అక్కడ అలా..ఇక్కడ ఇలా..

Date:12/03/2018
కర్నూలు ముచ్చట్లు:
అర్ధంపర్ధంలేని ఐడియాలజీలతో వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అభాసుపాలైంది. ఈ టాలెంట్ ను విజయసాయిరెడ్డి జాతీయ మీడియాలోనూ ప్రదర్శించి తమ పరువు తీసుకున్నారని రాష్ట్రవాసులు అంటున్నారు. బీజేపీపై అవిశ్వాసం పెడతామని తేల్చేసి.. అదే పార్టీపై నమ్మకం ఉందని చెప్తున్న తీరును ఎలా అర్ధం చేసుకోవాలో.. అంతుపట్టని పరిస్థితి. ఈ లాజిక్కేంటో.. వైసీపీయే సెలవివ్వాలని ప్రజలు అంటున్నారు. సీనియర్‌ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్ నిర్వహించిన చర్చలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ‘చర్చకు సమయం ముగుస్తోంది. చివరగా మీరేం చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించగా… విజయసాయిరెడ్డి.. మా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మేము మద్దతిస్తామని, వారి వెంట నడుస్తామని మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని అన్నారు. ఇదే మా పార్టీ స్టాండ్ అని తేల్చి చెప్పారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ బహిరంగంగానే చెప్పారు కదా.. అంటే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటే మీరు ఆ పార్టీకి మద్దతు ఇస్తారన్నమాట అని రాజ్దీప్ విజయసాయిరెడ్డిని అడిగారు. దీనికి బదులుగా విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాధానం విన్నవారందరికీ మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. హోదాపై కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత లేదంటూ లెక్చర్ అందుకున్న విజయసాయిరెడ్డి.. హస్తంపార్టీకి సీరియస్ నెస్ ఉంటే చట్టంలోనే హోదా విషయాన్ని పొందుపరచి ఉండేదని అన్నారు. అందుకే, కాంగ్రెస్ ను నమ్మలేమని. ఇప్పుడు హోదా ఇస్తామన్నా విశ్వసించలేమని సెలవిచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వగలదు. ప్రధానిమంత్రిపై మాకు నమ్మకం ఉంది. గౌరవనీయులైన ప్రధాని మా డిమాండ్ పరిగణించి ప్రత్యేక హోదా ఇస్తారని నమ్ముతున్నానంటూ తమదైన భాష్యం వినిపించారు.విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ నేపథ్యంలో రాజ్దీప్.. అయితే మీరు బీజేపీతో మైత్రికి సిద్ధంగా ఉన్నారన్నమాట. టీడీపీ బీజేపీని వీడితే మీరు పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లుగా మీరు చెప్తున్నారా? అంటూ మరో ప్రశ్న సంధించారు. దీనికి బదులుగా విజయసాయిరెడ్డి.. ఏ పార్టీ అయితే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీకే మద్దతిస్తామని మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే స్పష్టంచేశారంటూ మళ్లీ మొదటికే వచ్చారు. హోదా ఇవ్వం… ఇవ్వలేం అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇటీవలే స్పష్టంచేశారు. అయితే వైసీపీ వర్గం మాత్రం మోదీపై తమకు నమ్మకముందని, ఆయన హోదా ఇస్తారని తమకు తాము లెక్కలేసుకోవడం..జనాలకు వివరించడం ఏంటో అర్ధంకావడంలేదు. నిజంగా మోదీపై అంత విశ్వాసమే ఉన్నప్పుడు… ఆయన సర్కారుపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామంటూ ప్రకటించడమేమిటంటూ అంతా విస్తుపోతున్నారు. కేంద్రంపై జగన్‌ పోరాటంలో చిత్తశుద్ధి లేదని, దీనికి విజయసాయిరెడ్డి ప్రకటనే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags: There it is .. here it is .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *