The house of Eluru in 2019 is the house of the poor

ఏలూరు నగరంలో పేదలందరికీ 2019కి పక్కా ఇల్లు

Date: 11/01/2018

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరు నగరంలో పేదలందరికీ 2019 మార్చినాటికల్లా పక్కాఇల్లు నిర్మించి ఇస్తామని ఏలూరు మేయరు షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు చెప్పారు. స్ధానిక 49వ డివిజన్‌ తంగెళ్లమూడి ప్రాంతంలో జరిగిన జన్మభూమి-మాఊరు సభల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏలూరు నగరంలో ఇళ్లు కావాలని 17 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని అందులో 12 వేలమంది పేదలకు బహుళ అంతస్ధు భవనాలు నిర్మించి లిఫ్ట్‌ సౌకర్యం కూడా కల్పిస్తామని మేయరు చెప్పారు. పోణంగిలో 55 ఎకరాలు, కొత్తూరులో 9 ఎకరాలు భూమి సేకరించామని ఇందుకు 50.65 కోట్ల రూపాయల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా తక్షణమే నిధులు విడుదల చేసారని త్వరలోనే భూములు ఇచ్చిన రైతులకు ఈ సొమ్ము ఇచ్చి భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని నూర్జహాన్‌ చెప్పారు. అపార్ట్‌మెంట్‌ తరహాలో 375 చదరపు అడుగులు, 400, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కొక్క ఇల్లు ఉంటుందని ఫిబ్రవరి నెలలో శంకుస్ధాపన చేసి 2019 మార్చినాటికల్లా అర్హతగల ప్రతీ పేదకుటుంబానికి స్వంత ఇల్లు సమకూర్చి పేదల స్వంత ఇంటికలను సాకారం చేస్తామని నూర్జహాన్‌ చెప్పారు. ఏలూరు నగరంలో స్వంత స్ధలం ఉండి పూరిపాక లేదా పెంకుటింట్లో ఉన్న పేదవర్గాలకు కూడా ఆస్ధలాలలో స్వంత ఇల్లు నిర్మించుకోవడానికి 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ సొమ్ము ఇస్తామని ఇప్పటికే 1250 మంది పేదల ఇళ్లను గుర్తించామని వాటి స్ధానే పక్కా ఇల్లు నిర్మించుకుంటే ఈ సొమ్ము ఉచితంగా సమకూరుస్తామని ఇంకా 1750 మంది పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకువస్తే ఒక్కొక్కరికీ 2.50 లక్షలు సబ్సిడీ అందిస్తామని నూర్జహాన్‌ చెప్పారు. 2019 మార్చి తర్వాత స్వంత ఇల్లు లేదని ఏఒక్క పేదకుటుంబం లేకుండా చేస్తామని ఆమె చెప్పారు. ఏలూరు నగరంలో గత ప్రభుత్వ కాలంలో 13 వేల పెన్షన్లు ఉండేవని వాటిని తనిఖీ చేయగా 5 వేల పెన్షన్లు బోగస్‌ అని తేలడంతో వాటి స్ధానంలో అర్హతగల పేదలకు క్రొత్త పెన్షన్లు జారీ చేసామని మేయరు చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో 13 వేల పెన్షన్లకు 26 లక్షలరూపాయలు నెలకు ఇస్తే నేడు ఏలూరు నగరంలో అర్హతగల 20 వేలమంది పేదలకు ప్రతీనెలా 2 కోట్ల రూపాయలు పెన్షన్‌ రూపంలో పేదలకు అందిస్తున్నామని పెన్షన్ల పంపిణీ కూడా పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని నూర్జహాన్‌ చెప్పారు. ఏలూరు నగరంలో విద్యాప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్ధేశ్యంతో నగరంలోని 52 పాఠశాలల్లో 4 కోట్లతో మౌలికవసతులు కల్పించామని, 10వ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రతీరోజూ ప్రత్యేక క్లాస్‌లు నిర్వహించి ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో విద్యాభోధన అందిస్తున్నామని ప్రత్యేక క్లాస్‌లకు హాజరయ్యే విద్యార్ధినీ విద్యార్ధులకు సాయంత్రం వేళ ప్రత్యేక టిఫిన్లు అందించడానికి 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు నూర్జహాన్‌ చెప్పారు. రోడ్లు, డ్రైయిన్లతోపాటు ఇతర మౌలిక వసతులు కోసం గత మూడేళ్ల కాలంలో 150 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసామని ఆమె చెప్పారు. జన్మభూమి కార్యక్రమానికి ఏలూరు నగరంలో అనూహ్య స్పందన లభించిందని 50 డివిజన్లలో కనీసం 11 ఫిర్యాదులు కూడా రాలేదని దీన్నిబట్టి నగరంలో సమస్యలు బాగా తగ్గుముఖం పట్టాయని స్పష్టమవుతున్నదని వచ్చిన 11 ఫిర్యాదుల్లో 4 రేషన్‌ కార్డులుకోసం, రెండు ఇళ్లస్ధలాలుకోసం, ఐదు పెన్షన్లుకోసం దరఖాస్తులు వచ్చాయని మేయరు చెప్పారు. గత నాలుగు విడతల జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరించడం జరిగిందని ప్రజలు సమస్యలు చెప్పకముందే తామే ఆయా ప్రాంతాలలో సమస్యలను పరిష్కరిస్తూ సమన్వయంతో ముందుకు వెళుతున్నామని దీనివలన నగరంలో ప్రజాఫిర్యాదులు బాగా తగ్గుముఖం పట్టాయని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి కానుక క్రింద నిత్యావసర సరుకుల కిట్‌లను నూర్జహాన్‌ పంపిణీ చేసారు. జన్మభూమి కార్యక్రమం విజయవంతం కావడంపట్ల కోఆప్షన్‌ సభ్యులు యస్‌యంఆర్‌ పెదబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి సారథ్యంలో ప్రజాప్రతినిధులు అంతా అధికార యంత్రాంగానికి సహకరించి ముందుకు నడవడం వలన ఏలూరు నగరం ఒక మోడల్‌ నగరంగా తీర్చిదిద్దబడుతున్నదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మేయరు షేక్‌ నూర్జహాన్‌కు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతంపలికారు. ఆరుగురు గర్భిణీ స్త్రీలకు శీమంతాలను ఆమె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనరు ఎ. మోహనరావు, స్పెషల్‌ ఆఫీసరు కరుణకుమారి, కార్పోరేటర్లు ఈదుపల్లి ఇందిర, కోమర్తి వేణుగోపాలరావు, దాకారపు రాజేశ్వరరావు, విప్‌ గూడవల్లి శ్రీనివాసు, తెలుగుదేశం నాయకులు ఆర్‌యన్‌ఆర్‌ నాగేశ్వరరావు, దాసరి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags : The house of Eluru in 2019 is the house of the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *