The Congress party has a pest in the country

కాంగ్రెస్‌ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగు

తెలంగాణా నిర్ణయాలు విజయవాడ, దిల్లీ నేతలు తీసుకోవాలా?
పాలమూరు అభివృద్ధికి డీకే అరుణ అడ్డుపడ్డారు
డీకే అరుణ నీ బండారం, చరిత్ర బయటపెడతా ఖబర్దార్!
బాగోతంలో బుడ్డెరఖాన్ లు కత్తులు తిప్పినట్టు తిప్పారు
వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో నిప్పులు చెరిగిన కెసిఆర్
Date:05/10/2018
వనపర్తి ముచ్చట్లు:
కాంగ్రెస్‌ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి వేదికగా తెరాస నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు తెరాస శ్రేణుల నుద్దేశించి కెసిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, తెదేపాల పాలనను ఎండగట్టారు.‘‘తెలంగాణను కాంగ్రెస్‌, తెదేపా 60 ఏళ్లు పాలించాయి. వాళ్ల 60 ఏళ్ల పాలన మా నాలుగు ఏళ్ల పాలన ఎలా ఉంది? గడచిన నాలుగేళ్లలో పాలమూరు జిల్లా ఎలా అభివృద్ధి చెందిందో గ్రామాల్లో చర్చించాలి. అందరం కలిసి బాధలు భరించి 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఆవిర్భావం నాడు భయంకరమైన సమస్యలు ఉన్నాయి.
నీటి కరవు, శిథిలమైన చెరువులు, వలస బతుకులు వంటి ఎన్నో సమస్యలు 2014లో ఉన్నాయి. గొర్రెల పెంపకం విలువేంటో కాంగ్రెసోళ్లకు తెలియలేదు. రోజూ 650 లారీల గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. అది గమనించే గొర్రె పిల్లలు పంపిణీ చేశాం. తెలంగాణలోని యాదవులు దేశంలోనే ఆర్థికంగా బలవంతులైన వారిగా ఎదుగుతారు. తెలంగాణ చిమ్మచీకటి అవుతుందని వెళ్తూ వెళ్తూ.. కిరణ్‌కుమార్‌రెడ్డి శపించి వెళ్లారు. సీమాంధ్ర పాలకుల అంచనాలు పటాపంచలు చేస్తూ నిరంతర విద్యుత్‌ సాధించాం. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’’‘‘గద్వాల్‌లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడారు.
సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు మోసం జరిగింది. నాటిమోసాన్ని అధిగమించి ఇప్పుడైనా.. కోటి ఎకరాలకు నీరు సాధించుకోవాలి. ప్రాజెక్టులకు పునరాకృతి నేను చేసింది కాదు.. ఇంజినీర్లు అధ్యయనం చేసి చెప్పారు. ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే చూసేందుకు కూడా కాంగ్రెస్‌ నేతలు రాలేదు. వాళ్ల లోపాలు, మోసాలు బయటపడతాయని సభకు రాకుండా పారిపోయారు. కాంగ్రెస్‌ నేతలకు సొంత తెలివి లేదు..
సమైక్యాంధ్ర పాలకులకు సంచులు మోసి బతికారు. ఇన్నాళ్లూ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ నేతలకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదు. వైఎస్‌ఆర్‌ పోతిరెడ్డిపాడు ద్వారా 65వేల క్యూసెక్కులు అక్రమంగా తరలిస్తుంటే.. చూస్తూ ఊరుకున్నారు. మంత్రి పదవులకు ఆశపడి సీమాంధ్ర పాలకులను ఎప్పుడూ నిలదీసి అడగలేదు. వాళ్లు దొంగతనంగా నీళ్లు తరలిస్తుంటే.. వీళ్లు హారతి ఇచ్చి పని ప్రారంభించారు. పోతిరెడ్డిపాడు ఆపాలని నేను దిల్లీలో పోరాడాను, ఒకసారి రాజీనామా చేశా.
పాలమూరు జిల్లా బీడు భూమిగా మారడానికి కాంగ్రెస్‌ నేతలే కారణం. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి ఆనాడు నెహ్రూ మోసం చేశారు. దేశానికి పట్టిన చీడపురుగు కాంగ్రెస్‌’’‘‘నేను చెప్పిన మాట్లలో వాస్తవం లేకుంటే తెరాసను ఓడించండి, నిజముంటే పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలి. తెలంగాణ కోసం 19 ఏళ్లుగా పోరాడుతున్నా. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ కావాలి.
ఆరునూరైనా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. తెరాస ప్రభుత్వం రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేస్తోంది. ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లిస్తేనే పాలమూరు జిల్లాలో ఓట్లు అడుగుతా. డిసెంబరు నాటికి మిషన్‌ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తాం. మహబూబ్‌నగర్‌ జిల్లాను చంద్రబాబునాయుడు 9ఏళ్లు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారు? మన తెలంగాణ నిర్ణయాలు మనమే తీసుకుందామా.. విజయవాడ, దిల్లీ నేతలు తీసుకోవాలా? అని పాలమూరు ప్రజలు ఆలోచించుకోవాలి’’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
పాలమూరు అభివృద్ధికి అడుగడుగునా కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ అడుగడుగునా అడ్డుపడ్డారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇలాంటి నాయకులను ఇక్కడి ప్రజలు మళ్లీ కోరుకోవద్దని సూచించారు. నాడు సమైక్య పాలనలో హంద్రీ నీవా కాల్వ 300 కిలోమీటర్ల తవ్వుకుపోతాం’ అని రఘువీరారెడ్డి అంటే, ఆయన ముందు మంగళహారతులు పట్టింది డీకే అరుణ అని, ఈ సాక్ష్యాలన్నీ తమ వద్ద ఉన్నాయని ప్రస్తావించారు. దారుణ వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ బండారం, చరిత్ర బయటపెడతామని కేసీఆర్ హెచ్చరించారు.
నిన్న జరిగిన గద్వాల సభలో కాంగ్రెస్ నాయకులు కత్తులు తిప్పడంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బాగోతంలో బుడ్డెరఖాన్ లు కత్తులు తిప్పినట్టు తిప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ నాయకులు కత్తులు తిప్పాల్సిన చోట తిప్పలేదని విమర్శించారు. ఎలక్షన్ల సమయంలో తియ్యగా, పుల్లగా మాట్లాడి మోచేతికి బెల్లంపెట్టి నాకించారని  అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీల పాలనలో తెలంగాణ ఎలా ఉంది? టీఆర్ఎస్ పాలనలో ఎలా ఉంది? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ సభకు తమ సభలో పల్లీబఠానీలు అమ్ముకున్నంత మంది కూడా రాలేదని విమర్శించారు.
Tags:The Congress party has a pest in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *