The pink party on aggression in Jagattha

జగిత్యాలలో దూకుడు మీద గులాబీ పార్టీ

Date:26/11/2018
కరీంనగర్ ముచ్చట్లు:
జగిత్యాలజిల్లాలో ప్రత్యేకంగా నిలుస్తున్న నియోజకవర్గం జగిత్యాల. కూటమి అభ్యర్ధిగా కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో పాగా వేయాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సంజయ్ కే మరోసారి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. ఎంపీ కవిత నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. ఎల్.రమణ జీవన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం.. అధికార వ్యతిరేకత..టీఆర్ఎస్‌పైనే ఉండటంతో జీవన్ రెడ్డి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వరుసగా మూడు సార్లు గెలిచారు. నాలుగోసారి కూడా.. తనదే విజయం అన్నంత ధీమాగా ఉన్నారు.కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న జువ్వాడి నర్సింగ్రావు దూకుడుమీదున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. తన సొంత ఇమేజ్‌తో పాటు…, కూటమి తరపున ప్రచారం కలిసొస్తుందనే ధీమాతో ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో ముందున్నారు. నాలుగేళ్లలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానంటూ ప్రజలముందుకెళుతున్నారు.
ఇక్కడ ప్రజాకూటమి తరపున అడ్లూరి లక్ష్మణ్ బరిలో ఉన్నారు. అడ్లూరి నాలుగు సార్లు ఓడారన్న సానుభూతి ప్రజల్లో ఉంది. దీనికి తోడు కూటమి ఓట్లు కలిసొస్తాయనే ఆశతో ఉన్నారు. అయితే అడ్లూరికి సొంత పార్టీ నేతలే అక్కడక్కడా సహకరించడం లేదు.జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్ అధిష్టానం. అభ్యర్ధుల తరుపున ఎంపీ కవిత ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు ప్రజాకూటమి అభ్యర్ధులు. అయితే ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లా అయిన జగిత్యాలలో…టీఆర్ఎస్ పరిస్థితి అంత అనుకలంగా లేదనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై.. వ్యతిరేకత.. అధికార పార్టీని దడ పుట్టిస్తోంది. నియోజకవర్గానికి ఐదు నుంచి పది వేల వరకూ టీడీపీ ఓటు బ్యాంక్ ఉంటుందన్న అంచనా ఉంది. ఇదే.. కూటమి అభ్యర్థుల గెలుపోటముల్ని డిసైడ్ చేస్తుందంటున్నారు.
ఒక్కొక్క సర్వే ఒకొక్క పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా ఉంటుందని ప్రజలు భావించడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో మొదట కనిపించిన ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదంటున్నారు. అత్యధిక నియోజక వర్గాల్లో పార్టీలోనే అసంతృప్తివాదులు ఉన్నారని, వారందరినీ బుజ్జగించినప్పటికీ ప్రచారానికి అత్యధికులు దూరంగా ఉంటున్నారనే సమాచారం టీఆర్‌ఎస్ అధినాయకత్వాన్ని కలవరానికి గురి చేస్తుంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఓట్లు కలిసిపోవడం, బీజేపీ ఒంటరి పోరుకు దిగడం, సీపీఎం బహుజన వామపక్ష కూటమి పేరుతో రంగంలో ఉండటంతో ప్రతిపక్షాలు ఓటు చీలే అవకాశం లేకపోగా, టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటాయనుకుంటున్న ఓట్లు చీలిపోవడం ఆందోళనకర పరిణామం అంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకతను కూడా టీఆర్‌ఎస్ మూటగట్టుకుంటుందనే ప్రచారంతో ఆ  పార్టీ అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ ఉద్యమ కెరటాలన్నీ కూడా కూటమి పక్షాన చేరడంతో ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకతకు సంకేతంగానే భావించాల్సి వస్తుందంటున్నారు. ఇటీవల కేసీర్ చేసిన వ్యాఖ్యలు, కొంత మంది సీనియర్లు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో నియోజక వర్గాల వారీగా ఓట్ల బలం తగ్గుతుందనే భయంతో కొంత మంది అభ్యర్ధులు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకే ప్రచారం నిర్వహించవలసి ఉన్నందున టీఆర్‌ఎస్ అభ్యర్ధులు పార్టీ, ప్రభుత్వపరంగా జరిగే రాజకీయ నష్టాన్ని పూడ్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. నియోజక వర్గాల వారీగా బేరసారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
కొందరు బలమైన నాయకులను ఆకట్టుకోవడం, కొన్ని సామాజిక వర్గాలను లోబర్చుకోవడం కోసం అభ్యర్ధులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. గ్రామాలు, కులాలు, వర్గాల వారిగా రహస్య మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ల నియోజక వర్గాల్లో ఇలాంటి వ్యవహరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలిసింది. కూటమి పక్షాలు కూడా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. గెలుపు కోసం ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించించారు. సామాజిక సమీకరణలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను వశపర్చుకుంటున్నారు. కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారు. అలాంటి వారి రాజకీయ పలుకుబడిని ప్రచారానికి ఉపయోగిస్తున్నారు.
Tags:The pink party on aggression in Jagattha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *