అన్నదాతకు పసుపు కష్టాలు 

Date:15/02/2018
నిజామాబాద్‌ ముచ్చట్లు:
 నిజామాబాద్‌ మార్కెట్‌కు పంట పోటెత్తుతుండగా.. ధర మాత్రం తగ్గిపోతోంది! తేమ, ఇతర కారణాలతో వ్యాపారులు ధరలు తగ్గించేస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. పలు మండలాల్లో ధర్నాలు చేస్తూ.. పసుపు ధర తగ్గకుండా చూడాలని కోరుతున్నారు. తేమ ఎక్కువగా ఉందంటూ పత్తి కొనుగోళ్లు నిలిపివేసి ఇప్పటికే పత్తి రైతు కంట్లో ‘తడి’ నింపిన వ్యాపారులు.. ఇప్పుడు పసుపు రైతులకూ అదే సాకు చూపుతున్నారు! నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు నెల రోజులుగా ఫింగర్‌ (కాడీ), బల్బు (గోళ) రకం పసుపు వస్తోంది.వారం రోజులుగా క్వింటాలు రూ.5,500 నుంచి 6,500 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. నాణ్యమైన పంట మాత్రమే రూ.7,100 వరకు ధర పలుకుతోంది. ఒకేసారి రూ.1,500-2000 వరకు ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపులో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్లే ధరలు రావడం లేదని వ్యాపారులు, మార్కెటింగ్‌ శాఖ అఽధికారులు చెబుతుండగా.. వ్యాపారులు, కమీషన్‌, అడ్తీ ఏజెంట్లు కుమ్మక్కవడం వల్లే రావట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు.నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు జిల్లాతో పాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాల నుంచీ రైతులు పసుపును తీసుకొస్తున్నారు. ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే 50వేల ఎకరాలకు పైగా పసుపు సాగైంది. జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లో మరో 20 వేల ఎకరాల వరకు సాగు అయింది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు పసుపు కొనుగోలు చేస్తారు. ఈ నెల మొదటివారం నుంచి మార్కెట్‌కు భారీగా పసుపు తరలివస్తోంది. నిజామాబాద్‌ మార్కెట్‌లో గత నెలలో 76,640 క్వింటాళ్ల పసుపు అమ్మకాలు జరిగాయి. ఈ నెల 1 నుంచి 9 వరకు 76,560 క్వింటాళ్ల పసుపు రావడంతో ధర తగ్గింది.వ్యాపారులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల వారు కావడంతో కమీషన్‌, అడ్తీ ఏజెంట్ల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఉడకబెట్టిన పసుపును ఎక్కువ రోజులు ఎండబెట్టకుండా తీసుకురావడం వల్లే ధర రావడం లేదని కమీషన్‌ ఏజెంట్లు తెలిపారు. మార్కెట్‌లో ఈ-నామ్‌ అమలు చేస్తున్నా రైతులకు మాత్రం ఉపయోగపడడం లేదు. వ్యాపారుల సూచనల మేరకు ఏజెంట్లే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.వారు కూడా కుమ్మక్కవడంతో ధర తగ్గిపోతోంది. ఫలితంగా పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
Tags: Thank you for the yellow hardships

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *