పేపర్-II, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 27న సోషల్ స్టడీస్ పేపర్-II, 28న ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్- II (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 29న ఎస్ఎస్ సి ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు జరుగుతాయని మంత్రి వివరించారు.
తెలంగాణలో…
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఉదయం 8.45 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక మరో ఐదు నిమిషాల వరకే గ్రేస్ పీరియడ్ ఉంటుందని, ఆ లోపు మాత్రమే లోపలికి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,103 పాఠశాలల నుంచి 5,38,867 మంది(బాలురు 2,76,388, బాలికలు 2,62,479) పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,03,117 మంది, ప్రైవేటు విద్యార్థులు 35,750 మంది ఉన్నట్టు చెప్పారు. ఒకేషనల్ అభ్యర్థులు 20,838 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు.పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,542 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని, హాల్‌టికెట్లు అందని విద్యార్థులు www.bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వీటిపై ప్రధానోపాధ్యాయుల సంతకం, స్టాంపు వేయించుకొని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించడం కోసం 148 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటుచేశామని తెలిపారు. పరీక్షలపై సందేహాల నివృత్తి కోసం డీఈవో, ఎంఈవోలను నియమించామని, ప్రభుత్వ పరీక్షల విభాగంలో టోల్‌ఫ్రీ నంబర్ (18004257462), కంట్రోల్‌రూం ఏర్పాటుచేశామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబు పత్రాలను బయటకు తీసుకెళ్లవద్దని, ఆన్సర్‌షీట్‌పై పేర్లు, సంతకాలు, చిహ్నాలు, నినాదాలు రాయవద్దని, హాల్‌టికెట్ తప్ప ఇతర కాగితాలను పరీక్ష కేంద్రాల్లోకి తేవొద్దని సూచించారు. చూచిరాతకు పాల్పడితే విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకొని డిబార్ చేస్తామని హెచ్చరించారు. ఇన్విజిలేటర్లపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ మేరకు పరీక్ష ప్రారంభానికి ముందే హామీపత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
Tags: Tent tests in Telugu states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *