the-meaning-of-womens-words-is-not-different

ఆడవారి మాటలకు అర్థాలు వేరు కాదు

ఈనాడు.

Date : 31/12/2017

అది టెర్రస్‌.. ఊహుఁ డాబాపైన.. ఏమనుకున్నా మన ఇష్టం. కానీ మామూలు టెర్రస్‌లతో పోలిస్తే… కాస్త భిన్నం.
ఎందుకూ? ఎందుకంటే… వాకిట్లో తులసికోట, ఆ పక్కనే రాతిరోలు. దీనికే మనం ఫిదా అయ్యేలోపు
ఎదురుగా ఎర్రఎర్రగా విరబూసిన దానిమ్మపూలు, గన్నేరుపూలు… గుత్తులుగా పలకరిస్తున్న కరివేరుపూలు
నేనొకదాన్ని ఇక్కడ ఉన్నానన్నట్టుగా ఒంటరి కొబ్బరిచెట్టు. ఇవన్నీ చూసి కూర్చుని ఆనందించడానికా అన్నట్టు ఓ చెక్క ఊయల..
అలాంటి పచ్చపచ్చని పద్మారావ్‌నగర్‌ని అంతకంటే అందంగా ప్రేమించే శేఖర్‌కమ్ముల
తన మనసులోని ముచ్చట్లు  హాయ్‌తో పంచుకున్నారు…

అదే అసలైన హీరోయిజం
* నిర్భయ ఘటన తర్వాత మీరు కాలేజీల్లో డిబేట్‌లు, చర్చలు నిర్వహించారు. యువతలో మీకు ఏమైనా మార్పు కనిపిస్తోందా?
స్టూడెంట్స్‌ స్టూడెంట్సే! యువతలో ఆ ఎనర్జీ ఎప్పుడూ జోరైన జలపాతంలా పొంగిపొర్లుతూ ఉంటుంది. ఏదైనా చేయగలిగేదీ వాళ్లే. ఇది వందశాతం నిజం. దాంతోపాటే వాళ్లలో కాస్త తెలియనితనం, అమాయకత్వమూ ఉంటాయి. అలాంటప్పుడు సరైన దిశానిర్దేశం ఇచ్చేవాళ్లు కావాలి. మార్గదర్శకం చేసేవాళ్లు అనుకుందాం. వాళ్ల సైడ్‌ నుంచి మనం కంప్లెయిన్‌ చేయడానికేం లేదు. వాళ్లకి సరైన దారిచూపించడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. అందుకే సినిమాలతో పాటూ… కాలేజీల్లో క్యాంపెయిన్లు, విజిట్స్‌ చేస్తుంటాను. వచ్చే సంవత్సరం మళ్లీ కాలేజీలకు వెళ్లాలని అనుకుంటున్నా. ‘అబ్బాయిల మైండ్‌సెట్‌లో మార్పు వస్తే బాగుంటుంది’ అని.. అమ్మాయి ‘నో’ అంటే ‘నో’ అనే అర్థం చేసుకోవాలనే నా క్యాంపెయిన్‌ లక్ష్యం. ఇవన్నీ చెప్పే స్థాయి నాకుంది అని కాదు… చెప్పడం నా బాధ్యత కాబట్టి చెబుతున్నాను.

* ఇవ్వాళ్టి సినిమాల్లో ఎక్కువగా అమ్మాయిల వెంటబడడం.. వేధించి మరీ ప్రేమకు ఒప్పించడం వంటివే హీరోయిజంగా చూపిస్తున్నారు కదా?
అది సరైంది కాదని అందరికీ తెలిసినా.. సినిమాల్లో సౌకర్యం కోసం కావాలనే దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. బాలీవుడ్‌లో ఇప్పుడు ఆ మార్పు కనిపిస్తోంది. అమ్మాయి ‘నో’ చెబితే దానర్థం ‘నో’ అనే! అది ఏవిషయంలోనైనా కావచ్చు. ప్రేమను నిరాకరించడం కావచ్చు.. సినిమాకొస్తావా? అంటే నో చెప్పడం కావచ్చు.. ఏదైనా ఇష్టం లేదంటే ఇష్టం లేదనే అర్థం. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’ అని కవి ఏ సందర్భంలో అన్నాడో గానీ.. దాన్ని అన్నింటికీ తమకు అనుకూలంగా వర్తింపజేసుకుంటున్నారు. ఈ వాక్యం ఇప్పటి సమాజానికి అస్సలు వర్తించదు. సినిమాల్లో వెంటబడి వేధించడం.. ఒప్పించడం వంటివి ప్రేక్షకులకు ఉల్లాసాన్ని ఇవ్వడం కోసమే చేస్తామని చెప్పుకోవచ్చు.. కానీ ఏ ఆలోచనతో అలాంటివి చూపించినా.. వాటి ప్రభావం ప్రేక్షకులపై ఉంటుంది. యువత మంచిని తీసుకుంటారా? చెడును స్వీకరిస్తారా అనేది చెప్పలేం. ఇష్టం లేదని చెప్పిన అమ్మాయి వెంటబడుతూ.. ఫలానా సినిమాలో మా అభిమాన హీరో ఇలాగే చేశాడు కదా.. నేనూ చేస్తానని తన వైఖరిని సమర్థించుకుంటే.. మనం తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే మన బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇలాంటి వేధింపుల ధోరణికి ఎక్కడోచోట అడ్డుకట్ట పడాల్సిందే. ప్రేమను వెంటబడి వేధించి సాధించుకునే పాత్రల్ని రచయితలు, దర్శకులు సాధ్యమైనంత వరకూ సృష్టించకపోవడమే మేలు.

* ప్రేమను నిరాకరించిందని ఇటీవల ఒకమ్మాయిని నిలువునా కాల్చేసిన ఘటన చూశాం.. వీటిని అరికట్టడంలో ఎవరి పాత్ర ఎలా?
సినిమాలు ఒక్కటనే కాదు.. చాలా విషయాల్లో మౌలికమైన మార్పులు క్షేత్రస్థాయి నుంచి పెద్దఎత్తున రావాలి. నా ప్రచారంలోనూ యువతను ప్రధానంగా ఒక్క ప్రశ్న అడుగుతుంటాను… ‘మీరు సినిమాను చూసొచ్చి ఏ కారణంతో అది బాగా లేదని చెబుతుంటారు?’ అని. హీరో ఫైట్లు బాలేవు.. కామెడీ లేదు.. డ్యాన్సులు నచ్చలేదు.. డైలాగులు పేలలేదు.. నాకిష్టమైన హీరో లేడు.. సెంటిమెంటు ఎక్కువైంది కాబట్టి నచ్చలేదని చెబుతుంటారే గానీ.. ఇందులో అమ్మాయిలను అసభ్యంగా చిత్రీకరించారని.. మహిళల కించపర్చేలా మాటలున్నాయనీ.. అమ్మాయిల పట్ల వివక్ష చూపించారు.. కాబట్టి నచ్చలేదని ఎంతమంది అంటారు? ఈ ప్రశ్న మీరు వేసినప్పుడు మహిళలపై అన్యాయాలపై మాట్లాడానికి మీకూ హక్కు ఉంటుందని చెబుతా. అలా మాట్లాడగలిగేలా పత్రికలు, ప్రసారసాధనాలు, గురువులు, తల్లిదండ్రులూ తమ పాత్ర పోషించాలి. బాధ్యతగా వ్యవహరించాలి. ఫలానా సినిమాలో బూతులు మాట్లాడారు కాబట్టి మేం చూడలేదని చెబితే.. సినిమా వ్యాపారం కాబట్టి అప్పుడలాంటి సినిమాలు తీయరు. ఇది పరిణామక్రమంలో జరగాల్సిన ప్రక్రియ. ఏ తరంలోనైనా సాహిత్యం, సినిమాలు, చదువులు.. ఇవే ప్రభావశీలంగా వ్యవహరిస్తాయి. పాఠ్యాంశాల్లోనే మహిళల్ని గౌరవించడం, లైంగిక పరిజ్ఞానం వంటివి బోధించాలి. దీనిపై ప్రభుత్వాలు అత్యవసరంగా ప్రాధాన్యాంశంగా దృష్టిపెట్టాలి. కుటుంబాల్లోనూ అమ్మాయిలకు సమ ప్రాధాన్యమివ్వాలి.

* మీ ఫిదాలో అంతర్లీనంగా దీన్ని చూపించినట్టున్నారు?
అవును. చాలామంది ఫిదాని కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనేస్తారు… నేను మాత్రం దీనిని చక్కని హీరోయిజం చూపించిన సినిమా అంటాను. ఎందుకంటే… ఆ అమ్మాయి కాదు అంటే.. హీరో ఎక్కడా వేధించలేదే. వెంటపడలేదే. తనలో తను బాధపడతాడు, మధనపడతాడు. ఆ అమ్మాయి ఇష్టాన్ని గౌరవించి వెనక్కి వచ్చాడు. పదిమందిని కొట్టడం అనేది సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో సాధ్యం కాదు. కానీ ఓ అమ్మాయి ఇష్టాన్ని గౌరవించి వెనక్కి రావడం అనేది మనం చేయగలిగే పనే కదా! అదే అసలైన హీరోయిజం. అందుకే ఇందులో హీరోయిజంని ఈ రకంగా చూపించాను.

 

ఆనంద్‌, గోదావరి, ఫిదా, అనామిక… మీ సినిమాలు చూస్తే అమ్మాయిల పట్ల ఓ ప్రత్యేకమైన అభిమానం కనిపిస్తుంది? అసలు వాళ్లకోసమే కథ రాస్తారా అనిపిస్తుంది. అది నిజమేనా?
మీరంటే నిజమేనా అనిపిస్తుంది. నిజానికి కాదు.. నేను అమ్మాయిలని అభిమానిస్తాను.. కానీ అమ్మాయిల పక్షపాతిని కాను. మనుషుల పక్షపాతిని అనుకోండి. అందులోకే అందరూ వస్తారు కదా! అయితే నా కథలు ఎందుకు అమ్మాయిలవైపు మొగ్గుచూపుతాయి అంటే… దానికి కారణం ఉంది. ‘హీరోయిజం’ అంటే అమ్మాయి వ్యక్తిత్వాన్ని గౌరవించడం అనుకుంటాను అందుకే నా కథల్లో స్త్రీలకు ప్రాధాన్యం కనిపిస్తుంది. మరో రకంగా నా కుటుంబ వాతావరణమూ కారణం అయిఉండొచ్చు. నేను, మా అక్కయ్యలు మంచి వాతావారణంలో.. ఏ భయాలు, ఆందోళనలు లేకుండా పెరిగాం. నాకంటే మా అక్కయ్యలు చదువుల పరంగా ఇంకా గొప్పవాళ్లు. చాలా బెటర్‌ వాళ్లు. బహుశా… ఓ పాజిటివ్‌ వాతావరణంలో ఆడుతూ పాడుతూ పెరిగాను కాబట్టి నా ఆలోచనలు అలా పాజిటివ్‌గానే ఉంటాయి అనుకోవచ్చేమో!

* లైఫ్‌ఈజ్‌బ్యూటీఫుట్‌లో వాళ్ల అమ్మకోసం ఏడ్చినప్పుడు, ఫిదాలో రేణుక అత్తారింటికి వెళ్తున్నప్పుడు… హృద్యంగా తీశారు.. వీటివెనుక ఏదైనా ప్రభావం ఉందా?
నేను అమెరికా వెళ్లినా… నేను పుట్టి పెరిగిన పద్మారావ్‌నగర్‌ వైపే నా మనసు లాగుతూ ఉంటుంది. అలాంటిది చిన్నప్పట్నుంచి పుట్టి పెరిగిన చోటుని వదిలేసి అత్తారింటికి ఎలా వెళ్లిపోతారు అమ్మాయిలు. ఆ వెళ్లేదేమన్నా… రాజ్‌మహలా అంటే… కాదు. అలా వెళ్లడానికి వాళ్లకి ఎంత శక్తి కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఫిదాలో ఓ సన్నివేశం చేశా! రేణు పెళ్లయిన తర్వాత కొంగుముడులతో వెళ్లేటప్పుడు… వరుడు వెంట వెళ్లాల్సిన సందర్భంలో! ఆ కొంగు ముడి సీన్‌… ఇవన్నీ నాకు, మీకు తెలిసిన విషయాలే. నా సినిమాలు.. నేను దగ్గరదగ్గరగా ఉంటాం. అందుకే అంత సహజంగా అనిపిస్తాయేమో!

‘లీడర్‌2’ చేయాలనే ఆలోచన ఉంది. రాజకీయ నేపథ్యంలో చక్కని సినిమా తీయాలి. దానికి కొంచెం సమయం పడుతుంది. తర్వాత తీసే సినిమా మాత్రం మంచి ప్రేమ కథాచిత్రమే. కథ సిద్ధమవుతోంది. ఇంకా నటీనటులెవరనే స్పష్టత లేదు. వచ్చే ఏడాది(2018)లోనే ప్రేక్షకుల ముందుకు తెస్తాను.

మీ సినిమాల్లో వైఫల్యాల గురించి..
చాలామంది అనుకున్నట్టుగా ‘లైఫ్‌ఈజ్‌ బ్యూటీఫుల్‌’, ‘లీడర్‌’ వైఫల్యాలు కానే కాదు. అయితే నా అంచనాలు అందుకోలేదు అంతే. ‘అనామిక’ విషయంలో నా వైఫల్యం ఒప్పుకొంటాను. నేనే సొంతంగా కథ రాసి ఉంటే బాగుండేది. అది వచ్చింది వెళ్లింది కూడా ఎవ్వరికి తెలియదు. అదే నా రియల్‌ ఫెయిల్యూర్‌.

ఈ రోజుల్లో యువతని చూస్తుంటే మీకేమనిపిస్తుంది?
నేను చాలా ఓల్డ్‌ అయిపోయాననిస్తోంది. నిజంగానే… ‘బండిల్‌ ఆఫ్‌ ఎనర్జీ…’ అంటారే అలా ఉన్నారు యువత. మనం పక్కన నుంచి చప్పట్లు కొట్టాల్సిందే. సినిమాలు, రాజకీయాలు… ఇలా వాళ్లు అడుగుపెట్టడానికి చాలా రంగాలు, అవకాశాలు ఉన్నాయి. కానీ 60- 70 శాతం యువత అవకాశాల కోసమో ఏమో డాక్టర్‌, ఇంజినీరింగ్‌ వంటి రంగాలనే ఎంచుకుంటున్నారు. విభిన్నమైన రంగాలని ఎంచుకుంటే మంచిది. ఆ మాటకొస్తే నేనూ బాధితున్నే. ఇంజనీరింగ్‌ చేశా. ఈ కోర్సులకే ఉద్యోగావకాశాలున్నాయనే భావన ఉన్నప్పుడు.. వాటిని కాకుండా మరో కోర్సు చేయమని ఎవరైనా ఎలా చెబుతారు? ప్రత్యామ్నాయ అవకాశాల్ని చూపించగలగాలి. తెలుగు చదువుకోమనేకంటే.. తెలుగులో చదువుకుంటే ఉద్యోగాలొస్తాయనే భరోసా కల్పించాలి. అప్పుడే తెలుగుకు వైభవం వస్తుంది.

ఫలానా సినిమా నేను తీసి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా?
మొన్న బాలల చిత్రోత్సవాలు జరిగినప్పుడు అనుకున్నా. మన తెలుగు అమ్మాయి మాలావత్‌ పూర్ణపై తీసిన సినిమా చూసినప్పుడు అలాంటి అమ్మాయిపై సినిమా తీయాలనే ఆలోచన నాకెందుకు రాలేదని బాధపడ్డా. ఒక గిరిజన అమ్మాయి నిరుపేద కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. ఆమెను తీర్చిదిద్దిన గురువులు… ఆమె నేపథ్యం వంటి విషయాలపై ఆసక్తి అనిపించింది. చరిత్ర కంటే ఇప్పటి సమాజంలో స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవితాలను సినిమాలుగా తీయాలి.

సినిమాలు లేని సమయంలో ఏం చేస్తుంటారు?
కొత్త కథ సిద్ధం చేసుకోవడం.. కుటుంబంతో గడపడానికే అధిక ప్రాధాన్యం ఇస్తాను. స్కూల్లో చెప్పని విషయాలు నేను చెప్పాలని అనుకుంటా. ఇప్పుడే వస్తూ… వస్తూ ట్రిపుల్‌ తలాక్‌ గురించి ప్రచురించిన వార్తలని వాళ్ల ముందు ఉంచి వచ్చా! ఏమన్నా చదువుతారేమో ఇంటికెళ్లి చూడాలి. అది ఒత్తిడి తేవడం కాదు. సమాజం గురించి ఓ చిన్న అవగాహన. నేను టీవీల్లో ఎక్కువ డిబేట్లు చూస్తాను. వాళ్లు టాబ్‌ల్లో తలమునకలై ఉంటారు. కానీ టీవీల్లో మాట్లాడేవాడేం పిచ్చోడు కాదుకదా అలా మాట్లాడుకోవడానికి. వినండి…నచ్చితే పాటించండి. నచ్చకపోతే వదిలేయండి. కానీ వినాలి. కదా.. అదే చెబుతా! వాళ్లు తెలుగు బాగానే చదువుతారు. పాప తొమ్మిది. బాబు ఆరు చదువుతున్నారు. మా పాప మహాప్రస్థానం చక్కగా చదువుతుంది. పోతన, వేమన పద్యాలు బాగా చదువుతారు. కారులో ఎక్కడికయినా కలిసివెళ్లినప్పుడు వాళ్లు చెబుతుంటే వింటూ ఉంటాను. ఇక పెంపకం అంటారా… ‘రక్తం చూసి నవ్వకూడదు’ ఆ మాత్రం మానవత్వం ఉంటే చాలు. పక్కింట్లో నలుగురి పేర్లు తెలిసి.. ఇంట్లో పెద్దవాళ్లని తిన్నావా తాతయ్యా అంటే అదే చాలు అనిపిస్తోంది.

భారత్‌.. అమెరికా రెండు దేశాల సంస్కృతులనూ చూశారు.. మీపై వాటి ప్రభావమెంత?
అమెరికా అంటే డబ్బూ, అందమైన ప్రపంచం మాత్రమే కాదు. అక్కడా వర్ణవివక్ష, ఆర్థిక అంతరాలున్నాయి. వాషింగ్టన్‌లో నేను చదివిన ‘హావర్డ్‌’ విశ్వవిద్యాలయంలో నలుపు, తెలుపు వర్ణవివక్ష ఎక్కువగా ఉండేది. అప్పటికి పిల్లలు ఆడుకునే బార్బీబొమ్మలన్నీ తెల్లని తెలుపులోనే ఉండేవి. నా సహచర విద్యార్థిని ఒకామె బార్బీబొమ్మలు తెలుపులోనే ఎందుకు ఉండాలి.. నలుపులో ఎందుకు తయారు కావు. జుట్టు అంటే అమెరికన్ల జుట్టులా స్ట్రెయిటనింగ్‌ చేసి మాత్రమే ఎందుకు ఉండాలి. ఆఫ్రికన్ల జుట్టులా వంకీలు తిరిగి ఎందుకు ఉండదు ఇలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలు లేవనెత్తింది. ఇది 15 ఏళ్ల కిందటి మాట. అయితే పాఠశాల స్థాయి నుంచే అక్కడ ప్రస్తుత సామాజిక రుగ్మతలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, కులవివక్షను అన్వయిస్తూ విద్యార్థులకు పాఠశాల దశ నుంచే అవగాహన కల్పించాలి.

కొలిచే దేవుడు: వినాయకుడు
నమ్మే సిద్ధాంతం : దైవత్వం కంటే మానవత్వమే గొప్ప. మంచి చేసుకుంటూ వెళ్తే దేవుడే అన్నీ చూసుకుంటాడు.
ఆసక్తి ఉన్న క్రీడలు: క్రికెట్‌, టెన్నిస్‌* నాకు స్ఫూర్తి మా నాన్నగారే… తన పరిధిలో నిజాయితీగా జీవించిన వ్యక్తి. మమ్మల్ని తీర్చిదిద్దిన వ్యక్తి.
* నేను సరిగా తినను. నా ఆహారపు అలవాట్లు బాగుండవు. మీరే ఇలా అయితే మిమ్మల్ని చూసి పిల్లలూ అలానే మారతారు కదా అని…నా భార్య అంటుంది.  ఆ మాట నిజమే కదా అనిపిస్తుంది.
* నేను రేడియోని ఎక్కువగా ప్రేమించేవాడిని. అందులో మంచి మాటలు నా జీవితంపై అంతర్లీనంగా ప్రభావం చూపిస్తాయేమో అనిపిస్తుంది.
త్రివిక్రమ్‌లా రాయలేను

* ఎలాంటి పుస్తకాలు  చదువుతారు?…
మొదట్లో అయితే యండమూరి పుస్తకాలు చదివేవాడిని. తర్వాత… చలం. ఆనంద్‌ సినిమా చూసిన తర్వాత చాలామంది మీరు చలాన్ని చదివారా అని అడిగారు. కానీ అప్పటివరకూ నేను ఆయన పుస్తకాలు చదవలేదు. ఆ సినిమా తర్వాత ఆయన పుస్తకాలు చదివాను. ఇంగ్లిష్‌లో అయన్‌రాండ్‌ రాసిన ఫౌంటెయిన్‌ హెడ్‌ అంటే ఇష్టం. అందులో హౌవార్డ్‌రాక్స్‌ పాత్ర అంటే ఇష్టం. కొన్ని నెలలపాటూ ఆ ఇష్టంలో కొట్టుకుపోయాను. ఆమె రాసిన పుస్తకాలు చదివిన తర్వాత ఏదో ఒకటి చేయాలనే తపన మొదలవ్వడం సహజమే. నేనూ అలానే ఫీలయ్యాను. నేను తెలుగుని బాగా ప్రేమిస్తాను. మొదట్లో నా సినిమాల్లో కనిపించిన భాషకంటే… ఫిదాలో చూపించిన భాషకి చాలా తేడా ఉంటుంది. భాషా పరంగా ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకమైన ఫ్లో కనిపిస్తుంది. ఆ మార్పే… గోదావరి, ఆనంద్‌… ఫిదా సినిమాల విజయంలో తేడాని చూపించింది. ఆర్థికంగానూ ఆ తేడా నాకు కనిపించింది.

* ఫిదాలో ప్రధాన పాత్రలతో తెలంగాణ మాండలికాన్ని బాగా పండించారు.. అదెలా సాధ్యమైంది?
నాది తెలంగాణే. నాకొచ్చింది ఇక్కడి భాషే. ఈ మాండలికంలో నేను రాయడం మొదలెడితే ప్రవాహంలా వెళ్లిపోతుందలా.. ‘ఆనంద్‌’ చదువుకున్నవాళ్లే చూశారనుకుంటే.. ‘ఫిదా’ జనసామాన్యంలోకి వెళ్లి అందరూ చూసేలా తీయగలగడమే నాలో ఎదుగుదల అనుకోవచ్చు.  నేను త్రివిక్రమ్‌ అంత గొప్పగా మాటలు రాయలేను. కొత్త పదాలు పుట్టించలేను. కానీ నా పాత్రలు సన్నివేశాలకు అనుగుణంగా మాట్లాడుకుంటాయి. బాధొస్తే పంచుకుంటాయి. ‘లీడర్‌’లో ‘ఒక అమ్మాయికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత? ఊడితే ఎంత?’ అనే డైలాగ్‌ ఉంటుంది. ఆ సన్నివేశంలో రెండుపేజీల పవర్‌ఫుల్‌ డైలాగులకంటే ఇదే ప్రభావవంతమైంది. ‘అవినీతి చేయకపోవడమే త్యాగమ’ంటాడు హీరో మరోచోట. ఇలా సన్నివేశానికి అనుగుణంగానే నా మాటలుంటాయి.

* మీ డాలర్‌ డ్రీమ్స్‌…పాత సినిమాలని చూస్తే ఏమనిపిస్తుంది?
గొప్పగా అనిపిస్తుంది. ఇంత గొప్పగా ఎలా తీశానా అనిపిస్తుంది. కాకపోతే ఓ చిన్నలోపం.. డబ్బింగ్‌. దాంట్లో డైలాగులు సరిగా వినిపించవు. చెవులు రిక్కించి వింటేకానీ అర్థంకాదు. ఆ లోపం సరిదిద్ది విడుదల చేయాలనిపిస్తుంది. ఆనంద్‌లోనూ డబ్బింగ్‌లో కొన్ని లోపాలు అనిపించాయి. హ్యాపీడేస్‌లో మాత్రం ఒక చోట టైసన్‌ ఓ అమ్మాయిని చెంపమీద కొట్టి… నా ఫ్రెండ్‌ని ఎందుకు ప్రేమించవు అంటాడు. ఇప్పుడైతే నేను అలాంటి సన్నివేశం పెట్టను. అబ్బాయిలు అమ్మాయిలను కొట్టడాన్ని నేను ప్రోత్సహించను. అలాగే హ్యాపీడేస్‌లో టీచర్‌తో లవ్‌లో పడే సీన్‌ని ఇంకొంచెం జాగ్రత్తగా తీసే వాడినేమో!

Tags : the-meaning-of-womens-words-is-not-different

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *