The 'island' in the Indian Ocean

హిందూ మహాసముద్రంలో ‘ద్వీపం’

-జంతుజాలాల దేశం ‘మడగాస్కర్‌’

-విశ్వంలో ఐదు శాతం అక్కడే జీవనం

Date: 14/01/2018

మడగాస్కర్‌ ముచ్చట్లు:

మడగాస్కర్‌ లేదా రిపబ్లిక్‌ ఆఫ్‌ మడగాస్కర్‌… మలగాసీ రిపబ్లిక్‌), హిందూ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం, ఆఫ్రికా ఖండపు ఆగ్నేయ తీరంలో ఉంది. ప్రపంచంలోని జంతుజాలాలలో 5 శాతం జంతుజాలాలు ఈ దేశంలోనే గలవు. ప్రాచీన హిందువులు తూర్పున మలే ద్వీపకల్పం మొదలుకొని జావా, సుమత్రా దీవుల నుంచి పశ్చిమంలో మడగాస్కర్‌ ద్వీపం వరకు తమ వ్యాపారవాణిజ్యాలు విస్తరించారు. హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం మడగాస్కర్‌. తూర్పు ఆఫ్రికాకు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్నా కూడా ఈ మడగాస్కర్‌ దీవి దేశం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియా దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దీవిలో పూర్వం ఆసియా దేశస్థులే వలసవెళ్లి ఉండడం వల్ల ఇప్పటికీ అక్కడ ఆసియా ప్రజల ఛాయలే ఉన్నాయి. దీవిలో మొత్తం 18 రకాల తెగల ప్రజలు ఉన్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. ఈ దీవి వైశాల్యంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. క్రీ.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. 18వ శతాబ్దం ఆరంభం నుండి ఫ్రెంచి రాజులు దీనిని పరిపాలించారు. ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియన్‌ సంవత్సరాల క్రితం నుండే ఉండేదని శాస్రవేత్తలు పరిశోధించారు. అనేక రకాల ఖనిజాలు ఈ దీవిలో లభ్యమవుతున్నప్పటికీ ప్రపంచంలోని బీదదేశాల జాబితాలో మడగాస్కర్‌ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. జనాభాలో 80 శాతం మంది ప్రజలు కేవలం జీవనం కొనసాగడానికే వ్యవసాయం చేస్తున్నారు. వరిధాన్యం ఈ దీవిలో అధికంగా పండుతుంది. 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలగాసీ ప్రభుత్వం ఏర్పడింది. మడగాస్కర్‌ దీవి పరిపాలన సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలుగా విభజింపబడింది. ఈ ఆరు ప్రాంతాలు తిరిగి 22 రీజియన్‌లుగా విభజింపబడి ఉన్నాయి. ఈ రీజియన్‌లను ఫరిత్ర అంటారు. అంట్‌సిరనానా, అంటనానారివో, మహజంగ, టోమాసినా, ఫియానారంట్‌సోవా, టోలియారాలు ఆరు ప్రాంతాలు. దేశంలో మొత్తం 119 జిల్లాలు ఉన్నాయి. మడగాస్కర్‌ దేశంలో పదినగరాలు ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అవి – అంటనానారికో, టోమాసిన, అంట్‌సిరాబే, ఫియానారంట్‌సోవా, మహజంగ, టోలియారా, అంట్‌సిరనానా, అంటానిఫోట్సీ, అంబోవోంబే, అంపరఫరవోలా. మడగాస్కర్‌ దేశంలో అనేక మానవ తెగలు ఉన్నాయి. ముఖ్యంగా మెరినా, బెట్సి మిసరాకా, బెట్సిలియో, సిమిహేతి, సకలావ, అంటాయసక, అంటన్‌డ్రాయ్‌ మొదలైన తెగలున్నాయి. జనాభాలో సగభాగం పురాతన సంస్కృతిని అనుసరిస్తున్నారు. వీరంతా క్రైస్తవ మతావలంబకులు. ప్రజలు ఇస్లాం మతాన్ని కూడా ఆచరిస్తున్నారు.భారతీయులు కూడా మడగాస్కర్‌లో ఉన్నారు. వీరు హిందీ, గుజరాతీ భాషలు మాట్లాడతారు. గ్రామాలలో గుడిసెలలాంటి ఇళ్లు నిర్మించుకుంటారు. స్త్రీలు, పురుషులు దాదాపు సమాన భావనతో జీవిస్తారు. పురుషులు కుటుంబాన్ని పోషించేందుకు కావలసిన వనరులను సేకరిస్తారు. వ్యవసాయం స్త్రీలు, పురుషులు కలిసిచేస్తారు. ప్రభుత్వం విద్యాలయాలను నెలకొల్పింది. క్రిస్టియన్‌ మిషినరీలు విద్యావ్యాప్తిని కొనసాగిస్తున్నాయి. సింగీ రోగ్‌ ఎర్రమట్టి రెడ్‌ లాటరైట్‌తో సహజసిద్ధంగా ఏర్పడి పైకి లేచిన ముళ్లమాదిరిగా కనబడతాయి. ఈ ప్రాంతం అంకరానా పట్టణానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం భారీవర్షాల కారణంగా మట్టి కోసుకుపోయి, కోపులు కోపులుగా తయారై ఒక వినూత్న డిజైనుగా మారిపోయింది. వేలాది ఏళ్ళ క్రితం ఏర్పడిన ఈ వింత ఆకారాలు ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. క్రమంగా ఇసుక వీటిమీద చేరిపోయి ఎరుపు రంగుకు చేరుకొని ఇప్పుడవి సహజసిద్ధ నిర్మాణాలుగా మారిపోయాయి. ఇక్కడే చిన్న చిన్న నీటి కొలనులు ఉన్నాయి. సందర్శకులకు ఈ ప్రాంతం ఒక భూమి మీది స్వర్గం మాదిరిగా అనిపిస్తుంది. మడగాస్కర్‌ దీవిలో చాలా విచిత్రమైన ప్రకృతి కనబడుతుంది. ఎన్నో అగ్నిపర్వతాలు, రహస్యంగా ప్రవహించే జలపాతాలు ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం దీవి అంతా అడవే. బావోబాబ్‌ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, మూడు నుండి నాలుగు మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. మడగాస్కర్‌ దీవికి ఉత్తర ప్రాంతంలో నోసీ బే ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులు ఉన్నాయి. కొన్ని దీవులు కొన్ని అడుగుల వెడల్పే ఉండి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి సమీపంలోనే నోస్‌ సకాటియా, నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్‌ బే, నోసీ ఇరంజా, రదను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిసెలాగో మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా స్వర్గధామంగా కనిపిస్తుంది. నోసీ సకాటియాను ఆర్బెడ్‌ ద్వీపం అంటారు. ఇక్కడ కేవలం 300 జనాభా ఉంది. ఇక్కడే ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లి కనబడుతుంది. ఈ ఊసరవెల్లి కేవలం ఒక సెంటీమీటరు ఉంది. రాక్షస గబ్బిలాలు కూడా ఇక్కడ ఉంటాయి. నోసీ కోంబా ఒక చిన్నద్వీపం. గుండ్రంగా ఉండి ఆకాశంలోంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనబడుతుంది. ఈ ద్వీపంలో మనకు ఎగిరే నక్కలు కనిపిస్తాయి. అలాగే రాక్షస గబ్బిలాలు కూడా కనబడతాయి. ఈ ద్వీపంలో అగ్నిపర్వతం ఉంది. లెబార్‌ జంతువులు ఎక్కువగా సంచరిస్తాయి. రష్యన్‌ బే కూడా చిన్న ద్వీపం. ఈ ద్వీపంలో సందర్శకులు రెండు మూడు రోజులు ఉండడానికి వీలుగా హోటళ్ళు ఉంటాయి. సందర్శకులు ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ తెలుపు రంగులో ఉండే ఇసుక బీచ్‌లు ఉన్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. బవోబాబ్‌ వృక్షాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా నోసీనింజా, రదమ ఆర్బిపెలాగోలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ముఖ్య భూభాగంనుండి పడవలో గానీ, హెలికాప్టర్‌లో కాని వెళ్ళవచ్చు.

Tags: The ‘island’ in the Indian Ocean

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *