మంత్రుల దుబారాకు లెక్కే  లేదు

Date:14/02/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమవుతున్న రోజులివి. కానీ ప్రభుత్వం మాత్రం దుబారాకు కళ్లెం వేయడం లేదు. లెక్కకు మించి ఖర్చు చేస్తున్నారు. రాజధాని విజయవాడలో కన్నా విశాఖపట్నంలో ఇటీవల కాలంలో అంతర్జాతీయ సదస్సులు, జాతీయ స్థాయి సమావేశాలు పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలలో రెండు, మూడుసార్లు విశాఖకు ప్రత్యేక విమానంలోనే వస్తున్నారు. ఇప్పటి వరకూ అంతర్జాతీయ సదస్సులన్నీ నగరంలోని స్టార్ హోటళ్లలోనే జరిగాయి. ఒక హోటల్‌కు ప్రభుత్వం అక్షరాలా పది కోట్ల రూపాయలు ఇప్పటికే బకాయి పడిందంటే, స్టార్ హోటళ్లను ఏవిధంగా ప్రభుత్వ పెద్దలు వాడేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నగరానికి వచ్చినప్పుడు గతంలో సర్క్యూట్ హౌస్‌లో బస చేసేవారు. ఎప్పుడైతే పోర్టు గెస్ట్ హౌస్‌ను అత్యంత సుందరంగా మలిచారో, గత ఏడాది కాలంగా సీఎం అక్కడే బస చేస్తున్నారు. లోకేష్ కూడా అదే అతిథి గృహానికి అలవాటుపడ్డారు. నగరం నడిబొడ్డున అత్యంత సుందరమైన దృశ్యాలను వీక్షిస్తూ, సేదదీరే విధంగా సర్క్యూట్ హౌస్ (ప్రభుత్వ అతిథి గృహం) నిర్మించారు. గతంలో నగరానికి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇక్కడే బస చేసేవారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా ఒక సూట్‌ను అన్ని హంగులతో తయారు చేశారు. కానీ సీఎం ఈ గెస్ట్ హౌస్‌ను పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రే ఈ అతిథి గృహానికి రానప్పుడు తామెందుకు రావాలనుకున్నారేమో మంత్రులు!సర్యూట్ హౌస్‌లో మొత్తం ఏడు గదలు ఉన్నాయి. ఇందులో నాలుగు అద్భుతమైన సూట్‌లు, రెండు ప్రీమియం సూట్‌లు, ఒక సాధారణ సూట్ ఉంది. వచ్చిన అతిథులకు సపర్యలు చేసేందుకు ఆరుగురు సర్వెంట్లు కూడా ఉన్నారు. కానీ నగరానికి వచ్చి రాత్రికి బస చేయాలనుకున్న ఏ మంత్రి కూడా ఈ సర్క్యూట్ హౌస్‌కు రావడం లేదు. వీరంతా స్టార్ హోటళ్లలోనే సేదదీరుతున్నారు. స్టార్ హోటళ్లలో ఉన్న కాసేపు విలాసవంతంగా గడపచ్చు. ప్రైవేటు అంశాలు కూడా అక్కడే సెటిల్ చేసుకోవచ్చు. ప్రభుత్వ అతిథిగృహమైతే, ఇవేవీ సాధ్యం కాదు కాబట్టే, మంత్రులు స్టార్ హోటళ్ల వైపు పరుగులు తీస్తున్నారని తెలుస్తోంది. సర్క్యూట్ హౌస్‌కు కేవలం హోం మంత్రి మాత్రమే అప్పుడప్పుడు వచ్చి బస చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రులెవరైనా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నారు. మంత్రి ఒక రోజు ఒక స్టార్ హోటల్‌లో ఉంటే, కనీసం 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఒక రూం అద్దె రోజుకు ఎనిమిది వేల నుంచి 10 వేల రూపాయలు. మంత్రి, ఆయనతో పాటు వచ్చే పరివారం, స్నేహితుల భోజనం, అల్పాహారం వగైరాలు, టాక్స్‌లు కలుపుకొంటే ఎంతవుతుందో ఊహించుకోవచ్చు. అదే సర్క్యూట్ హౌస్‌లో మంత్రి ఎన్ని రోజులు ఉన్నా, ఒక్క రూపాయి అద్దె చెల్లించనక్కర్లేదు. భోజనం ఖర్చు కూడా చాలా వరకూ తగ్గుతుంది. కాగా, ఏ శాఖ మంత్రైనా జిల్లాకు వస్తే, ఆయన ఖర్చులు సదరు శాఖ అధికారులు భరించుకోవలసి వస్తోంది. ఒకే శాఖకు చెందిన మంత్రి నెలకు రెండు, మూడు సార్లు వస్తే, సదరు ఉద్యోగుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఖర్చులు భరించలేకపోతున్నామంటూ వివిధ శాఖల ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.
Tags: There is no calculation of ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *