టీచర్ల అడ్డదారులు (వరంగల్)

Date:19/06/2018
వరంగల్‌ ముచ్చట్లు:
అక్రమాలకు కాదేది అనర్హం అన్న చందంగా తయారైంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ. అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినా అక్రమార్కులు మాత్రం వారికి ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూనే ఉన్నారు. బదిలీల మార్గదర్శకాల్లో నాలుగో కేటగిరి పాఠశాలలకు అదనపు పాయుంట్లు ఇవ్వడంతో మూడో కేటగిరి పాఠశాలలను నాలుగో కేటగిరి స్థానాలుగా చూపించి పాయింట్లు పొందుతున్నారని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. నాలుగో కేటగిరి పాఠశాలల పాయింట్లతో పాటు మెడికల్‌ సర్టిఫికెట్లలో సైతం అక్రమాలు భారీగానే జరిగినట్లు ఒక ఉపాఽధ్యాయ సంఘం నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల మార్గదర్శకాల్లో ఆర్‌అండ్‌ బీ ఎస్‌ఈ మాత్రమే రోడ్డు సౌకర్యం లేని పాఠశాలలను గుర్తించి ఆయా పాఠశాలలు మాత్రమే 4వ కేటగిరి కిందకు వస్తాయని ధృవపత్రం జారీ చేస్తాడు. అయితే తొలుత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 50 నాలుగో కేటగిరి పాఠశాలలు మాత్రమే ఉన్నట్లు ఎస్‌ఈ ధృవీకరణ జాబితాను పంపించినట్లు సమాచారం. అయి తే ఈ జాబితా ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో పెరిగినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. నెల్లికుదురు. నెక్కొండ, కేసముద్రం, పాలకుర్తి తదితర మండలాల్లో ఈ పాఠశాలలు ఎక్కువగా ఉన్నట్లు ధృవీకరణ పత్రాలు తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే అత్యంత మారు మూల ప్రాంతాలైన తాడ్వాయి, మంగపేట మండలాల్లో ఈ పాఠశాలల సంఖ్య రెండుకు మించలేదు కానీ నెల్లికుదురు, నెక్కొండ తదితర మండలాల్లో మాత్రం అధికంగా నాలుగో కేటగిరి పాఠశాలలు ఉండటాన్ని పలువురు ఉపాధ్యాయులు అనుమానిస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు అక్కడి స్థానిక నాయకులను మచ్చిక చేసుకొని ఆర్‌అండ్‌బీ అధికారులను మేనేజ్‌ చేసుకొని తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని ఆరోపణలు వినవస్తున్నాయి.
ఉపాధ్యాయ బదిలీల నేపథ్యంలో ఎంజీఎం మెడికల్‌ గ్రౌండ్‌లో బదిలీల ప్రాధాన్యత ఉన్న ఉపాధ్యాయులకు ధృవపత్రాలు అందజేసేందుకు కలెక్టర్‌ సూచనతో ప్రత్యేక మెడికల్‌ బోర్డు ఏర్పాటైంది. అయితే ఈ బోర్డు జారీ చేసిన ధృవీకరణ పత్రాల్లో సైతం భారీగానే అక్రమాలు జరిగాయని ఓ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నాడు. ఓపెన్‌హార్ట్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, వికలాంగ ధృవీకరణ పత్రాల్లో అవకతవకలు జరిగినట్లు పలువురు ఉపాధ్యాయులు సైతం ఆరోపిస్తున్న నేపథ్యంలో పలువురు ఉపాధ్యాయుల మెడికల్‌ ధృవపత్రాలను డీఈవోతో పాటు తనిఖీ అధికారులు సైతం అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా నేటి నుంచి ప్రారంభమవుతున్న అభ్యంతరాల స్వీకరణలో బట్టబయలు అవుతుందని పలువురు ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఇలాంటి విషయాల్లో చూసీచూడనట్లు వ్యవహరించకుండా అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.
Tags:The teachers’ barriers (Warangal)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *