The development of tourism development is the key to growth

పర్యాటకాభివృద్ధే ప్రగతికి కీలకం వృద్ధి చోదకం

-‘టూరిజం’ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Date:09/10/2018
అమరావతి ముచ్చట్లు:
 నాలుగైదు ఈవెంట్లు నిర్వహించి అదే పర్యాటకాభివృద్ధి అనుకోవడం సరికాదని, రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సేవారంగ వృద్ధికి చోదకశక్తిగా నిలిచేలా కార్య ప్రణాళికలను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
మంగళవారం మధ్యాహ్నం ఆయన తన కార్యాలయంలో ‘ఆంధ్రప్రదేశ్ టూరిజం కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డ్’ (ఏపీటీసీహెచ్‌బీ) 6వ సమావేశంలో పాల్గొని రాష్ట్ర పర్యాటక రంగ ప్రగతిని సమీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడేలా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని, ఇందుకు సంతోష సూచికను ఒక కొలమానంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. భారీ ఈవెంట్లు నిర్వహించడంతో సరిపెట్టుకోరాదని,
ఏడాది పొడవునా రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడే అది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ‘సిటిజెన్ ఎంగేజ్‌మెంట్’తో  టూరిజం యాక్టివిటీని అనుసంధానం చేయగలిగిన నాడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. జల, హరిత, జీవ వైవిధ్యాలకు ఆంధ్రప్రదేశ్ ఆలవాలమని, ప్రకృతి వనరులు, సహజసిద్ధ అందాలకు పెట్టింది పేరుగా వున్న ఈ రాష్ట్రంలో పర్యాటకానికి ఆశించిన గుర్తింపు రాలేదని ఆవేదన వెలిబుచ్చారు.
ఏపీ ఇక పర్యాటక రాష్ట్రం..
‘మొత్తం జీఎస్‌టీలో పర్యాటక రంగానిదే ముఖ్య వాటా. హోటల్ గదులు, ఆహారం, రవాణా సదుపాయాలు, కొనుగోళ్లు.. ఇవన్నీ పరస్పర ఆధారం. వీటన్నింటినీ స్థూలంగా అభివృద్ధి చేసుకున్నప్పుడే మొత్తం పర్యాటక శాఖ ప్రగతి సాధ్యం అవుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.
రాష్ట్రానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు వీలుగా విమానయాన సేవలు, రైళ్లు, బస్సుల అనుసంధానం, సేద తీర్చేందుకు ఉన్న ఏర్పాట్లు, ఇవన్నీ సంతృప్తికరంగా వుంటే రాష్ట్రం రానున్న కాలంలో తప్పకుండా పర్యాటక గమ్యస్థానంగా మారుతుందని చెప్పారు. అద్భుత అందాలకు నెలవైన ద్వీపాలు, విహంగ క్షేత్రాలు, రమణీయ ప్రకృతికి ఆవాసాలైన పర్వత శ్రేణులు, అటవీ ప్రాంతాలు, హస్తకళల గ్రామాలు, పుణ్యక్షేత్రాలు, నదీ-సముద్ర తీరాలు.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు సహజసిద్ధంగా సమకూరిన వనరులని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
మన నీళ్లు మంచి నీళ్లు…
‘కేరళలో బ్యాక్ వాటర్ చూస్తే మురికిమయం, ఇక్కడ కొల్లేరు, పులికాట్ వంటి సరస్సుల్లో స్వచ్ఛమైన నీళ్లు వుంటాయి. అక్కడ హౌస్ బోటింగ్ ముఖ్య పరిశ్రమగా వర్ధిల్లుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలిచింది. ఇక్కడ కూడా అటువంటి కృషి జరగాలి’ అని అన్నారు. కొల్లేరు విహంగ క్షేత్రం రాజధానికి ప్రకృతి సమకూర్చిన పెద్ద బహుమతి అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ‘రంపచోడవరం, మారేడుమిల్లి, లంబసింగి, సీతంపేట, తలకోన, నల్లమల వంటి అటవీ ప్రాంతాలు కూడా పర్యాటకుల్ని ఇటీవలి కాలంలో విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి ప్రదేశాలలో పర్యాటక శాఖ మరిన్ని ఆకర్షణలను జతచేయాలి’ అని సూచించారు.
అలాగే, ఈ రాష్ట్రంలో వున్నన్ని ప్రాచీన దేవాలయాలు మరెక్కడా లేవని, వీటిన్నింటినీ అనుసంధానం చేస్తూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావాలని చెప్పారు.
సహజ సేద్య పర్యాటకం…
‘ఈకాలం యువత మంచి ఆహారాన్ని అన్వేషిస్తున్నారు. వారాంతాల్లో చెఫ్‌గా మారి సొంత వంటకాల తయారీలో నిమగ్నమవుతున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేలా ఆయా ప్రాంతాల విశేష వంటకాలు, రుచులతో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించాలి.
ఇవి ఏవో ఒకసారి జరిపి వదిలేయడం కాదు, నిరంతరం నిర్వహించాలి. ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా అందులో ఫుడ్ ఫెస్టివల్ అంతర్భాగం కావాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పుడున్న పర్యాటక ఆకర్షణలకు తాను కొత్తగా సహజ సేద్య (జెడ్‌బీఎన్ఎఫ్) పర్యాటకాన్ని జత చేశానని, దీన్ని మరింత ప్రమోట్ చేసేందుకు పర్యాటకశాఖ తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను చూసేందుకు మున్ముందు అంతర్జాతీయ పర్యాటకులు రానున్నారని అభిప్రాయపడ్డారు.
హస్తకళలకు నిలయాలైన ఏటికొప్పాక, కొండపల్లి, చేనేత, పట్టు వస్త్రాలకు కేంద్రాలైన మంగళగిరి, పొందూరు, పెడన, నరసాపురం, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కూచిపూడి నాట్యాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నారు.
అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో మెగా శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.కె. మీనా తెలుపగా, రాష్ట్రంలో ప్రతి పట్టణంలో శిల్పారామాల్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. క్రూయీజ్ బోట్లు, షిప్పుల్లో విందులు, వేడుకలు
ఇక ఎవరైనా విందు-వినోదాలు, వేడుకలు జరుపుకోవాలంటే సమీపంలోని జలాశయాలకు వెళ్లవచ్చు. జలవిహారానికి విందు వినోదాలు జత కానున్నాయి. రాష్ట్రంలో ఉన్న ముఖ్య జలాశయాలలో ప్రత్యేకంగా రూపొందించిన బోట్లు, షిప్‌లలో విందు వినోదాలకు పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్య నదులు, సముద్ర ప్రాంతాలలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కృష్ణానదిలో, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతాలలో ఈ సరికొత్త ప్రాజెక్టును అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టూరిజం అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.
డిన్నర్ పార్టీలు, వేడుకలు నిర్వహించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారుచేసిన క్రూయిజ్ బోట్లు, షిప్‌లను ప్రవేశపెడతారు. రెండు ప్రైవేట్ సంస్థలు వీటిని తయారుచేసి నిర్వహించడానికి ముందుకొచ్చాయి. మరింత ఆకర్షణీయంగా ఈ ప్రాజెక్టును రూపొందించి ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి పర్యాటకశాఖ అధికారులకు సూచించారు.
18 ఈవెంట్లు.. ఎక్కడా… ఎప్పుడు..
2018-19లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించే పర్యాటక కార్యక్రమాల క్యాలెండర్‌ను అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముందుంచారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఈ రెండేళ్లలో 18 ఈవెంట్లను తలపెట్టారు. ఇందులో కొన్ని మెగా ఈవెంట్లు. విశాఖలో ఈ ఏడాది డిసెంబర్ 28, 29, 30 తేదీలలో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘ద ట్రైన్ స్టోరీ-వైజాగ్’ పేరుతో మరో ఈవెంట్ వుంటుంది. 2019 జనవరి 18, 19, 20 తేదీలలో అరకు బెలూన్ ఫెస్టివల్ జరుపుతారు. ఈ ఏడాది డిసెంబర్ 22, 23 తేదీలలో అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోనే ఈ డిసెంబర్ 6 నుంచి నాలుగు రోజుల పాటు అమరావతి రెగట్టా పేరుతో పడవ పందేలను నిర్వహిస్తారు. జనవరి 12, 13 తేదీలలో ‘గ్లోబల్ శాంతి’ పేరుతో బుద్దిస్ట్ ఫెస్టివల్ జరుపుతున్నారు.
Tags: The development of tourism development is the key to growth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *