టీ కాంగ్రెస్ లో మాత్రం కనిపించని జోరు

Date:19/06/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల ఏడాది ప్రారంభమైంది. ఓ పక్క ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ ఊరూరా, వాడవాడా తిరుగుతున్నాడు. కేంద్రంలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో అధికారంలో ఉన్న వారిని గద్దె దించి తాము అధికారంలోకి రావడానికి అన్ని రకాల వ్యూహాలను పన్నుతున్నారు. అయితే, తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు టీ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు కేవలం నామమాత్రమే. ప్రభుత్వం అంతోఇంతో వ్యతిరేకత ఉన్నా, పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉన్నా ఆ పార్టీ ఉపయోగించుకోలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణంగా నేతల మధ్య విభేదాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడమే. ఇవాళ, రేపు అంటూ ఊరిస్తున్న పార్టీ పదవులను కూడా భర్తీ చేయలేని దుస్థితిలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది.తెలంగాణలో ప్రతిపక్షం బలహానంగా ఉందనే వాదనలు ఉన్నా, ఉన్నవాటిలో ఇప్పటికైతే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మాత్రం కాంగ్రెస్ పార్టీనే అనేది అంగీకరించాల్సిన విషయమే. నాలుగేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ కుచించుకుపోతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, సీనియర్ నేతలను సైతం పార్టీని వీడి పోయారు. ఇటువంటి సందర్భంలో ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టడం అవసరం. ఒకవేళ 2019లోనూ అధికారంలోకి రాకపోతే, ఇక పార్టీ కోలుకోవడం కష్టమే. అయినా ఆ పార్టీ నేతలు మాత్రం మారడం లేదు. ఒకరిపై ఒకరు మీడియా ముందుకు రావడం, అసంతృప్తి వ్యక్తం చేయడం కామన్ గా మారింది. బలమైనా నేతలు ఉన్నా పార్టీ వారిని ఉపయోగించుకోలేకపోతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు ఉన్న ఉత్సాహం ఆయనలో ఇప్పుడు కనపడటం లేదు. ఇందుకు కారణం ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకోకపోవడమే. ఆయనకు ప్రచార కమిటీ సారధ్యం ఇస్తారనే వార్తలు వచ్చినా ఇవ్వలేదు. అనేక నెలలుగా పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెబుతున్నా ఆ ధైర్యం చేయడం లేదు అధిష్ఠానం. పదవుల భర్తీ మొదలు పెడితే నేతల్లో అసంతృప్తి వస్తే అసలుకే మోసం వస్తుందేమోనని భయం.నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రజలకు మేలు చేసేవే అయినా, ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేకపోయింది. కానీ, ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ దీనిని గట్టిగా ప్రశ్నించలేకపోతోంది. ప్రజల్లోకి తీసుకెళ్లలేక సతమతమవుతోంది. పార్టీ ఫిరాయింపులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వంటి అంశాలు కలిసివచ్చే అవకాశం ఉన్నా వాటిని కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోతోంది. ఇంతకాలం మిన్నకున్నా ఎన్నికలు దగ్గరపడుతున్నాయనో ఏమో గానీ కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ పలు దఫాలు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది. ఈ యాత్రకు సిరిసిల్ల వంటి కొన్ని నియోజకవర్గాల్లో మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఇదే స్ఫూర్తితో తమ నేతలు దూసుకుపోతారని భావించాయి ఆ పార్టీ శ్రేణులు. కానీ, వారి ఆశలు నెరవేరడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. దక్షిణాదిలో ఆ పార్టీని ఆదుకునే అవకాశం ఉన్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగానే ఉంది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం తెలంగాణను పట్టించుకోవడం లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో నెలల తరబడి ఉండే రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించడానికి సమయం దొరకడం లేదు. నేతల మధ్య లుకలుకలు పోయి పార్టీ ఐక్యంగా ఉండాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీ పదవులను భర్తీ చేయాలి. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జిగా గులాం నబీ ఆజాద్ ను వేస్తారని ఒకసారి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వస్తున్నారని ప్రచారం జరుగుతున్న ఏదీ వాస్తవరూపం దాల్చట్లేదు. ఇవన్నీ చూస్తుంటే ఈ ఎన్నికల్లోనూ గెలుపుపై పార్టీ ఆశలు వదిలేసుకుందా అనే అనుమానం కలగక మానదు.
Tags:The tea is not seen in the Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *