డబుల్ బెడ్ రూం పథకంపై కేంద్రమంత్రి ప్రశంసలు

హైదరాబాద్ ముచ్చట్లు: :
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పథకమని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ పూరి ప్రశంసించారు. న్యూబోయిగూడ ఐడీ హెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో కేంద్ర మంత్రి హర్ దీప్ పూరి సందర్శించారు.ఈ సందర్బంగా కేంద్ర మంత్రి హర్ దీప్ పూరి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని మురికి వాడల రహిత నగరంగా రూపొందించేందుకు ఇన్ సీటు పద్దతిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం విప్లవాత్వకమైనదన్నారు. ప్రస్తుతమున్న బస్తీలను తొలగించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడం సవాలుతో కూడుకున్న అంశమన్నారు.ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశానికి ఆదర్శవంతంగా, స్ఫూర్తి దాయకంగా నిలిచాయన్నారు. 2022 నాటికి అందరికి ఇండ్లు అని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధారించిందని పేర్కొన్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 109 ప్రాంతాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా..వీటిలో 41 స్థలాల్లో ప్రస్తుతం బస్తీలు, మురికివాడలున్నాయని తెలిపారు. వీటిలో 38 బస్తీలను ఖాళీ చేయించి, ఆ స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించడం ఎంతో సమస్యాత్మకమైనప్పటికీ ఈ బస్తీల్లో నివాసితులను ఖాళీ చేయించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విజయం సాధించారన్నారు. దేశంలో మరే నగరంలోనూ నివాసముంటున్న బస్తీలను, మురికివాడలను ఖాళీచేయించి ఇళ్లను నిర్మించే విధానం విజయవంతం కాలేదని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రమంత్రితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామచంద్ర నాయక్, ఎంపీ బండారు దత్తాత్రేయ ఉన్నారు.
Tag : The Union Minister praised the double bedroom scheme


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *