The officer is worth Rs 50 crore!

ఆ అధికారి అక్రమాస్తులు రూ.50కోట్ల పైనే!

Date : 29/12/2017

విజయవాడముచ్చట్ల:

ఏపీ అవినీతి నిరోధక శాఖ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన విజయవాడ ప్రభుత్వ ఐటీఐ జిల్లా శిక్షణా కేంద్రం అధికారి కోనేరు శ్రీనివాస్ కుమార్ను అనిశా అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూ.50 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ పటమట విజయ్నగర్ కాలనీలో ఉన్న శ్రీనందిని అపార్ట్మెంట్లోని శ్రీనివాస్ కుమార్ ఇల్లు, కార్యాలయం సహా నగరంలోని ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో కిలో బంగారం, 1.7 కిలోల వెండి ఆభరణాలు, విలువైన స్థలాలకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.శ్రీనివాస్ కుమార్తె హరిప్రియ పేరిట విజయవాడ ఆటోనగర్లో హరిప్రియ క్యారియర్స్ అనే ట్రాన్స్పోర్టు సంస్థ నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ భార్య పేరిట 46 ట్యాంకర్లు, టిప్పర్లు, రెండు ద్విచక్రవాహనాలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు రూ.కోటి విలువ చేసే విలాసవంతమైన నాలుగు కార్లు , శ్రీనందిని టవర్స్లో విలాసవంతమైన ఫ్లాట్ సహా తన బావ పేరిట 500 చదరపు గజాలు, మామ పేరిట మరో 500 గజాల స్థలాన్ని గుర్తించారు.స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువల రూ.50కోట్లు ఉంటుందని అంచనా వేశారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్కుమార్.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తండ్రి మల్లికార్జునరావు మరణంతో 1991లో ఉద్యోగం పొందారు. ఐటీఐ జిల్లా స్థాయి శిక్షణా కేంద్రంలో స్టోర్ అటెండర్గా చేరారు.ఏడాదికి జూనియర్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఐదేళ్లలో డిప్యూటీ ట్రైనింగ్ అధికారి స్థాయికి చేరారు. 2014లో శిక్షణ అధికారిగా పదోన్నతి పొందారు. 26 ఏళ్లుగా శిక్షణాకేంద్రంలోనే తిష్టవేసి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడ బెట్టారని అనిశా అధికారులు గుర్తించారు.

Tags : The officer is worth Rs 50 crore!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *