వేగంగా కొనసాగుతున్న మిషన్ భగీరధ పనులు

Date:12/03/2018
నల్గొండ ముచ్చట్లు:
మిషన్ భగీరథలో భాగంగా ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలను తరలించి వాటిని శుద్ధి చేసిన ప్రతి ఇంటికి సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కోదండపురం మెట్రో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటులో రూ. 23 కోట్లతో వాటర్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఇక్కడి నుండి మూడు నియోజక వర్గాల్లోని 366 గ్రామాలకు రోజుకు 50 ఎంఎల్‌డీ ( మెగాలీటర్స్‌ఫర్ డే ) నీటి అందించనున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని కోదండపురం, చిలకమర్రి, వద్దిపట్ల, బొంతగట్టు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సంపులకు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక పైపులైన్ల ద్వారా దేవరకొండ, సాగర్, మునుగోడు నియోజకవర్గాల్లోని గ్రామాలకు సరఫరా చేస్తారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తి కాగా గురువారం కోదండపురం వాటర్‌ట్రీట్‌మెంట్ ప్లాంటు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదండపురం సమీపంలోని సంపు, 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకమర్రి సంపులకు అధికారులు పంపింగ్ చేశారు. దీంతో పాటు మిగిలిన వద్దిపట్ల, బొంతగట్టు సంపులకు కూడా మరో మూడు రోజుల్లో పంపింగ్ చేయనున్నారు. ఇప్పటీకే ఆయా సంపుల పరిధిలోని గ్రామాలకు పైపులైను పూర్తి కాగా గ్రామాల్లో ట్యాంకులు, ఇంట్రాపైపులైన్ల ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్నాయి. కోదండపురం ప్లాంటులోని మెట్రో వాటర్ బోర్డు ఇన్‌టేక్ వెల్ నుంచి మిషన్ భగీరథ ప్లాంటులోని ఏరియేటర్‌కు రా వాటర్ తీసుకున్నారు. ఈ నీటిని రిజర్వాయర్, చిల్లింగ్ చాంబర్ ద్వారా క్లాఫిక్యులేటర్‌లో కొద్దిపాటిగా శుద్ధి చేసిన తర్వాత ఫిల్టర్ బెడ్ ద్వారా పక్కనే ఉన్న పంపుహౌస్‌లోకి పంపారు. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటార్లతో ప్లాంటు పరిధిలోని సంపులకు నీటిని తరలిస్తున్నారు. ఇలా సుమారు నాలుగు గంటల పాటు వద్దిపట్ల, కోదండపురం సంపులకు ఇంటర్నల్ ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు ఈ సందర్భంలో గుర్తించిన లోపాలను సవరించే పనిలో పడ్డారు. ఇప్పటికే కోదండపురం ప్లాంట్ పరిధిలో 95 శాతం సివిల్ పనులు మెగా కంపెనీ పూర్తి చేయగా ఎలక్ట్రికల్ పనులు రాఘవ కంపెనీ చేపడుతుంది. ప్లాంటలోని సంపులో నీటిని తరలించేందుకు ప్రతియూనిట్‌కు మూడు మోటార్లు కలిపి నాలుగు యూనిట్లకు 12 మోటార్లు బిగిస్తున్నారు. దీంతో ప్రతి యూనిట్ ఒకే మోటార్ నడుస్తుండగా మిగిలిన రెండు మోటార్లు రిజర్వ్‌లో పెడుతున్నారు. దీని ద్వారా ఎట్టి పరిస్థితిలో నీటి తరలింపులో అంతరాయం ఏర్పడకుండా చూసేందుకు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజులుగా రాఘవ కంపెనీ ఎలక్ట్రికల్ పనులు చేపట్టడంలో జాప్యం చేయడంతో నేరుగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఇటీవల ప్లాంటు సందర్శించి కాంట్రాక్టర్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పాటు అధికారులు రంగంలోకి దిగి వారు పనులు వేగవంతంగా చేసేలా చర్యలు చేపట్టడంతో ఆరుమోటార్లును వినియోగంలోకి తీసుకవచ్చి ట్రయల్ రన్ చేస్తున్నారు. ఈఈ సంపత్‌తో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు అక్కడే తిష్ట వేసి మిగిలిన మోటార్ల బిగింపు, ట్రయల్న్ పరిశీలిస్తున్నారు. మరో వారం పదిరోజుల్లో మిగిలిన పనుల పూర్తి చేసి కోదండపురం మెట్రోవాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Tags: The fast-moving mission of the mission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *