మండుతున్న సూరీడు

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే అవకాశం ఉండటం లేదు. అంతలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే కానీ ఎండలు తగ్గడం లేదు. రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆకాశం మేఘాలతో ఉండీ విభిన్న వాతావరణం కనిపిస్తోంది.కాగా..ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మండే ఎండలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భానుడి ప్రతాపానికి తోడు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరొకొన్ని చోట్ల అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు నిప్పుల కుంపటిలా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో గడిచిన 24 గంటల్లో 44 డిగ్రీలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జైనాథ్ లో 44 డిగ్రీలు. ఆదిలాబాద్ అర్బన్ లో 43.6 డిగ్రీలు. బోరాజ్ లో 43.5 గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. భానుడి భగభగలకు ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.అయితే వారం రోజులుగా ఎండ తీవ్రత పెరుగుతుండటంతో.. జనాలు అల్లాడిపోతున్నారు.దీంతో.. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక మండే ఎండ ధాటికి మధ్యాహ్నం ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొందరు ఎండవేడి నుంచి రక్షణ కోసం గొడుగులు, టవల్స్‌ అడ్డుపెట్టుకోగా మహిళలు చున్నీలను కప్పుకుని తిరుగుతుండడం కనిపిస్తోంది.ఎండలు పెరుగుతుండటంతో రైతన్నల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. జిల్లాలో సజ్జ, పత్తి, ఇతర పంటలు సాగులో ఉన్నాయి. పొలాలు నీరు కట్టేందుకు పగటి పూట వెళ్లాల్సి వస్తుండటంతో ఎండ ధాటికి ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు అతలాకుతలం చేస్తుంటే.. మండే ఎండలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా భానుడు కనికరించి చల్లని వాతావరణం కల్పించకపోతాడా అంటూ ఆకాశం వైపు రైతులు ఆశగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.

 

Post Midle

Tags: The fiery sun

Post Midle
Natyam ad