Things do not happen

పనులు జరగవు.. గొంతు  తడవదు

 Date:14/09/2018
చిత్తూరు ముచ్చట్లు:
 వాల్మీకిపురం ప్రాంతం దశాబ్దాలుగా తాగునీటి సమస్యకు చిరునామాగా ముద్రపడింది. 27వేలకు పైగా జనాభా ఉన్న వాల్మీకిపురం మేజర్‌ పంచాయతీ పరిధిలో ఎక్కడా పెద్దగా చెరువులు, కుంటలు, స్టోరేజి ట్యాంకులు లేవు. వర్షాలు కురిసినా ఇక్కడ త్వరగా బోరుబావుల్లో నీరు ఇంకిపోయి తాగునీటి సమస్య తలెత్తడం పరిపాటిగా మారింది.
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మినీ రిజర్వాయర్‌కు గాను అప్పటి ప్రభుత్వం నుంచి సత్వరమే రూ.6.8 కోట్ల నిధులు మంజూరు చేయించారు. నీటిపారుదల ఆయకట్టుశాఖ నుంచి మినీ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు, గ్రామీణ నీటిసరఫరా పారిశుద్ధ్యశాఖ కింద పట్టణ తాగునీటి పథకానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించారు.
2008 సంవత్సరం అక్టోబరు 5న జిల్లా ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చూస్తున్న అప్పటి పర్యాటక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఈ ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన శంకుస్థాపన చేయించారు. ఆ తరువాత వెంటనే ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పూర్తి చేయించి గుత్తేదార్లకు చకచకా పనులు కేటాయించారు. ఇంజినీరింగ్‌ నిపుణులు ఈ ప్రాజెక్టు కింద 1322 ఎకరాల ఆయకట్టును  స్థిరీకరించారు.
రెవెన్యూ అధికారులు కుడి, ఎడమకాలువలు, ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ పనులు అప్పటికప్పుడే పూర్తిచేశారు. అలాగే ప్రాజెక్టు మధ్యలో ఓ పెద్ద ఊటబావిని, ప్రాజెక్టు కింద రెండు ఊటబావులను నిర్మించారు. వీటికి మోటార్లను ఏర్పాటుచేసి రెండు కిలోమీటర్ల మేర వాల్మీకిపురం పట్టణానికి పైప్‌లైన్లు కూడా వేసి తద్వారా నీటిని తీసుకొచ్చారు.
వాల్మీకిపురం పట్టణంలోని బాపూజీ పార్కు వద్ద పెద్దసంపు, పంపుహౌస్‌లు నిర్మించి భోగంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటిని ఇక్కడ నిల్వ చేశారు. ఇక్కడ పెద్దసంపులో నింపిన నీటిని యంత్రాల ద్వారా శుద్ధిచేసిన అనంతరం మోటార్ల సహాయంతో పంపింగ్‌ చేసి పట్టణంలోని అన్నిప్రాంతాలతో పాటు మరో రెండు కిలోమీటర్ల దూరంలోని ఎన్టీఆర్‌కాలనీ, పాత ఇందిరమ్మ కాలనీ, కడపరోడ్డులోని రాంనగర్‌కాలనీ, తిరుపతిరోడ్డులోని కొత్త ఇందిరమ్మకాలనీ వరకు పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేశారు.
ఈ మధ్యలో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లోను, ఎత్తైన ప్రాంతంలోని స్టోరేజి ట్యాంకుల్లోను ఈ శుద్ధినీటిని నింపారు. తద్వారా పైప్‌లైన్లకు కనెక్షన్లు ఇచ్చి మేజర్‌ పంచాయతీ ప్రాంతంలోని 70శాతం మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా 2011 నాటికి చకచకా వందశాతం పనులు పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తికాగా 2011లో మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులో నీరు చేరడంతో ప్రజలు, రైతుల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ సంతోషం రెండురోజులు కూడా నిలవలేదు.
కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా 2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ హోదాలో ఆయన అధికారులు, నాయకులు మందీమార్బలంతో ఈ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించారు. భోగంపల్లి నుంచి పైప్‌లైన్ల ద్వారా వాల్మీకిపురం పట్టణానికి తీసుకొచ్చిన నీటిని కొళాయిల ద్వారా ప్రజల చేతికి అందించి వారికి అంకితం చేశారు.
దశాబ్దాలుగా వాల్మీకిపురానికి ఉన్న తాగునీటి సమస్య నేటితో తీరిపోయిందని, ఇక నిత్యం తాగునీరు అందించేవిధంగా ఈ ప్రాజెక్టు మీకు ఉపయోగపడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో హంద్రీ-నీవా కాలువను భోగంపల్లికి అనుసంధానం చేసి మీకు ఎప్పటికీ తాగునీటి సమస్య రాకుండా చేస్తానని బహిరంగ సభలో హామీ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన కొళాయి తిప్పి ప్రారంభించిన నీళ్లు ఆ రోజు మాత్రమే ప్రజలకు అందాయి. అంతే .. ఆ తరువాత ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు వినియోగంలోకి రాలేదు.
2011లో ప్రాజెక్టు ప్రారంభించిన తరువాత దీనికింద ఉన్న ఆయకట్టు రైతులు సంబరపడ్డారు. కుడి, ఎడమకాలువల కింద ఉన్న 1322 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశించారు. అయితే నిర్మాణాలు పూర్తి చేసుకున్నా, ప్రాజెక్టుకు వర్షపునీరు వచ్చిచేరినా ఎకరం భూమి కూడా సాగులోకి రాకపోవడంతో రైతులు ఉసూరుమని నీరసించిపోయారు. సాగునీరు అందకపోవడంతో ప్రాజెక్టు కింద భూములు ఉన్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి.
ప్రారంభించిన ఒక్కరోజులోనే ప్రాజెక్టు కలలన్నీ అడియాసలయ్యాయి. ట్రైల్‌రన్‌ చేసిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన ఒక్కరోజు మాత్రమే ఈ ప్రాజెక్టు పనిచేసింది. ఆపై అధికారులు పట్టించుకోలేదు. ప్రాజెక్టు నుంచి రోడ్డుకు ఒకవైపు వేసిన పైప్‌లైన్లన్నీ రోడ్డుపనులు చేపట్టినప్పుడల్లా ఒక్కొక్కటిగా పాడైపోతూ వచ్చాయి. దీంతో క్రమేపి ఈ ప్రాజెక్టు పరికరాలన్నీ మూలనపడిపోయాయి. దీంతో దశాబ్దకాలం అవుతున్నా, ఈ పథకం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడక ప్రాజెక్టు ఆలోచనే మరుగునపడిపోయింది.
Tags:Things do not happen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *