Date:14/04/2018
వికారాబాద్ ముచ్చట్లు:
పేద దళితులకు మూడెకరాల భూమి అందించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. మహోన్నతమైన ఈ ఆశయానికి భూముల కొరత కొంత ఇబ్బందిగా మారింది. ఈ పథకం అన్న ప్రాంతాల్లోనూ కొంతమేర మాత్రమే సాగింది. భూములు అందుబాటులో లేకపోవడంతో అనేకమంది లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. పేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి అందిస్తే వారు స్థానికంగానే పంటలు సాగు చేసుకుని గౌరవప్రదమైన జీవనం సాగించగలరు. అందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే భూముల కొరత దృష్ట్యా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఎందుకంటే భూముల సేకరణ అధికారులకు కష్టంగానే ఉంది. గుర్తించిన భూములను విక్రయించేందుకు కొందరు సుముఖత వ్యక్తంచేయడంలేదు. ఎట్టకేలకు ఒప్పుకున్నా ప్రభుత్వం చెల్లిస్తున్న ధర వారికి నచ్చడంలేదు. ఇలా వివిధ కారణాలతో భూముల సేకరణ జాప్యమవుతోంది. పేద దళితులను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గుర్తించి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాగుకు అనుకూలమైన భూములను ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. రాళ్లు, గుట్టలు, ఉన్నవి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని, అన్ని వనరులు ఉన్న వాటినే ఎంపిక చేయాలన్నది వారి అభిప్రాయం. ఈ సందర్భంగానే భూముల కొనుగోలు చేసేందుకు వెళ్తున్న సంబంధిత అధికారులకు ఒక్కోసారి ఒక ధరను యజమానులు చెబుతుండడంతో భూముల ఎంపిక ఆలస్యం అవుతోందని సమాచారం. వికారాబాద్ జిల్లాలో పలు దఫాలుగా లబ్ధిదారులకు భూములు అందించారు. మరో 80 మందికి భూమి అందించాల్సి ఉంది. ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో కొనుగోలులో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. భూముల యజమానులు ఒక్కోసారి ఒక్కో ధర చెబుతున్నారు. ప్రారంభంలో చెప్పిన ధర, మర్నాటికే అధికం చేస్తున్నారు. దీంతో భూ సేకరణకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఏదేమైనా సర్కార్ త్వరితగతిన ఈ లక్ష్యాన్ని పూర్తి చేసి పేద దళితులకు భూ పంపిణీ పూర్తి చేయాలని అంతా ఆశిస్తున్నారు.
Tags: The ‘Mudugara’ scheme with the past is not the slowdown