మళ్లీ దెబ్బ తీసిన వరి 

Date:13/03/2018
తిరుపతి ముచ్చట్లు:
కరువుకు మారుపేరైన మదనపల్లె డివిజన్‌ పరిధిలో ఈసారి వరి భారీగా దెబ్బతింది. తెగుళ్లకోర్చి, కష్టాలకెదురొడ్డినా ఫలితం లేకపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రబీలో 4వేల హెక్టార్లలో వరి సాగయ్యేది. మూడేళ్లుగా వర్షాలు ఆశాజనకంగా కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు వరిసాగుపై ఆసక్తి చూపారు. మొత్తం మీద చెరువులు, బావులు, కుంటలు, బోర్ల కింద 6,600 హెక్టార్లలో వరి సాగుచేశారు. స్థానికంగా లభించే నర్మద, కావేరి, బీపీటీ, నెల్లూరు ఎన్‌ఎల్‌ఆర్‌ తదితర రకాలు సాగుచేశారు. పంట ఏపుగా పెరిగింది. బాగానే పిలకలు వేసింది. ప్రస్తుతం వరి వెన్ను, కోతదశల్లో ఉంది. సగం పంటకు గింజ పట్టకుండా జల్లుబోయింది.నెల క్రితం వరి పైరు పసుపు రంగులోకి మారింది. ఆకుల కొనలు మాడిపోయాయి. సుడిదోమ, ఆకు ముడత సోకాయి. వాటికి అవసరమైన మందులు పిచికారీ చేసినా కొందరు రైతులు పంట కాపాడుకోలేకపోయారు. మరికొందరు భారీగా పెట్టుబడులు పెట్టి కొంతమేర నిలబెట్టుకున్నారు.వరి పంట చూసేందుకు పచ్చగా.. ఏపుగానే ఉంది. పిలకల్లో గింజపట్ట లేదు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని బాధిత రైతులు చెబుతున్నారు. గింజ పట్టకపోవడానికి గల కారణాలు వ్యవసాయ అధికారులకే అంతుచిక్క డం లేదు. పంటను పరిశీలించిన అధికారులు తిరుపతి పరిశోధన కేంద్రానికి చెందిన సైంటిస్టులను పిలిపించారు. వారు కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో వరి పంటను పరిశీలించి తగిన పరీక్షలు చేశాక ఫలితం వెల్లడిస్తామని చెప్పారు. గత నవంబరులో నాటిన వరికి ఎఫెక్టు ఎక్కువగా ఉందని తేల్చారు. మామూలుగా వరి పంటకు 15 డిగ్రీ లకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండరాదు. కానీ నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈ దఫా రాత్రిపూట చలిఎక్కువై ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. గింజపట్టని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.రబీ సీజన్‌లో వరి ఎప్పుడు సాగుచేయాలి.. అప్పటి వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు తెలియదు. ముఖ్యమైన విత్తన ఎంపిక ఎలా చేసుకోవాలో వారికి అవగాహన లేదు. హైబ్రిడ్‌ రకాల పేరిట కర్ణాటక నుంచి అందిన రకాలు, లోకల్‌ కంపెనీ సీడ్స్‌ను ఇక్కడి దుకాణాల్లో విక్రయించారు. ఏవి మేలో తెలియని రైతులు అందుబాటులో ఉన్న వరి విత్తనాలు కొని నారు పోశారు.వరి వంగడాలు, వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దుకాణాల్లో నిబంధనల మేరకు విత్తనాలను విక్రయిస్తున్నారా..? లేదా..? అని తనిఖీలు చేయలేదు. సంబంధిత పంచాయతీల్లోని ఎంపీఈఓ (మల్టిపర్ఫస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌)లు పొలాలవైపు కన్నెత్తి చూడలేదు. ఫలితం రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.మదనపల్లె డివిజన్‌ పరిధిలో వరి సాగుకోసం హెక్టారుకు రూ.40 వేల దాకా వెచ్చించారు. ప్రస్తుతం సాగులో ఉన్న రెండు వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. ఈ లెక్కన డివిజన్‌ పరిధిలో రూ.8 కోట్లకుపైగా పంటకు నష్టం వాటిల్లింది. కనీసం ప్రభుత్వమైనా స్పందించి గింజపట్టని వరిచేలకు నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Tags: The rice again was damaged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *