కాలేజీ మొత్తానికి ఒకే స్టూడెంట్ 

Date:13/02/2018
విజయనగరం ముచ్చట్లు:
పూసపాటి వంశీయులు 1860లో విజయనగరం అయోధ్య మైదానంలో వేద పాఠశాల ఏర్పాటు చేశారు. 2003లో ఈ విద్యాసంస్థను పాఠశాల విద్యగా, ఉన్నత విద్యగా విభజించారు. అలా సంస్కృతోన్నత పాఠశాలను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి, మహారాజా సంస్కృత కళాశాలను ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో 350 మంది చదువుతున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సైన్స్‌, సోషల్‌తో పాటు సంస్కృతం పాఠ్యాంశాలుగా ఉన్నాయి. కళాశాలకు మాత్రం ఆదరణ లేదు. 2010 వరకు 210 మంది విద్యార్థులు ఉండేవారు. 2010-11 నుంచి విద్యార్థుల చేరిక లేదు. ప్రస్తుతం ఒకే విద్యార్థిని చదువుతోంది. ఇక్కడ చదువు చెప్పేది కూడా ప్రిన్సిపాల్‌ ఒక్కరే. ఆ ఏకైక విద్యార్థిని కోర్సు కూడా 2018 మార్చి నెలతో పూర్తవుతుంది. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య జీరో. తర్వాత కళాశాల నిర్వహణ ఎలా? దీనిపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి ఇంటర్‌, డిగ్రీ కలిపి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీని అందిస్తున్నారు. బీఏ తెలుగు తీసుకున్న వారికి తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, పర్యావరణం పాఠ్యాంశాలుగా ఉన్నాయి. చివరి ఏడాది 500 మార్కులకు తెలుగు సబ్జెక్టుగా ఉంటుంది. బీఏ సంస్కృతంలో సంస్కృతం, ఇంగ్లిష్‌, తెలుగు, కంప్యూటర్‌ సైన్సు బోధిస్తారు. చివరి ఏడాదిలో 400 మార్కులకు సంస్కృతం, 200 మార్కులకు కంప్యూటర్‌ సైన్సు ఉంటుంది. 2013లో కంప్యూటర్‌ సైన్సు తీసుకొచ్చినా విద్యార్థుల నుంచి ఆదరణ లేదు. సంస్కృత పాఠశాల నుంచి ఏటా వందల మంది విద్యార్థులు ఉత్తీర్ణులై వెళ్తున్నా..మహారాజా సంస్కృత కాలేజీలో చేరడానికి ఎవరూ రావడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. బయట స్వల్పకాలిక శిక్షణకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు దొరుకుతున్న ఈ రోజుల్లో…ఇంకా ఈ కోర్సులేంటి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదీకాకుండా ఇక్కడేం నేర్పుతారనే దానిపై ఈ తరం తల్లిదండ్రులకు అవగాహన లేదు. ఐదేళ్ల డిగ్రీ తర్వాత పండిత శిక్షణ ఇస్తే ఉపాధ్యాయ కోలువులకు భరోసా లభిస్తుంది. అలాగే ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని కొందరి సూచన. అలా మార్పులు చేస్తే కళాశాలకు ఆదరణ లభించే అవకాశం ఉంది.ఆ విద్యాసంస్థకు వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. సంస్కృతం చదవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. పైగా అది మహారాజులు స్థాపించిన సంస్థ. పోషణ కూడా ఆ స్థాయిలోనే ఉండేది. కానీ, కాలానుగుణంగా మార్పులు తీసుకురాకపోవడంతో ప్రాభవం కోల్పోయింది. ఇప్పుడా కాలేజీలో చదువుతున్నది ఒకే ఒక్కరు!
Tags: The same student is a college student

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *