లైట్లలో చేతివాటం!

Date:13/02/2018
జగిత్యాల ముచ్చట్లు:
అవినీతిని ఏమాత్రం సహించమని తెలంగాణ సర్కార్ స్పష్టం చేస్తోంది. అభివృద్ధి పనుల్లో అవకతవకలు సాగితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్తోంది. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా చేతివాటం ప్రదర్శించేస్తున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిందే జగిత్యాల బల్దియాలోనూ వెలుగులోకి వచ్చింది. బల్దియా భవనం పైఅంతస్తులో ఉంచిన దీపాల లెక్క తేలడం లేదని సిబ్బంది చెప్తున్నారు. దీంతో లైట్లను కొందరు సొమ్ము చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా ప్రాంతంలో కొత్త ఎల్‌ఈడీ దీపాలు బిగించిన తరువాత పాత వాటిని దాచారు. కొత్తగా నాలుగువేల పైచిలుకు లైట్లనే బిగించారు. అయితే ఈ పాతవి మాత్రం వెయ్యికే లెక్క వస్తోంది. వీధి దీపాల గోల్‌మాల్‌ జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పురపాలికల్లో వీధి దీపాల నిర్వహణలో విద్యుత్తు బిల్లుల ఆదా కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎల్‌ఈడీ దీపాలు బిగించాలని నిర్ణయించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఓ ప్రయివేటు సంస్థ భాగస్వామ్యంతో పురపాలికలో లెడ్‌ దీపాల బిగింపు 70 శాతం మేరకు పూర్తయింది. కొత్త దీపాల అమరిక తరువాత పాతవాటిని బల్దియాలో లెక్కచూపాల్సి ఉండగా ఇక్కడే బల్దియా సిబ్బంది, కొందరు పాలకులు చేతివాటం ప్రదర్శించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాకేంద్రానికి 4768 లెడ్‌ దీపాలు మంజూరయ్యాయి. ప్రధాన ప్రాంతాల్లో 75 వాట్స్‌, వీధుల్లో 25 వాట్స్‌ దీపాలను అమర్చాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 38 వార్డుల్లో 4537 లెడ్‌ దీపాలను బిగించారు. మరికొన్ని వార్డుల్లో పనులు కొనసాగుతున్నాయి. కొత్తవి బిగించిన వెంటనే పాత ట్యూబ్‌లైట్లు సెట్లతో సహా బల్దియాకు స్వాధీనం చేయాలి. ఇక్కడే అవకతవకలు సాగినట్లు తెలుస్తోంది. కొత్త దీపాల గణాంకాలను అనుసరించి పాత దీపాల నిలువ ఎక్కడా కనిపించకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. పాత వీధి దీపాల పరిస్థితిపై ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పాత దీపాల నిల్వలు సిబ్బందికే తెలుసని అంటున్నారు. సిబ్బంది మాత్రం కొన్ని దీపాలు బల్దియా భవనంపై ఉన్నాయని మరికొన్ని వ్యాపార సముదాయంలోని ఓ గదిలో భద్రపరిచామని ఆ గది తాళం చెవి ఓ కాంట్రాక్టర్ వద్దే ఉందని అంటున్నారు. అధికార యంత్రాంగం నుంచి ఈ తరహా సమాధానాలు వస్తుండడంతో లైట్లను సొమ్ము చేసుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. పాత వీధి దీపాల నిలువలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అంటున్నారు.
Tags: The hand of the lights!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *