డెంగీతో బాలిక మృతి.. రూ.18లక్షల బిల్లు

దిల్లీ ముచ్చట్లు:
కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాకం మరోసారి బట్టబయలైంది. డెంగీ జ్వరంతో చేరిన ఓ చిన్నారికి చికిత్స పేరుతో రూ.18లక్షల బిల్లు వేశారు. అందులో వైద్యులు ఉపయోగించిన గ్లౌజులకు కూడా ఛార్జీలు వేయడం గమనార్హం. అయితే ఇంత చేసినా ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు సరికదా.. డబ్బు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ సదరు సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. గురుగ్రామ్లోని ప్రముఖ ఫోర్టీస్ హాస్పిటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
దిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన జయంత్ సింగ్ ఏడేళ్ల కుమార్తె ఆద్య సింగ్ ఆగస్టులో డెంగీకి గురైంది.దీంతో ఆగస్టు 31న ఆమెను ఫోర్టీస్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పదిహేను రోజులపాటు చికిత్స అందించినా ఆమె ప్రాణాలు నిలవలేదు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14న ఆద్య మృతిచెందింది. ఇదిలా ఉండగా.. ట్రీట్మెంట్ పేరుతో రూ. 18లక్షల బిల్లు వేశారు ఫోర్టీస్ సిబ్బంది. ఇందులో చిన్నారికి వేసిన సిరంజీలు, వైద్యులు ఉపయోగించిన 2700 గ్లౌజులకు కూడా బిల్లు వేశారు. పైగా డబ్బు కడితేనే చిన్నారి మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. దీంతో చేసేదేమీ లేక జయంత్ సింగ్ రూ. 18లక్షలు కట్టాడు.ఈ విషయాన్ని ఇటీవల జయంత్ స్నేహితుడు ఒకరు ట్విటర్లో పోస్టు చేశారు. ‘మా స్నేహితుడి కుమార్తెకు ఫోర్టీస్ ఆసుపత్రిలో 15రోజుల పాటు డెంగీ చికిత్స అందించారు. రూ. 18లక్షల బిల్లు వేశారు. ఇందులో 2700 గ్లౌజులకు కూడా ఛార్జ్ చేశారు. ఎంత అవినీతి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కొద్ది రోజుల్లోనే వైరల్ అయ్యింది. విషయం కాస్తా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను తెలపాలని.. బాధ్యులపై వెంటనే తగిన చర్యలు చేపడతామని నడ్డా హామీ ఇచ్చారు.
Tag : The girl killed with dengue Rs 18 lakhs bill


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *