The moon is the basis for national parties

జాతీయ పార్టీలకు చంద్రులే ఆధారం

Date:05/10/2018
కమలానికి కేసీఆర్… హస్తానికి సైకిల్..
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ .. ముగ్గురు ప్రధాన ప్రత్యర్థులతో పోరుకు నగారా మోగిస్తున్నారు. మారిన పరిస్థితుల్లో జాతీయ పార్టీలు రెండూ తమ పట్టు కోసం వీరిపై ఆధారపడాల్సి వస్తోంది. ఆగర్భశత్రువుగా నిన్నామొన్నటివరకూ భావిస్తూ వచ్చిన కాంగ్రెసు అధికార తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా మారిపోయింది. కాంగ్రెసుతో గతంలో పొత్తుపెట్టుకుని కేంద్రప్రభుత్వంలో సైతం కొనసాగిన టీఆర్ఎస్ ఇప్పుడు హస్తం పార్టీ పేరు చెబితే అగ్గిమీద గుగ్గిలమవుతోంది. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తూ కొన్నిసీట్లతో ఆపార్టీ గెలిచేందుకు ప్రాతిపదికను సిద్ధం చేస్తోందని టీఆర్ఎస్ విమర్శలు ఎదుర్కొంటోంది.
అదే సమయంలో తెలంగాణలో చేతులు కలపడమే కాదు, ఆంధ్రాలో పరోక్షంగా టీడీపీకి కాంగ్రెసు ఉపయోగపడుతుందనే వాదనలు వినవస్తున్నాయి. గందరగోళంగా కనిపిస్తున్నప్పటికీ రెండు పార్టీలకు స్పష్టత ఏర్పడింది. చంద్రబాబు, కేసీఆర్ లు ఇద్దరూ తమ గెలుపు కోసం రెండు పార్టీలనూ వేర్వేరుగా ముప్పుతిప్పలు పెట్టే దిశలో అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ పార్టీలు మూల్యం చెల్లిస్తే తమ అధికారం ఖాయమనే యోచనతో కదులుతున్నారు.నాలుగేళ్ల పాటు టీడీపీ,బీజేపీలు కలిసి నడిచాయి. గతంలోనూ 1998 నుంచి 2004 వరకూ ఒకే కూటమిగా కొనసాగిన చరిత్ర ఉంది.
ఇప్పుడు ఆ పార్టీ అంటే చంద్రబాబు మండిపడుతున్నారు. మోడీని తీవ్రంగా ద్వేషిస్తున్నారు. రాజకీయ అనివార్యత తెలుగుదేశానికి, బీజేపీకి మధ్య దూరాన్ని పెంచేసింది. టీడీపీకే కాకుండాఆంద్రా ప్రజలకు సైతం మోడీ శత్రువు అన్న తరహాలో చిత్రీకరించకపోతే తెలుగుదేశానికి మైలేజీ రాదన్న విషయం చంద్రబాబుకు తెలుసు. ఏపీలో బీజేపీకి పెద్దగా రాజకీయ వాటా లేకపోవడంతో పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదు.
దీర్ఘకాల ఫలితాలకు ఉపకరించే అంశాలకంటే తక్షణ నిధులపై దృష్టి పెట్టి చట్టం అమలులో జాప్యానికి అధికారపార్టీ కూడా ఒక రకంగా కారణమైంది. ఎన్నికల సమయం రావడంతో ఈ పాపాన్ని బీజేపీపై నెట్టి తాను సేఫ్ జోన్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే పక్కకి తొలిగారు. తాజాగా మోడీని చూపిస్తూ ఏపీ ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పవనాలను కాచుకునేందుకు బీజేపీ ఇప్పుడు ఒక రక్షణ కవచంగా మారింది.
అయిదేళ్లుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పట్ల ప్రజల్లో సహజంగానే కొంత ప్రతికూలత ఏర్పడుతుంది. దానిని అధిగమించడానికి మోడీ వ్యతిరేకత పనిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.బీజేపీ, కాంగ్రెసు, టీడీపీ మూడింటినీ ప్రత్యర్థులుగా చూపించాల్సిన అనివార్యత టీఆర్ఎస్ కు ఏర్పడింది. నిజానికి టీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని టీడీపీ భావించింది. ఇందుకు సంబంధించి చంద్రబాబు నాయుడే కేసీఆర్ ముందు ప్రతిపాదనలు ఉంచారు.
కానీ బీజేపీతో దూరమయ్యాక ఆ ప్రయత్నాలకు కమలనాథులు గండి కొట్టారు. ఇందుకు మోడీ కేసీఆర్ తో తనకు ఉన్నసన్నిహిత సంబంధాలను చక్కగా వినియోగించుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ రూపంలో పరోక్ష మిత్రుడిని ఏర్పాటు చేసుకోగలిగారు. అలాగని బీజేపీ, టీఆర్ఎస్ లు కలిసి నడిచే అవకాశం లేదు. ముస్లిం , ఎస్సీ,ఎస్టీ ఓటర్లలో బీజేపీ పట్ల వ్యతిరేకత తనకు ప్రతికూలంగా పరిణమించవచ్చనే యోచనతో కేసీఆర్ పొత్తు దిశలో అడుగు వేయలేదు. పరోక్షంగా కొన్నిసీట్లలో కమలానికి సహకరించేందుకు అనధికార ఒప్పందం కుదిరినట్లు ప్రచారం సాగుతోంది.
అధికారికంగా మాత్రం బీజేపీపై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. ఇది రాజకీయ వ్యూహం. ఎలాగూ కాంగ్రెసు పార్టీ ప్రదాన ప్రత్యర్థి. దాంతోపాటే బీజేపీని సైతం దుయ్యబడుతున్నారు. తీవ్రత మాత్రం కొంచెం తక్కువ. ఏపీ సీఎం కాంగ్రెసును పూర్తిగా పక్కనపెట్టేస్తున్నారు. తెలంగాణలో పొత్తు ప్రభావంతో ఆంధ్రాలో కాంగ్రెసు ఊసు ఎత్తడం లేదు. వైసీపీ, బీజేపీ, జనసేనలను మూడింటిని ఒక గాటన కట్టడం ద్వారా తాను అనుకున్న ఫలితాలు సాధించాలని చూస్తున్నారు.
కాంగ్రెసు, టీడీపీ, బీజేపీలను ఒకే గాటన కట్టడం ద్వారా కేసీఆర్ అధికారానికి బాటలు వేసుకోవాలనుకుంటున్నారు.తెలంగాణ రాష్ట్రసమితి పైకి చెప్పకపోయినప్పటికీ తన అవకాశాలను దెబ్బతీసే ప్రాబల్యం తెలుగుదేశానికి ఉందనే ఆందోళనలో ఉంది. సామాజిక నేపథ్యం, బలమైన నాయకత్వం ఇందుకు ప్రధాన కారణం. టీడీపీ ప్రాంతీయ పార్టీ కావడానికి తోడు చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించడం ఆపార్టీకి పెద్ద అసెట్. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులకు నిధులు పార్టీయే సమకూరుస్తుంది. వెనకబడిన తరగతుల్లో ఆదరణ ఉంది.
మహా కూటమి ఏర్పాట్లు ఒక కొలిక్కి వస్తే విజయానికి వ్యూహరచనలో చంద్రబాబు నాయుడి భాగస్వామ్యం ఉంటుంది. రాజకీయ చాణక్యంలో ఆయన దిట్ట. ఆ విషయం కేసీఆర్ కు తెలుసు. చంద్రబాబు ప్రతికూల విషయాలను సైతం అనుకూలంగా మలచుకోగలుగుతారు. రాజీలు, సంప్రతింపులు, సర్దుబాట్లు , ఎన్నికల మేనేజ్ మెంట్ ల విషయంలో అపారమైన అనుభవం ఆయన సొంతం. బలమైన నాయకులు, పార్టీ శ్రేణులు ఉన్నప్పటికీ వర్గ విభేదాలు, నాయకత్వ లోపాలు కాంగ్రెసుకు పెద్ద బలహీనత.
వాటిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవిషయంలో టీడీపీ నాయకుల ద్వారా తన వ్యూహాలను చంద్రబాబు అమలు చేయిస్తే చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఎదురవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడినే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటూ కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రజల మనసులోంచి ఆయనను చెరిపివేసి ప్రతికూల ముద్ర వేయగలిగితే టీఆర్ఎస్ పని సులభమైపోతుందనేది కేసీఆర్ ఆలోచన.
Tags:The moon is the basis for national parties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *