మూణ్ణాళ్ల ముచ్చట!

Date:13/02/2018
మంచిర్యాల ముచ్చట్లు:
కొందరు స్వార్ధపరుల ధనాశ కారణంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు లక్ష్యాలను అందుకోవడంలో విఫలమవుతున్నాయి. ప్రధానంగా కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యత పాటించడంలేదు. దీంతో పనులు చేపట్టిన తర్వాతే కాదు.. చేస్తున్నప్పుడే లోపాలు బయటపడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని 17 మండలాల్లో సీఆర్‌ఆర్‌, ఎంఆర్‌ఆర్‌ పథకం కింద చేపట్టిన పనుల్లోనూ ఈ తరహా లోపాలే వెలుగుచూశాయి. గుత్తేదారులు నాణ్యత పాటించకపోవడంతో వేసిన రోడ్లు పగుళ్లు తేలుతున్నాయి. మరికొన్ని చోట్ల గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో వేసిన రహదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నాసిరకం పనులతో చేతులు దులుపుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిర్మాణాల సమయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లో ప్రతిపాదనల సమయంలో చూపినట్లుగా నిర్మాణాలు చేయలేదు. సగం మేరకు పనులు చేసి మిగతావి మధ్యలోనే నిలిపివేసి నిధులు తీసుకున్నట్లు జిల్లావాసులు అంటున్నారు. రహదారులు పూర్తిగా గుంతలు పడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా వాటికి మరమ్మతులు కూడా చేయడంలేదని వాపోతున్నారు.  మందమర్రి మండలంలోని చిర్రకుంటనుంచి వయా కాన్కూర్‌ మీదుగా జైపూరు మండలంలోని రసూల్‌పల్లి వద్ద నిర్మించిన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డు 63వ జాతీయరహదారికి కలుస్తుంది. నేషనల్ హైవేకు కలిసే రోడ్డు కావడంతో వాహనాల రాకపోకలు ఎక్కువ. అయితే ఈ రోడ్డు పూర్తిగా కంకరతేలి, గుంతలు పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 2014-15లో ఎంఆర్‌ఆర్‌ నిధుల కింద రూ.10.7 కోట్లు మంజూరుచేసింది. కాంట్రాక్టర్లు మాత్రంరసూల్‌పల్లి నుంచి కాన్కూరు వరకు మాత్రమే పనులు చేశారు. మిగతా పనులు చేయకపోవడంతో ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. తరచూ  ప్రమాదాలు సంభవిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు వాపోతున్నారు. ఈ రహదారిపై అధికారుల వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే ఈ రోడ్డు పనులు సగమే జరిగినా అధికారులు మాత్రం నిర్మాణం పూర్తయినట్లు పేర్కొన్నారు. గుత్తేదారుకు డబ్బులు కూడా చెల్లించేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లకు అధికారులు కూడా మద్దతుగా ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి రహదారిని పటిష్ట పరిచే చర్యలు ముమ్మరం చేయాలని సూచిస్తున్నారు. లేదంటే ప్రాంతీయంగా వాహన ప్రమాదాలు మరింత పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags: The moon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *