పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు ఆకస్మిక మరణం సాహితీ లోకానికి తీరని లోటు

అనంతపురం ముచ్చట్లు:
అనంత సాహిత్య రంగంలో పద్యానికి, అవధానానికి చిరునామాగా మారిన ఆశావాది ప్రకాశరావు  1944 సం. ఆగస్టు 2 న అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని కొరివిపల్లి గ్రామంలో కుళాయమ్మ. పక్కీరప్ప పుణ్య దంపతులకు జన్మించారు.తెలుగు పద్యానికి, అవధానానికి, వర్తమానకాలంలో ప్రసిద్ధుడైన ఆశావాది ప్రకాశరావు  ఎన్నో వందల అవధానాలు దేశవ్యాప్తంగా చేశారు. అనేక గ్రంధాలు రచించారు. ప్రకాశరావు  కవిగా, వక్తగా, రచయితగా, సాహితీ వేత్తగా, విద్యావేత్తగా ప్రముఖ అవధానిగా అనంత‌ సాహితీ లోకంలో మకుటం లేని మహరాజగా వెలుగొందారు. పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారి ఆకస్మిక మరణం సాహిత్య రంగానికి తీరని లోటు.
అష్టావధానం లో ఆశావాది దిట్ట. ఎన్నో అవధానాలు చేసిన ఆశావాది తన అనుభవాల్ని అక్షరబద్ధం చేసి
అనేక రచనలు రాశారు. వీటిలో అవధానదీపిక, అవధాన కౌముది,అవధానకళాతోరణము, అవధాన వసంతము మొదలైనవి ఉన్నాయి. ఇవిగాక వరదరాజు శతకం, పార్వతీశతకం, మెరుపు తీగలు వంటి కావ్యాలు కూడా ఉన్నాయి.ఆశావాది పద్యరచనతో పాటు ఆధునిక వచన కవితలో ఆర్కెస్ట్రా, అంతరంగ తరంగాలు మొదలైన కావ్యాలు రచించారు.
ఆశావాది సాహిత్య రంగంలో ఎన్నో సత్కారాలు పొందాడు. 1976లో దళితుల్లో ప్రథమ అవధానిగా ‘తెలుగు వెలుగు’ పురస్కారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి పొందాడు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయం ‘రాష్ట్రకవి’గా సత్కరించింది. 1994లో ఉగాది పురస్కారాన్ని రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2000సంవత్సరంలో డి.లిట్ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించింది. 2005లో హరిజన సేవాసంఘం ద్వారా గాంధేయ వాద పురస్కారం పొందాడు.అధికార భాషాసంఘం నుండి ‘భాషాభిజ్ఞు’ పురష్కారాన్ని పొందాడు. ఆశావాది జీవితంలో అపూర్వఘట్టం పూర్వం అల్లసాని పెద్దనలా ‘స్వర్ణగండ పెండేర సన్మానం’ పొందడం. అనంతపురం జిల్లా పెనుగొండలో ఆయన తన సాహితీ ప్రజ్ఞకు గుర్తుగా ఆయన ఈ సన్మానాన్ని పొందడం విశేషం. ఆశావాది అనంత సాహితీక్షేత్రంలో సాహితీ వారసత్వంగా ఎన్నో తెలుగు విత్తనాలు వేసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఆయన స్వయంగా ‘రాయలకళాగోష్టి’ సంస్థ స్థాపించి దానికి కార్యదర్శిగా పనిచేశాడు. ‘ఆంధ్ర పద్య కవితాసదస్సు’ రాష్ట్ర కార్యదర్శిగా పది సంవత్సరాల పాటు 1993 నుండి పనిచేసి ఎంతోమంది సాహిత్య కారులును వెలుగులోకి తెచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ’ సభ్యునిగా కూడా పనిచేశారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది.
తనదే కులమని అడిగిన వారిని తనది కవితా కులమని సగర్వంగా చెప్పిన సాహితీమూర్తి ఆశావాది. ఆనంత సాహిత్యరంగంలో అవధానానికి చెరగని చిరునామాగా నిలిచిన ఆశావాది గారి మరణం సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ……బాధాతప్త హృదయంతో అశ్రునివాలిలర్పిస్తూ……
 
Tags: The sudden death of Padma Shri optimist Prakash Rao is a great loss to the literary world

Natyam ad