నాణ్యతకు తిలోదకాలు!

Date:13/02/2018
మెదక్ ముచ్చట్లు:
సిద్దిపేట మండలం నారాయణరావుపేటలో రూ.1.84 కోట్లతో చేపట్టిన వంతెన పనుల్లో నాణ్యతలేమి వెలుగుచూసింది. బ్రిడ్జ్‌కు వివిధ చోట్లు పగుళ్లు తేలాయి. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వంతెన పనులను కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్వహించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివిధ దశల్లో వంతెన పనులు నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టుగా ఇసుక, కంకర, సిమెంట్‌ను వినియోగించడంవల్లే బ్రిడ్జ్‌కు ఈ దుస్థితి పట్టిందని అంటున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పలుచోట్ల  పగుళ్లు ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఇదిలాఉంటే వంతెన నిర్మాణం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా సగం పనులే అయ్యాయి. చాలా చోట్ల కంకర పైకి కనిపిస్తూ, పగుళ్లు తేలి కనిపిస్తోంది. కాంక్రీటు మిశ్రమాన్ని సమపాళ్లలో లెక్కప్రకారం కలపకపోతే వంతెన కుప్పకూలుతుంది. కొన్ని చోట్ల నాణ్యత లేమి కనిపించకుండా స్తంభాల చుట్టూ మట్టి పోసి కప్పేశారని స్థానికులు మండిపడుతున్నారు.సిద్దిపేట మండలంలోని నారాయణరావుపేట, పెద్దలింగారెడ్డి, పుల్లూరు గ్రామాలకు చెందిన రైతులు పొలాలకు సులువుగా వెళ్లివచ్చేందుకే కాక, వర్షపు నీటికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణానికి రెండు సంవత్సరాల క్రితమే నిధులు కేటాయించి, పనులను ప్రారంభించారు. ఇక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ఇతర ప్రాంతాల్లో కూడా చేస్తుండటంతో యంత్రాలు, కార్మికులు లేక నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీనికితోడు పటిష్టంగా నిర్మించాల్సిన వంతెన పనులు అడపాదడపా సాగుతుండడంతో నాణ్యత లేకుండా ఉంటున్నాయి. బ్రిడ్జ్ నిర్మాణంతో వర్షాకాలంలో నారాయణరావుపేటలోని మల్కచెరువు, నర్దకుంట నుంచి నీరు సుమారు 100 ఎకరాల సాగుకు అంది మేలు జరగనుంది. గతంతో చిన్న దారిలో రాకపోకలు సాగించడం కష్టంగా ఉండేది. మంత్రి హరీశ్‌రావు దృష్టికి సమస్యలను తేగా రెండేళ్ల క్రితం నిధుల మంజూరుతో ప్రారంభించారు. రైతాంగానికి ప్రయోజనకారిగా నిర్మిస్తున్న ఈ వంతెనలో నాణ్యతలోపాలు ఉండడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పనుల్లో నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్మాణం తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరుతున్నారు.
Tags: The degenerates to the quality!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *