The worst thing that is worse than the fear of the Kurkukshetra

నిర్భయ కంటే దారుణమైన ఘటన.. అట్టుడుకుతున్న కురుక్షేత్ర

సాక్షి

Date :15/01/2018

ఛండీగఢ్‌ : ఢిల్లీ నిర్భయ కంటే దారుణమైన అత్యాచార ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను పైశాచికంగా కబలించిన మృగాలు.. నగ్నంగా ఓ కాలువలో పడేశారు. శనివారం సాయంత్రం ఘటన వెలుగులోకి రాగా.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇప్పుడు ఆ ప్రాంతమంత నిరసన ప్రదర్శనలతో హోరెత్తిపోతుంది.

బాధిత కుటుంబ కథనం ప్రకారం… కురుక్షేత్ర జిల్లా ఝాంసా గ్రామంలో బాలిక కుటుంబం నివసిస్తోంది. ఆమె తండ్రి ఓ టైలర్‌. బాలిక గ్రామంలో ఉన్న ఓ పాఠశాలలో 10 తరగతి చదువుతోంది. అదే గ్రామంలో ఉంటున్న ఓ యువకుడి(20)ని ప్రేమించిన బాలిక కొద్దిరోజుల క్రితం అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే బాలిక హత్యాచారానికి గురైంది. జింద్‌ జిల్లా బుద్ధ ఖేర్‌ గ్రామంలోని కాలువ ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన వెలుగు చూసింది. బాలిక మృతదేహాన్ని రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్‌ ఆస్పత్రికి ఫోరెన్సిక్‌ విభాగానికి తరలించి శవ పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులు సదరు యువకుడిపైనే అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఘటనకు అతడికి సంబంధం ఉన్నట్లు ఇప్పటిదాకా రుజువులేవీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు.

అత్యంత కిరాతకంగా…
ఇక బాలిక మృతదేహానికి పరీక్షలను నిర్వహించిన డాక్టర్‌ ఎస్‌కే దత్తార్వాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత పైశాచికంగా ఆ బాలికను అత్యాచారం చేసి చంపారని ఆయన చెబుతున్నారు. మొత్తం బాలిక శరీరంపై ముఖం, తల, ఛాతీ, చేతులు ఇలా వివిధ భాగాల్లో 19 గాయాలున్నాయని.. నిందితులు ఆమె ఛాతీపై కూర్చోవటంతో ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

‘‘దాదాపుగా ఆమె శరీరవయవాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. మర్మాంగాల్లో వస్తువులను చొప్పించటంతో బాలిక పేగులు దెబ్బతిన్నాయి. మృగాల కంటే హీనంగా బాలికను అత్యాచారం చేశారు. నిర్భయ ఘటన కంటే ఇది మరీ ఘోరంగా ఉంది’’ అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

కురుక్షేత్రలో ఆందోళన… 
ఘటన వెలుగులోకి రావటంతో మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఆందోళనకారులు శాంతించాలని ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ పిలుపునిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆయన అన్నారు.

బాలిక తండ్రి ఫోటో

‘‘నా కూతురికి న్యాయం చేకూరాలి. ఆమె అతి దారుణంగా చంపబడింది. భవిష్యత్తులో మరే తండ్రికి ఇలాంటి దుస్థితి కలగకుండా.. నిందితులను కఠినంగా శిక్ష విధించాలి’’ అని బాలిక తండ్రి డిమాండ్‌ చేస్తున్నారు. కేసును సీబీఐకి అప్పగించి.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని.. నిర్భయ ఫండ్‌ నుంచి 50 లక్షలు బాలిక తల్లిదండ్రులకు అందజేయాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేశారు. మరోవైపు బాలిక మృతదేహాంతో కుటుంబ సభ్యులు నిరసన చేపట్టగా.. చివరకు హర్యానా మంత్రి కేకే బేడీ కాలపరిమితితో కూడిన దర్యాప్తునకు హమీ ఇవ్వటంతో ఆందోళన విరమించి బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేసేదాకా శాంతియుత నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని మహిళా సంఘాలు ప్రకటించాయి. ముందస్తు జాగ్రత్తగా భారీ ఎత్తున్న భద్రతా దళాలను అక్కడ మోహరించారు.

మరొక ఘటన..
పానిపట్‌లో మరో దళిత మైనర్‌ను కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక(11) ను ఎత్తుకెళ్లిన దుండగులు ఘటన అనంతరం సమీపంలోని ఓ చెత్త కుప్పలో బాలిక శవాన్ని పడేశారు. ఆనవాళ్లు దొరక్కుండా బాలిక బట్టలను కాల్చి పడేశారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి పక్కన ఉండే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పానిపట్‌ ఎస్పీ వెల్లడించారు. కాగా, గత నెలలో హిస్సార్‌లో ఆరేళ్ల బాలికను అతికిరాతంగా అత్యాచారం చేసి చంపగా.. ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

 Tags : The worst thing that is worse than the fear of the Kurkukshetra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *