నిజం… ఇది వాస్తవం!

హైదరాబాద్‌ ముచ్చట్లు:

పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నట్లు మరోసారి రుజువైంది. ప్రతి ముగ్గురిలో కనీసం ఒక మహిళ తమ ఉద్యోగ జీవితంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జపాన్ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. పని సమయంలో వివిధ రకాలుగా లైంగిక వేధింపులకు గురవ్వడం, బలవంతంగా సంబంధాలను కొనసాగించాల్సి రావడం, దిగజారుడు వ్యాఖ్యలను వినాల్సి రావడం వంటి ఎన్నో ఇబ్బందులను ఉద్యోగినులు ఎదుర్కొంటున్నారని తాజా సర్వే ద్వారా తెలిసింది. జపాన్ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ అధ్యయనంలో వివరాలను తాజాగా విడుదల చేసింది. మహిళలు అందరూ తమ అభిప్రాయాలను తెలపలేదని, ఈ మెయిల్, ఆన్‌లైన్లో దాదాపు పదివేల మంది మహిళా ఉద్యోగులు సమర్పించిన వివరాలను పరిశీలించి లెక్కలను వెల్లడించినట్లు చెబుతున్నారు. మొత్తం స్పందించిన వారిలో 29 శాతం లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వేధింపుల్లో మహిళలు కనిపించే తీరును బట్టి లేదా వయసును బట్టి వారి వ్యాఖ్యలు ఉంటాయని 54 శాతం మంది పేర్కొన్నారు. తర్వాత అత్యధికంగా ఉండే వేధింపుల జాబితాలోకి అవాంఛితంగా హత్తుకోవడం వస్తుందని 40 శాతం మంది వివరించగా 38 శాతం మంది మాత్రం లైంగిక సంబంధ ప్రశ్నలు సంధించడమే పనిగా పెట్టుకుంటారని తెలిపారట. మొత్తంలో 27 శాతం మంది మహిళలు మాత్రం వేధింపుల్లో భోజనానికి గానీ, డేటింగ్‌కు గానీ రమ్మంటున్నారని తెలిపినట్లు జపాన్ సర్వేలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, సినిమా తారలపై లైంగిక వేధింపులు కొత్తేం కాదు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడైనా అమ్మాయిలపై కీచకుల కన్ను పడుతూనే ఉంటుంది. వారిని గట్టిగా ప్రతిఘటిస్తుంటారు చాలామంది. అయితే సినీరంగంలో మహిళలపైనే కాకుండా పురుషులపైనా లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆందోళన వ్యక్తం చేశారు. హాలీవుడ్ కామాంధ నిర్మాత హర్వే వెయిన్స్టీన్ పలువురు తారలను లైంగికంగా వేధించినట్లు బాధితులు చెప్పడం తెలిసిందే. దీనిపై నటి అలిసా మిలానో ట్విటర్లో ప్రారంభించిన ప్రచారంపై చిన్మయి స్పందించారు. ‘మీటూ’ (నన్ను కూడా) హ్యాష్‌ట్యాగ్‌తో కొద్దిరోజుల క్రితం ఈ ప్రచారం సాగింది. వేధింపులపై అనుభవాలను పంచుకుంటున్నారు పలువురు. దీనిపై చిన్మయి స్పందించారు. ‘లైంగిక వేధింపుల బారిన పడని ఆడపిల్ల లేదేమో, నా స్నేహితులైన మగవారిని వయసులో వారికంటే పెద్దవారైన మగవారు అత్యాచారం చేశారు. లైంగిక వేధింపులకు గురవుతున్న మగవారినికి అండగా నిలవాలి, మీ కూతుళ్లకు, కొడుకులకు దీనిపై అవగాహన కల్పించండి’ అంటూ అప్పట్లో చిన్మయి కామెంట్ చేశారు కూడా. ఇక, ఒక్కమాటలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ సంఘటన ఆసేతుహిమాచలం మహిళల్ని కదిలించి వేసింది. పల్లెలు, పట్టణాలనే తేడాలేకుండా నారీలోకం నిరసన గళం విప్పి కదం తొక్కింది. ఆందోళన కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో కేంద్ర ప్రభుత్వం జడత్వాన్ని వదిలించుకుని మహిళలకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. కేసులు, శిక్షల సంగతలా ఉంచితే, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు అతివలు ఇపుడు ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. ఇదంతా ‘నిర్భయ’ ఉదంతం తర్వాత దేశంలోచోటు చేసుకున్న పరిణామాలు. సరిగ్గా మూడేళ్ల క్రితం (డిసెంబర్ 16, 2012) దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో రాత్రి వేళ బస్సులో తన స్నేహితుడితో కలిసి వెళుతున్న 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని (నిర్భయ)పై ఆరుగురు ఆగంతకులు దాడి చేసి, శారీరకంగా హింసించి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సామూహిక అత్యాచార సంఘటన వెలుగు చూసిన వెంటనే ఢిల్లీతో పాటు అనేక ప్రాంతాల్లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. నష్టనివారణ చర్యలను ప్రారంభించిన పాలకులు ‘నిర్భయ’ను సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతూ ఆమె అదే నెల 29న తుది శ్వాస విడిచింది. నిర్భయ కేసులో ఆరుగురు నిందితులపై కేసులు నమోదు కాగా, విచారణ దశలో ఓ నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగతా నిందితుల్లో నలుగురికి జీవితశిక్షలు పడగా, మైనర్ అని భావించి ఓ వ్యక్తిని జువనల్ హోంకి తరలించారు. నిర్భయ కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ మహిళలు దే శవ్యాప్తంగా ఉద్యమించడంతో లైంగిక వేధింపుల నిరోధానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. జస్టిస్ వర్మ కమిటీ సిఫారుసులను పరిగణనలోకి తీసుకున్నాక, పార్లమెంటు ఆమోదం అనంతరం 2013లో ‘నిర్భయ చట్టం’ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. అత్యాచార కేసుల్లో బాధితులను ఆదుకునేందుకు వంద కోట్ల రూపాయలతో కేంద్రం ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలను ఆదుకునేందుకు నిర్భయ తల్లిదండ్రులు ‘నిర్భయ ట్రస్టు’ను ఏర్పాటు చేశారు. లైంగిక నేరాలు, అత్యాచారాల కేసులు మన దేశంలో కొత్తేమీ కాకున్నా-నిర్భయ ఉదంతం మాత్రం సంచలన ఉద్యమానికి దారిచూపింది. దేశవ్యాప్తంగా మహిళలను సంఘటితం చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా-‘నిర్భయ చట్టం’ కూడా ‘కోరలు లేని పులి’లాంటిదని ప్రస్తుత పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా లైంగిక వేధింపులు, అత్యాచారాల సంఖ్య అసంఖ్యాకంగా పెరగడం, కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం, నిందితులకు శిక్షలు పడుతున్న దాఖలాలు లేకపోవడంతో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. నిర్భయ ఉదంతం చోటు చేసుకున్న ఢిల్లీలో మహిళలకు భద్రత ప్రశ్నార్థకమైంది. దేశానికే కాదు, అత్యాచారాలకు సైతం ఈ నగరం రాజధానిగా మారిందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఢిల్లీలో రోజుకు ఆరు అత్యాచారాలు, 14 లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయని జాతీయ నేరగణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) చెబుతోంది. పదేళ్లలోపు వయసు కలిగిన బాలికలపై గత ఏడాది 364 అత్యాచారం కేసులు ఈ నగరంలో నమోదయ్యాయి. 2012 డిసెంబర్ నుంచి 2014 మార్చి వరకూ 1,492 లైంగిక నేరాల కేసులు నమోదయ్యాయి. 90 శాతం కేసుల్లో నిందితులంతా బాధితురాళ్లకు పరిచయస్తులేనని పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఢిల్లీలో 1,551 అత్యాచార కేసులు, 3.076 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులు అందిన ప్రతిసారీ ‘నిర్భయ చట్టం’ కింద కేసులు పెడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా కేసులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా కొలిక్కిరావడం లేదు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. 2013లో అత్యాచారం కేసులు 14.4 శాతం మేరకు పెరిగాయి. ఈ తరహా కేసులకు సంబంధించి 2013లో 48,193 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టులకు సంబంధించి 37.7 పెరుగుదల చోటుచేసుకుంది. దేశం మొత్తమీద మధ్యప్రదేశ్‌లో అత్యాచారాల కేసులు అధిక సంఖ్యలో నమోదయ్యాయి. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో 5,076 రేప్ కేసులు నమోదు కాగా, 3,759 కేసులతో రాజస్థాన్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. అత్యాచారాలు, లైంగిక వేధింపులే కాదు మహిళల్ని హత్య చేయడం, కిడ్నాప్‌లు, అక్రమంగా తరలించడం, బలవంతంగా వేశ్యావృత్తిలోకి దింపడం, వరకట్నం వేధింపులు, బాలికలపై లైంగిక దాడులు వంటివి దేశవ్యాప్తంగా అధికం అవుతున్నాయి. విద్యాసంస్థల్లో సైతం అమ్మాయిలపై లైంగిక వేధింపులకు సంబంధించి అనునిత్యం అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి దిల్లీ నగరంలో 2014లో 15,265 కేసులు, 2013లో 12,888 కేసులు నమోదయ్యాయి. ఈ తరహా కేసులు ఎంపిలో 15,170 కేసులు, మహారాష్టల్రో 15,029 కేసులు, యూపీలో 12,425 కేసులు, రాజస్థాన్‌లో 10,149 కేసులు నమోదయ్యా. సామూహిక అత్యాచారాల సంగతి చూస్తే యూపీలో గత ఏడాది 573, రాజస్థాన్‌లో 414, ఢిల్లీలో 147 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది మహిళల కిడ్నాప్‌లకు సంబంధించి 58,592 ఫిర్యాదులు రాగా, యూపీలో 10,628 కేసులు, ఎంపీలో 5,738 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 5,062, బిహార్‌లో 4,760, ఢిల్లీలో 4,227 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా మహిళలపై వేధింపులు, లైంగిక హింస పెరిగినా చట్టాలేవీ ఆదుకోలేకపోతున్నాయి.

Tag : The truth is … it’s true!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *