Tenth pass results in pass percentage score: Bapiraju

టెన్త్ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: బాపిరాజు

Date: 05/01/2018

ఏలూరు ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లాలో 10వ క్లాస్‌ ఉత్తీర్ణత పెంచి 100 శాతం ఫలితాలు వచ్చేటట్లుగా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజాపరిషత్తు ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు డిఇఓ రేణుకను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్తు ఛైర్మన్‌ ఛాంబరులో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి స్టడీమెటీరియల్‌ బుక్స్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా విద్యాదానం గొప్పదని, ప్రతీసంవత్సరం జిల్లాలో ఉన్న 3 వేల పైచిలుకు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ల పేద విద్యార్ధులందరికీ కూడా ఈ పుస్తకాలను నిష్ణాతులైన అధ్యాపకులు, నిపుణులతో సంప్రదించి వారితో ఈ పుస్తకాన్ని జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు, పశ్చిమ గోదావరి జిల్లా వారి ద్వారా ముద్రించడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారు 18 వేల తెలుగు మీడియం, 14 వేల ఇంగ్లీషు మీడియం 10వ తరగతి విద్యార్ధులున్నారని వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని దీనిని అధ్యాపకులు ఈ మూడు నెలలు విద్యార్ధులతో అధ్యయనం చేయించి జిల్లాను నూరుశాతం 10వ తరగతిలో ఉత్తీర్ణులు చేయడానికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. జిల్లా ప్రజాపరిషత్తు గత సంవత్సరంలో కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వలన ఈ ప్రక్రియను చేయలేకపోయిందని, ఈ సంవత్సరం జడ్‌పిటిసిలను సంప్రదించి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని విద్యార్ధులకు అందించాలని ఒక మంచి ఉద్ధేశ్యంతో ముందుగానే ఒకనెల శ్రమ ఓర్చి ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడమైనదని ఆయన అన్నారు. దీనికి అందరూ జడ్‌పిటిసిలు, జడ్‌పి సిఇఓ, డిఇఓ, సర్వశిక్షాభియాన్‌ పివో, తదితరులు అందరూ సహకరించారని వారికి ప్రత్యేకాభినందనలు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా అన్ని గ్రామాలు పల్లెలకు విద్యను ప్రోత్సహించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్టడీ మెటీరియల్‌ పేదవిద్యార్ధులు ఎక్కువ సొమ్ము వెచ్చించి కొనుక్కోలేరు కాబట్టి ఈ స్టడీమెటీరియల్‌ వారికి ఎంతో ఉపయోగపడుతుందని వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలని జడ్‌పి ఛైర్మన్‌ బాపిరాజు చెప్పారు. పేదవిద్యార్ధులకు చదువుకోవడానికి ప్రభుత్వ పధకాల ద్వారా ముఖ్యంగా యస్‌సి, యస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్ధులు ఎన్నో పధకాలను ప్రవేశపెట్టారని దానిలో భాగంగానే యన్‌టిఆర్‌ విద్యానిధి, అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ పధకం లాంటివి వారి భవిష్యత్తుకు బాట వేసుకోవడానికి పైచదువులకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు విదేశాలలో విద్యనభ్యసించేందుకు అందజేస్తున్నదని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత నెల ఆసక్తిగల అర్హులందరికీ కూడా 3వ సంవత్సరం డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్ధులకు జిల్లావ్యాప్తంగా అనుభవం ఉన్న వ్యక్తులతో అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగిందని దానికి కలెక్టరు గారు తీసుకున్న చొరవకు ప్రత్యేకాభినందనలు చెప్పారు. 4వ రోజూ మాఊరు-జన్మభూమి అంశం విద్యావికాసంపై ప్రత్యేకంగా రూపొందించిన కరతాళపత్రాన్ని ముళ్లపూడి బాపిరాజు ఆవిష్కరించారు. బాపిరాజు మాట్లాడుతూ ప్రతీరోజూ గ్రామసభలో ఒక అంశాన్ని నిర్ధేశించారని శుక్రవారం విద్యావికాసంపై చర్చ జరుగుతుందన్నారు. జిల్లాలో జరిగే ప్రతీ గ్రామసభలో ఈఅంశాన్ని చర్చించేటప్పుడు విద్యాశాఖాధికారులు ఉండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అనేక పధకాలు పేదవిద్యార్ధులకు సద్వినియోగంపై అవగాహన కలిగించాలని దీనిని సక్రమంగా అమలు చేసే చర్యలు చేపట్టాలన్నారు. బడిఈడు పిల్లలకు ఆధార్‌ సీడింగ్‌, బయోమెట్రిక్‌ హాజరు, డిజిటల్‌ తరగతులు, వర్చువల్‌ గదులు, ఫైబర్‌ నెట్‌ సౌకర్యం, వ్యాయామం, పతిభాపురస్కారం, ఆత్మరక్షణ, తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, వారి సిబ్బంది ఈ పుస్తకాలన్నీ కూడా ప్రతీ గ్రామసభలో పంపిణీ చేసి ప్రజలకు ప్రభుత్వం పేదవిద్యార్ధినీ విద్యార్ధులకు విద్యపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పధకాలు అమలుపై తెలియాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఇఓ జిల్లా ప్రజాపరిషత్తు డి. సత్యనారాయణ, డిఇఓ సియస్‌. రేణుక, నిడమర్రు జడ్‌పిటిసి దివాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Tenth pass results in pass percentage score: Bapiraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *