‘అప్ప’ శకం ముగిసింది!

-హ్యట్రిక్‌ ఎమ్మెల్యే కడప ప్రభాకర్‌రెడ్డిది ఘన చరిత్ర
-తండ్రినుంచి రాజకీయ వారసత్వం
-భూస్వామ్య కుటుంబమైనా ప్రజలతో మమేకం
-తంబళ్లపల్లె రాజకీయాల్లో ‘అప్ప’ ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టు
-కంటిచూపే ఆదేశం..మాటే శాసనం..
-అప్యాయంగా ‘అప్ప’ అని పలికే జనం
-34 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నేత
-సీఎంగా ఎన్టీఆర్‌ పెద్దమండ్యం వస్తే రోడ్లన్నీ నిర్మాణుష్యం
 
తంబళ్లపల్లె ముచ్చట్లు:
 
 
అందరి నోటా ‘అప్పా’ అని అప్యాయంగా పిలుచుకున్న మాజీ శాసనసభ్యులు కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి (77) సోమవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆ పిలుపుకు దూరమ్యయారు. 1989 నుంచి 2009 వరకు నియోజకవర్గ రాజకీయాల్లో ఆయన మకుటంలేని మహారాజు. అవినీతి మరకలేని స్వఛ్చమైన నాయకుడు. సమస్యలతో అప్పా అంటూ వచ్చే పేదలకు ఆర్థికంగా గుప్తదానాలు చేశారు. ఎందరికో విద్యను అందించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు. పేదలపక్షపాతి అనిపించుకొన్నారు. తండ్రి సమానులైన వారినో, పెద్ద కుటుంబాలకు చెందినవారినో అప్ప అని సంభోదిస్తారు. అయితే ఒక నియోజకవర్గంలోని ప్రజలంతా పార్టీలు, రాజకీయాలు, కుల, మతాలతో సంబంధం లేకుండా జిల్లా రాజకీయాల్లో అందరిచేత అప్పా అని పిలిపించుకొన్న ఘనత ఒక్క కలిచర్ల ప్రభాకర్‌రెడ్డికే దక్కతుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఈనెల 4న బెంగళూరు సెయింట్‌ జాన్స్ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకొన్న ప్రజలు, అభిమానులు అప్పా ఇకలేవా అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన ఆయన తంబళ్లపల్లె నియోజకవర్గ రాజకీయాల్లో కలిచర్ల ప్రభాకర్‌రెడ్డిగా గుర్తింపుపొందిన ఆయనది విలక్షణమైన శైలి. సాధారణ నాయకుల తరహాకు ఆయన భిన్నం. ఆయన మాటతీరు, ధరించే దుస్తులు, తీసుకునే నిర్ణయాలు, పేదలపక్షాన ఉండటం, సమస్యల పరిష్కాం, అభివృద్ది ఇలా ఒకటికాదు అన్నింటిలోనూ ఏ రాజకీయ నాయకునికి లేని పోలిక ఆయనిది. యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాసులో బీఏ పూర్తిచేసిన ప్రభాకర్‌రెడ్డి తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొన్నారు. ఈ ప్రాంతంలో ఆయన తండ్రి కడప నరసింహారెడ్డి అంటే పెద్ద భూస్వామి, పెద్దమండ్యం మండల ప్రజలకు వీరి మాట వేదవాక్కు. కడప నరసింహారెడ్డి, సరస్వతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా ప్రభాకర్‌రెడ్డి రెండో కుమారుడు. అయితే ఆయనకు సంతానం కలగలేదు.
 
 
తండ్రి నరసింహారెడ్డి రాజకీయ నేపథ్యం
తంబళ్లపల్లెలో టీఎన్‌ కుటుంబీకుల హవా నడుస్తున్న సమయంలో కడప ప్రభాకర్‌రెడ్డి తండ్రి కడప నరసింహారెడ్డి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. టీఎన్‌, కలిచర్ల కుటుంబాల మధ్య రాజకీయ పోరు ఉండటంతో అప్పటి కాంగ్రెస్‌ నేత గట్టు నరసింగరావు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసే విషయంలో సయోధ్య కుదిర్చినా సఫలంకాలేదు. కడప నరసింహారెడ్డి తంబళ్లపల్లె తొలి సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సమితి అధ్యక్షునిగా ఉండగానే ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు పదవుల్లో కొనసాగిన ఘనత దక్కించుకొన్నారు. 1964 మే వరకు సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 28,656 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తంబళ్లపల్లె తొలి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన టీఎన్‌.వెంకటసుబ్బారెడ్డి ఓటమిపాలయ్యారు. తర్వాత ఆయన వెహోదటి కుమారుడు కడప సుధాకర్‌రెడ్డి 1972లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి 20,901 ఓట్లు పొంది ఓడిపోయారు. 1978 ఎన్నికల్లో జనతాపార్టీ తరపున పోటీచేయగా 25,236 ఓట్లు సాధించుకొని ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికలో రేణుమాకులపల్లె సర్పంచుగా ఉన్న ఆవుల మోహన్‌రెడ్డి ఇందిరా కాంగ్రెస్‌అభ్యర్థి పోటీచేసి గెలిచారు. 1981లో నరసింహారెడ్డి మూడవ కుమారుడు మధుకర్‌రెడ్డి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికలో గెలుపొందగా, పదవికాలం పూర్తికాకనే 1985 అక్టోబర్‌17న పదవికి రాజీనామా చేశారు.
 
 
 
మూడుసార్లు ఎమ్మెల్యే
స్వగ్రామం కలిచర్ల పేరునే ఇంటిపేరుగా మారిపోయిన కడప ప్రభాకర్‌రెడ్డి రాజకీయ జీవితం సంచలనాల మయం. ఎన్టీరామారావు పాలనలో వచ్చిన మండల వ్యవస్థ తొలి ఎన్నిక జరిగిన 1987లో పెద్దమండ్య మండల పరిషత్‌ తొలి అధ్యక్షునిగా ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడినుంచి వెహోదలైన రాజకీయ జీవితం హ్యట్రిక్‌ ఎమ్మెల్యేను చేసింది. 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా శాసనసభకు బరిలో దిగారు. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కపోవడంతో రెండాకుల గుర్తుపై స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌,టీడీపీ అభ్యర్థులను ఓడించారు. 35,950 ఓట్లతో గెలుపొంది ఎమ్మెల్యే అయ్యాక అసెంబ్లీలో కాంగ్రెస్‌ అసోసియేట్‌ సభ్యునిగా కొనసాగారు. ఈ ఎన్నిక తర్వాత జిల్లాలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి తొలి వర్గీయునిగా గుర్తింపుపొందారు. 1994 ఎన్నికలో తొలిసారి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి టీడీపీ ప్రభంజనంతో ఓటమిపాలైనా 37,658 ఓట్లు పొందారు. 1999 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి 51,030 ఓట్లు సాధించి టిడిపి-బిజేపి ఉమ్మడి అభ్యర్థి చల్లపల్లె నరసింహారెడ్డిని ఓడించారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటిచేసి 36,291 ఓట్లతో గెలుపొంది, మళ్లీ టిడిపి-బిజేపి ఉమ్మడి అభ్యర్థి చల్లపల్లె నరసింహారెడ్డిని ఓడించారు. ఈ ఎన్నికలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవమ్మ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి ఓడారు. మూడుసార్లు హ్యట్రిక్‌ ఎమ్మెల్యే అనిపించుకొన్న కడప ప్రభాకర్‌రెడ్డికి 2009 ఎన్నికలు అచ్చిరాలేదు. కాంగ్రెస్‌పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో ప్రజారాజ్యంపార్టీ అభ్యర్థిగా పోటీచేసి 30,109 ఓట్లు సాధించి ఓడిపోయారు. ప్రభాకర్‌రెడ్డి రాజకీయాల్లో రావడంతో అప్పటిదాక నియోజకవర్గాన్ని శాసించిన టీఎన్‌ కుటుంబం రాజకీయంగా తెరమరుగైంది. ప్రభాకర్‌రెడ్డి జిల్లా రాజకీయాల్లో సీనియర్‌నేతలతో కలిసి పనిచేశారు. మాజీ మంత్రి చెంగారెడ్డి,
 
 
అవినీతి మరకలేని నేత
మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ప్రభాకర్‌రెడ్డిపై ఒక్క అవినీతి ఆరోపణలేదు. రాజకీయంగా ఆరోపణలు వచ్చాయేకాని అవినీతి మరక ఆయన నీడను కూడా తాకలేదు. అన్ని పనులు పారదర్శంగా చేసేవారు. ఆయన హయాంలోనే నియోజకవర్గ అభివృద్దికి బాటలు పడ్డాయి. కలెక్టర్లు, జిల్లా అధికారులను రప్పించి సమస్యలను స్వయంగా చూపించి పరిష్కరించమని కోరేవారు. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినా, నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండేవారు. వారి ద్వారానే అభివృద్ది, పార్టీ కార్యక్రమాలను అమలుచేయించేవారు. ప్రతిగ్రామంలో ఇప్పటికీ అనుచరులున్నారు. తాము అప్ప వర్గమని చెప్పుకోవడానికి నాయకులు ఒక స్టేటస్‌గా భావించేవాళ్లు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కపోవడంతో ఆయన వర్గీయుల్లో ముఖ్య నాయకులు దూరమయ్యారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ను అప్పటి పీసీసీ సభ్యులు సీపీ.సుబ్బారెడ్డి ఆశించి బలంగా ప్రయత్నించినా దక్కలేదు. ఈ ఎన్నికలో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌నుంచి ప్రభాకర్‌రెడ్డి తప్ప టికెట్‌ అశించిన వారులేరు.
 
 
 
ఎన్టీఆర్‌నే ధిక్కరించిన పెద్దమండ్యం జనం
1987లో జరిగిన తొలి మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలకు అప్పటి సీఎం ఎన్టీరామారావు టీడీపీ తరపున ఎన్నికల ప్రచారానికి పెద్దమండ్యం వచ్చారు. రాష్ట్రంలో ఆయన ప్రభంజనం వీస్తుంటే పెద్దమండ్యంలో మాత్రం ప్రజలు ఆయన్ను చూసేందుకై నా రాలేదు. గుర్రంకొండ మండలం నుంచి పెద్దమండ్యం మండలం తురకపల్లె, సిద్దవరం, వడ్డిపల్లె, కలిచర్ల మీదుగా పెద్దమండ్యం వచ్చారు. అయితే ఎన్టీరామారావు మండలంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాక జనంరోడ్లపైకి రాలేదు, ఇళ్లకే పరిమితమయ్యారు. కలిచర్ల కుటుంబంపై ఉన్న అభిమానంతో ప్రజలు ఎన్టీఆర్‌ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ పర్యటనలో రోడ్లు ఖాళీగా ఉన్నాయి. జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఎన్నికలో ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపీపీ అయ్యారు.
 
 
 
ముగ్గురు సీఎంలతో కలిచర్లకు అనుబంధం
కడప ప్రభాకర్‌రెడ్డికి ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలుండేవి. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి జిల్లాలో ఎమ్మెల్యేల్లో తొలి ఇద్దరు అనుచురుల్లో కడప ప్రభాకర్‌రెడ్డి ముఖ్యులు. 2004 ఎన్నికల్లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తంబళ్లపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే తంబళ్లపల్లెను దత్తత తీసుకొంటానని ఈ సభలో ప్రకటించారు. అన్నట్టుగానే వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక నాలుగు సాగునీటి ప్రాజెక్టులను మంజూరుచేసి నిర్మించారు. 2009 జనవరిలో కలిచర్లలో జరిగిన సభలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆకుమానుగుట్ట ప్రాజెక్టను ప్రారంభించారు. వైఎస్సార్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం. వైఎస్‌ ఎప్పుడూ ప్రభాకర్‌ అని సంబోధించేవారు. జిల్లారాజకీయాల్లో ప్రభాకర్‌రెడ్డి వైఎస్‌కు అండగా నిలిచారు. ప్రభాకర్‌రెడ్డికి ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయాన మేనల్లుడు. కిరణ్‌ హాయాంలో నియోజకవర్గ అభివృద్దికి ప్రభాకర్‌రెడ్డి విశేష కృషి చేశారు. 2012 ఏప్రిల్‌లో బి.కొత్తకోటలో కిరణ్‌తో బహిరంగ సభ నిర్వహించారు. దివంగత మాజీ సీఎం రోశయ్యతోను అనుబంధం ఉండేది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సుదీర్ఘమైన రాజకీయ అనుబంధం ఉంది. కాంగ్రెస్‌ రాజకీయాల్లో వర్గవిభేధాలుండగా తర్వాత సమసిపోయాయి. ఈ అనుబంధంతోనే తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి తంబళ్లపల్లె రాజకీయాల్లోకి అడుగుపెడితే సాదరంగా ఆహ్వనించారు. 2019 ఎన్నికల్లో గెలుపుకు కృషి చేశారు. ప్రస్తుత సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని పలుమార్లు కలిసి అభివృద్ది గురించి చర్చించారు.
 
 
 
 
2009 తర్వాత నిలకడలేని రాజకీయం
2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఈ ఎన్నికల్లో పీఆర్‌పీ అభ్యర్థిత్వం ఖరారు చేసుకొన్న తర్వాత కడప ప్రభాకర్‌రెడ్డిలో సంతృప్తి లేదు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధం వీడలేనని ఒకదశలో భావోద్వేగంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో ఓటమిపాలవడం, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణంతో రాజకీయంగా ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అప్పటి సీఎం రోశయ్య సమహొక్షంలో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కొంతకాలానికే 2011లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరారు. 2012లో అప్పటి ఎమ్మెల్యే ఏవీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి రావడంతో ప్రభాకర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షనేత చ ంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో టీడీపీలో చేరారు. నెలతిరక్కనే ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలోకి చేరి పార్టీ అభ్యర్థి ఏవీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గెలుపుకోసం కృషి చేశారు. అప్పటినుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు.
 
 
 
డప్పు శబ్దం వింటే ఆనందం
ఎమ్మెల్యే అయిన తొలిసారి నుంచి ఇటివల వరకు కలిచర్ల ప్రభాకర్‌రెడ్డికి డప్పు శబ్దం వింటే మహాదానందం. ఎమ్మెల్యేగా పల్లెల్లో పర్యటనలకు వస్తే డప్పు కళాకారులు అప్ప వస్తున్నాడని ముందుగానే సిద్దమయ్యేవాళ్లు. పల్లెకు వచ్చి తిరిగివెళ్లే వరకు ఆయన ముందు డప్పు వాయించే వాళ్లు. కారులో కూర్చుని బయలుదేరే వరకు డప్పు శబ్దాలు మార్మోగేవి. ఆయన ఆనందంతో ఆస్వాదించేవారు. తన జుబ్బా జేబులో మెల్లగా చేయిపెడితే చేతికి ఎన్ని నోట్లు వస్తే అన్నినోట్లు ఇచ్చేవారు. అనారోగ్యానికి గురయ్యే కొన్నిరోజుల ముందు అభిమానులు కుర్చీలో కూర్చొబెట్టి ఆయనముందు డప్పు వాయించి ఆనందింపజేసారు.
 
 
 
ప్రమాదాలతో ఆరోగ్య సమస్యలు
ప్రయాణాల సమయంలో కలిచర్ల ప్రభాకర్‌రెడ్డికి జరిగిన పలు ప్రమాదాల కారణంగా చికిత్సలు జరిగాయి. దీనితో పలురకాలుగా అరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఫలితంగా నడవాలంటే ఇబ్బందిగా ఉండేది. అడుగులో అడుగేస్తూ మెల్లగా నడిచేవారు. సభలు, సమావేశాలకు హజరైన కుర్చీకే పరిమితం అయ్యేవారు. కొంతకాలంగా మరింత ఇబ్బందికి గురయ్యారు. మండలానికే పరిమితం అయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దమండ్యం మండలంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై శ్రద్ద చూపిస్తూ వచ్చారు. పలు సమావేశాలకు హజరయ్యేవారు. ఆస్పత్రిలో చేరేముందు కొంతకాలంగా కలిచర్లలో విశ్రాంతి తీసుకొంటున్నారు.
 
 
 
కంటిచూపుతో శాసించారు
తంబళ్లపల్లె రాజకీయాల్లో కలిచర్ల ప్రభాకర్‌రెడ్డిని పూలబాట కానప్పటికి రాజకీయాలను కంటిచూపుతో శాసించారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏవీ.లక్ష్మిదేవమ్మ, బీజేపీ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి రాజకీయ వచ్యీహాలకు తట్టుకుని మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1990లలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు, హత్యాలు, దాడులు, విధ్వంసాలకు దారితీసింది. ఇక్కడి రాజకీయ ఘటనలు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. రాజకీయంగా నియోజకవర్గంలో బలమైన అనుచరులుండేవారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్దికి సంబంధించిన విషయాలపై ప్రభాకర్‌రెడ్డి నిర్ణయం కోసం స్థానిక అధికారి నుంచి జిల్లా అధికారులు వరకు వేచివుండేవారు. ఏ స్థాయి అధికారికైనా అప్ప ఒకసారి ఒక విషయంపై చెప్పినా, ఫోన్‌చేసినా అది వందసార్లు చెప్పినట్టు. అధికారులు ఆ పనిని పనికట్టుకొని పూర్తి చేసేవాళ్లు. సుతిమెత్తగా మౌనంగా కనిపించే ప్రభాకర్‌రెడ్డి హావభావలకు అర్థమేమిటో ఆయన అనుచరులకు అర్థమవుతుంది, దానికి అనుగుణంగా వ్యవహరించేవాళ్లు. ఏ విషయమైనా ఎక్కువగా మాట్లాడే వారు కాదు. ఏ సమస్య పరిష్కారం కాకున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా అధికారులు ఆగ్రహానికి గురికావాల్సిందే. నియోజకవర్గంలోని ప్రతిపల్లెలోనూ ఆయనకు అనుచరులు, అభిమానులు ఉన్నారు. ఎమ్మెల్యేగా గత రెండు ఎన్నికల్లో పోటీచేయకపోవడంతో అనుచరులు ఇతరా పార్టీల్లోకి వెళ్లినా తాము అప్ప మనుషులమని సచెప్పుకొంటారు. నియోజకవర్గంలో ఇప్పటికి ఆయన అభిమానులు ఉన్నారు.
 
 
 
పెద్దాయనకు పెద్దమండ్యం పెట్టని కోట
సొంత మండలం పెద్దమండ్యం కలిచర్ల ప్రభాకర్‌రెడ్డికి పెట్టనికోట. రాజకీయంగా మండల ప్రజలకు ఆయన మాటే వేదం. ఏ ఎన్నిక జరిగినా అత్యధిక మెజార్టీ ఈ మండలందే. ఆయన ప్రతి విజయానికి పెద్దమండ్యం కీలకం. అందుకనే రాజకీయాల్లో ఆయన పట్టు ఎక్కడా సడలలేదు. నియోజకవర్గంలోని ప్రతిపల్లెలో ఆయన వర్గం ఉండేది. గ్రామానికి సంబంధించి ఏ పని జరగాలన్నా ఆయన అనుచురుల ద్వారానే జరిగేది. ప్రభాకర్‌రెడ్డి హయాంలో ఆయన అనుచరులు చెప్పిందే జరిగేది. ఈ మండల ప్రజల ఆదరణతో ఆయన జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌పార్టీలో గ్రూపులో గొడవ అధికం. ఇక్కడ మాత్రం ఏకైక నాయకుడు ఆయన ఒక్కరే. అయితే 2007లో అయన అనుచురులు కొందరు ఆసమ్మతివర్గంగా తెరపైకి వచ్చినా మనుగడ సాగించలేకపోయింది. ప్రభాకర్‌రెడ్డిని ఓడించేందుకు, రాజకీయం బలహీన పర్చేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవమ్మ, బీజేపీ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి వచ్యీహాలకు ప్రతివచ్యీహాలతో రాజకీయంగా ఎదుర్కొని నిలబడ్డారు.
 
 
 
అభివృద్దికి బాటలు ఆయన హాయాంలోనే
2004లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక నియోజకవర్గానికి ఒకేసారి నాలుగు సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేశారు. రూ.3.43 కోట్లతో పెద్దమండ్యం మండలంలో 2,400 ఎకరాలు సాగులోకి వచ్చేలా ఆకుమానుగుట్ట ప్రాజెక్టును నిర్మించి పూర్తిచేయాగా 2009 జనవరి 23న కలిచర్లలో నిర్వహించిన బహిరంగసభలో ఈ ప్రాజెక్టుకు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభోత్సవం చేసారు. తంబళ్లపల్లె సమీపంలో రూ.8.50కోట్లతో చిన్నేరు ప్రాజెక్టు, కోసువారిపల్లె గ్రామంలో రూ.3.17కోట్లతో ద బ్బలగుట్టపల్లె ప్రాజెక్టు, పెద్దతిప్పసముద్రం మండలం మడుమూరు గ్రామంలో రూ.6.20కోట్లతో మిట్టసానిపల్లె ప్రాజెక్టులను కలిచర్ల హయాంలోనే నిర్మించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు కాలువలు నియోజకవర్గంలోసాగేలా, కలిచర్ల రిజర్వాయర్‌ మంజూరు చేయించారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని వ్యాసరాయ సముద్రం చెరువుకు కృష్ణా జలాల తరలింపు పథకం కలిచర్ల కృషితో మంజూరై పనులు జరిగాయి. విద్య, చెరువులు, చెక్‌డ్యామ్‌లు, రహదారుల అభివృద్దికి కృషి చేశారు.

\
దాడులను అరికట్టాలి
Tags: The ‘Dad’ era is over!
 
 

Natyam ad