The dominance of the world!

ప్రపంచంపై పెద్దన్న ఆధిపత్యం!

Date: 06/01/2018

అమెరికా ముచ్చట్లు:

పేరుకే కాదు, పెద్దరికంలోనూ అమెరికా అగ్రరాజ్యమేనని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. డాలర్ ఆధిపత్యానికి ఇక తెర పడినట్లేనని 1960వ దశకం నుంచీ ఎంతోమంది ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు నాడున్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఇక డాలర్ పాడెక్కినట్లేనని కూడా అన్నారు. ఇలా అని అర్ధ శతాబ్దానికి పైగా కావస్తున్నది. ఆర్థికవేత్త లు అంచనా వేసినట్లు డాలర్ తన ఉనికిని కోల్పోలేదు. ఈ క్రమంలో డాలర్ అనేక ఉత్థానపతనాలు చూసింది. తిరోగమన, పురోగమనాలను అనుభవించింది. దశలవారీగా డాలర్ అనేకరూపాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. సంక్షోభాలను ఎదుర్కొని, అధిగమించింది. డాలర్ ఎదుర్కొన్న సవాళ్లలో ఉదహరించాలంటే ఆయాదేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొన్న సంక్షోభాలను గురించి పేజీలకు పేజీలు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 1969లో లండన్‌లో గోల్డ్‌పూల్‌లో తీవ్ర సంక్షోభం తలెత్తింది. దేశంలోని ఎనిమిది సెంట్రల్ బ్యాంకులు కూడా ఏకమై డాలర్ విలువ పతనాన్ని నిలువరించలేకపోయాయి. ఈ క్రమంలోనే 1970 వచ్చే నాటికి బ్రెట్టన్ ఉడ్ సిస్టం కుప్పకూలిపోయింది. దీనికంతటికీ డాలర్ మూలకారణం. డాలర్‌లో వచ్చిన పతనం ఇంగ్లండ్‌ను కుదిపేసింది. అమెరికాలో రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్, జిమ్మీ కార్టర్‌ల కాలంలో డాలర్ తీవ్ర ఒత్తిళ్లకు లోనైంది. ఆ సమయంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంలో డాలర్ చాలా కనిష్ఠ స్థాయికి బక్కచిక్కిపోయింది. 2001 వచ్చేనాటికి ఎంత చిన్న రూపంలో డాలర్ పతనం ప్రారంభమైనా అది క్రమంగా పెరుగుతూనే పోయింది. అమెరికాను కుదిపేసిన టెర్రరిస్టు దాడుల నేపథ్యం కూడా డాలర్‌ను మరింత కుదిపేసింది. ఈ నేపథ్యంలోనే మునుపెన్నడూ లేని విధంగా అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2008 అమెరికా ఆర్థిక సంక్షోభం దానికి ప్రతీకగానే చెప్పుకోవచ్చు. అయినా అంతర్జాతీయంగా డాలర్ శక్తి స్థిరంగానే కొనసాగుతున్నది. డాలర్ పతనంతో ఎదుర య్యే పరిస్థితుల గురించి చెప్పిందంతా నిజమైంది. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో బ్యాంకుల నికర ద్రవ్య నిలువలు తరిగిపోయాయి. ఆయాదేశాల పాలక ప్రభుత్వాలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ మారకంలో పెట్రో డాలర్ ప్రముఖ స్థానం ఆక్రమించింది. పెట్రోలియం ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో ప్రధానమై పోయింది. ఈ క్రమంలోనే వెనుజులియన్ నేతలు పెట్రోలును మారకంగా చేసుకుని ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలకు దిగ్భ్రాంతిని కలిగించేదేమంటే డాలర్‌లో ఇన్ని కుదుపులు, పతనాలు సంభవిస్తున్నా దాని ప్రాభవం తగ్గకపోవటమే. అలాగే ట్రెజరీల నిల్వల శక్తి తగ్గటం లేదు. ఇది ఎంతో వినాశకంగా చెప్పుకునే 1812నాటి యుద్ధ కాలంనాటి స్థితులు ఎదురైనా డాలర్ తన ప్రభావాన్ని కోల్పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమెరికా సెంట్రల్ బ్యాంకు, అమెరికా ట్రెజరీలోని నికర ద్రవ్యనిలువలు ప్రపంచాన్ని శాసిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంతో దేశ దేశాలతో అమెరికా నెరుపుతున్న మిలిటరీ సంబంధాలు డాలర్ పట్టును కొనసాగిస్తున్న స్థితి ఉన్నది. ప్రపంచంలో చాలా దేశాలు తమ రక్షణ, అణ్వాయుధ అవసరాల కోసం అమెరికా, దాని డాలర్‌పై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో అమెరికా నెరుపుతున్న సైనిక సంబంధాలు వాటి విదేశీ మారకంలో ఆయుధ సంపత్తి సమకూర్చటంగా ఉంటున్నది. ఒకానకొక అంచనా ప్రకారం 30 శాతం ఆయుధ సాయంపైనే ఆధార పడి ఉంటున్నది. ఇలాంటి ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఆర్థికవ్యవస్థల్లో వచ్చిన సంక్షోభాలు, ఆయుధ తోడ్పాటుతో పూడ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నది. అంతర్జాతీయంగా రాజకీయ ఆధిపత్యం కోసం ట్రంప్ అనుసరిస్తున్న తీరుతో డాలర్ అదే వేగంతో పరుగులు తీయలేక చతికిలపడుతున్నది. దౌత్యసంబంధాల స్థానంలో రాజకీయ ఆధిపత్యానికి పెద్దపీట వేస్తుండటంతో అదే స్థాయిలో డాలర్ తరిగిపోతున్నది. మరోవైపు దక్షిణ కొరియా, జపాన్ తమ ఆర్థిక వ్యవస్థల్లో 80 శాతం ద్రవ్య నిలువలన్నింటినీ డాలర్ల రూపంలోనే ఉంచుకున్నాయి. ఈ దేశాలు అమెరికాతో ఉన్న అనుబంధ, సంబంధాల నేపథ్యంలో తమ ఆర్థిక వ్యవస్థల ను సుస్థిరంగా ఉంచుకోవటం కోసం తంటాలు పడుతున్నా యి. కాకుంటే ఇలాంటి అస్తిత్వ పోరాటాలు ఎంత మేరకు నిలదొక్కుకుంటాయో కాలమే చెప్పాలి. మరోవైపు, ఉత్తర కొరియా అనుసరిస్తున్న విధానం ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలకు చిల్లులు పెడుతున్నది. ఆయుధ సంపత్తిపై ఖర్చుకు అనివార్యస్థితికి నెట్టబడుతున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న దుందుడుకుతనంతో మరింతగా ఉద్రిక్తతలు పెరిగి, మరింతగా ఆర్థిక అనిశ్చితికి కారణమవుతున్నది. చర్చల ద్వారా గత పాలకుడు బరాక్ ఒబామా ఇరాన్‌తో చేసిన దౌత్య నీతి, ఇప్పుడు ట్రంప్ అనుసరించకుండా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అమెరికా, ఉత్తర కొరియాతో దౌత్యపరమైనచర్చల ద్వారానే సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలి. సైనిక పరమైన కదలికలకు స్వస్థిచెప్పి చర్చలకు పెద్దపీట వేయాలి. మరోవైపు అవకాశం కోసం ఎదురుచూస్తున్న చైనా ఆర్థికంగా, రాజకీయంగా శక్తి పుంజుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భౌగోళికంగా చైనా ఆధిపత్యం పెరిగితే, ఇప్పటికే ఆర్థికంగా ప్రబలశక్తిగా ఎదిగిన చైనా తన ఆర్థికశక్తి ద్వారా కూడా ఆసియా ప్రాంతాన్నే కాదు, ప్రపంచాన్నే శాసించే పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే దేశాలన్నీ, ముఖ్యంగా అమెరికా మసులుకోవాలి. ఇదే డాలర్‌ను సుస్థిరంగా ఉంచగలదు. కాకపోతే, అనుసరించాల్సిన ఆర్ధిక విధానాలే సక్రమంగా ఉండాలి.

Tags: The dominance of the world!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *