Natyam ad

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు- సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బందులను అనుభవిస్తుండటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను గుర్తించినట్లు తెలిపింది. ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడంపై కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న చర్యల పట్ల తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని జస్టిస్ రమణ చెప్పారు. ప్రభుత్వ చర్యలను అర్థం చేసుకుని, గుర్తించినట్లు తెలిపారు. ప్రజల ఆందోళన పట్ల తమకు కూడా ఆవేదన ఉందన్నారు. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి మనం నేర్చుకోకుండా, యుద్ధం చేయడం దురదృష్టకరమని చెప్పారు. తాము చెప్పడానికేమీ లేదని, అయితే విద్యార్థుల కష్టాల పట్ల తమకు కూడా ఆందోళన ఉందని చెప్పారు. విద్యార్థుల యోగ, క్షేమాలను వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలుసుకోవాలని, అందుకోసం హెల్ప్‌లైన్ వంటివాటిని అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. ఈ విషయంలో తాము ఎటువంటి ఆదేశాలను జారీ చేయబోమన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ, అత్యున్నత న్యాయస్థానం మాదిరిగానే భారత ప్రభుత్వం కూడా ఆందోళనతో ఉందని చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్నవారిలో 17,000 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
 
Tags:The people who are suffering due to the Russian war on the crane – the Supreme Court is deeply concerned