మిర్చి రైతుల నష్టాలు అపారం

-నామమాత్రంగా ఇన్ పుట్ సబ్సిడి
 
గుంటూరు ముచ్చట్లు:
: తామర పురుగు ఆశించి మిరప పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) దక్కలేదు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి మీట నొక్కి పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేయగా అందులో ‘తామర’ బాధిత మిర్చి రైతాంగాన్ని పక్కనపెట్టారు. కేవలం నవంబర్‌లో కురిసిన వర్షాలకు మిర్చి పంట దెబ్బతిన్న రైతులకే, అదీ పరిమితమైన సంఖ్యలో ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేశారు. సాధారణంగా పంట నష్టం వాటిల్లినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందించే ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారం సైతం అందుతుంది. తామర తెగులుతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ రెండూ వర్తింపజేయాలని రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. బీమా సైతం వర్తిస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిర్చి రైతులను ఆదుకునే విషయంలో ఇప్పటికే కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్రంపై భారం వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం మిర్చి రైతులకు సాయం చేసే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది.అధిక వర్షాల వలన వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకొని తామర పురుగు వ్యాపించిందని రైతులు చెబుతున్నారు.
 
 
వర్షాలు, తెగులు రెండూ పంటను దెబ్బతీసినందున ఇన్‌పుట్‌ సబ్సిడీ, వాతావరణ ఆదారిత బీమా రెంటినీ వర్తింపజేయమంటున్నారు. సొంత భూమి కలిగిన రైతు ఎకరానికి రూ.లక్ష, కౌలు రైతు లక్షన్నర వరకు పెట్టుబడి నష్టపోయినందున ప్రత్యేక కేసు కింద పరిగణించి కనీసం ఎకరానికి లక్ష పరిహారం ఇవ్వమని కోరుతున్నారు. పంట నష్టం జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మిర్చి రైతుల గోడు వినిపించుకోవడంలేదు.ఖరీఫ్‌లో 4.64 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు కాగా సగానికిపైగా విస్తీర్ణంలో పూర్తిగా పంట తుడిచిపెట్టుకు పోయింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే రెండు లక్షల ఎకరాలు పూర్తిగా పోయింది. ప్రకాశం, కర్నూలు, కృష్ణా, అనంతపురంలో సైతం దాదాపు అంతే. పంట నిలిచిందనుకున్న చోట సైతం ఎకరానికి రెండు మూడు క్వింటాళ్లు, అదీ నాణ్యత లేని మిరప కాయల దిగుబడి వచ్చింది. తమను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఎదురు చూస్తుండగా, వర్షాల వలన 50,604 ఎకరాల్లో పంట నష్టం చవిచూసిన 31,199 మంది రైతులకు సర్కారు రూ.30.73 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేసింది. ఎకరానికి సగటున రూ.ఆరు వేల వంతున ఇచ్చి చేతులు దులుపుకుంది.
 
Tags: The losses of chilli farmers are immense

Natyam ad