ముందుకు సాగని ఈ నామ్.

నల్గొండ ముచ్చట్లు:
రైతులు పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలును కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 14 ఏప్రిల్2016 లో  ఈ–-నామ్ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఉన్న 180 వ్యవసాయ మార్కెట్ లలో 44 మార్కెట్లను ఇందుకు ఎంపిక చేశారు. అనంతరం మరో 13 మార్కెట్లకు విస్తరించారు.  ఈ మార్కెట్లలో రైతులు వారి పంటను ఆన్లైన్ట్రేడింగ్ద్వారా దేశంలో ఏ వ్యాపారికైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఆన్‌లైన్‌లో చూసి వారికి నచ్చిన సరుకును కొనుగోలు చేయవచ్చు. సరుకు నాణ్యంగా ఉంటే వ్యాపారులు పోటీపడి ఎక్కువ రేటు చెల్లిస్తారు. రైతులు సైతం ఎప్పటికప్పుడు ఇతర మార్కెట్లలోని పంట ఉత్పత్తుల ధరల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ–నామ్ ప్రారంభమై ఆరేండ్లు కావస్తున్నా నేటికీ రాష్ట్రంలోని ఏ మార్కెట్లో కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఉత్తర తెలంగాణలో పసుపు, సోయా, మొక్కజొన్న, వరి, జొన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తారు.  ఇందులో పసుపు, సోయాకు జాతీయ స్థాయి మార్కెట్‌అవసరం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పసుపు, అలాగే సోయా ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దేశంలో సుమారు 25 శాతానికి పైగా పసుపు జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో పండుతుంది. దీనికి ఇక్కడ ధర రాకుంటే రైతులు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకువెళుతున్నారు. ఈ–నామ్ విధానం మార్కెట్లలో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో మార్కెట్లో స్థానిక వ్యాపారులు సిండికేట్ అయ్యి ముందు అనుకున్న ధరను ఆన్లైన్లో బిడ్డింగ్ చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో  అసలు ధరకు ఎసరు వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ–నామ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరగాలంటే ముందుగా మార్కెట్లలో క్వాలిటీ చెకింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలి. కానీ నేటికీ ఎక్కడా అలాంటి ల్యాబ్ లు ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర, దేశవ్యాప్తంగా  మార్కెట్లకు ఈ–నామ్ లింక్కాకపోవడానికి ఇదొక కారణమని మార్కెటింగ్ ఆఫీసర్లు చెబుతున్నారు.
మార్కెట్‌లోకి రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురాగానే గేట్‌ఎంట్రీలోనే రైతు వివరాలు, సరుకుల వెయిట్,  ఏ కమీషన్‌ ఏజెంట్ వద్దకు తీసుకుని వెళుతున్నాడో తెలుసుకుని ఒక ఐడీ ఇస్తారు. ఆ ఐడీని సరుకులపై ఉంచుతారు. ఆ వివరాలను మార్కెట్‌ సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రైతులు తీసుకొచ్చిన సరుకుల ఐడీతో ఈ–-బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. అందులో ఎవరు ఎక్కువ రేటు కోట్చేశారన్నది ఆన్‌లైన్‌లో వెంటనే తెలిసిపోతుంది. ఆ ధర రైతుకు నచ్చితే మార్కెట్‌ సిబ్బంది క్రయవిక్రయాలు కొనసాగిస్తారు. అందుకు సరిపడా మార్కెట్‌చార్జీలు రైతు చెల్లించాల్సి ఉంటుంది.  ఈ విధానంలో రైతులు, కొనుగోలుదారుల మధ్య మార్కెటింగ్‌శాఖ అనుసంధానకర్తగా పని చేస్తుంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో ఆరేండ్ల క్రితం ఈ–నామ్(నేషనల్అగ్రికల్చర్మార్కెట్) షురూ చేశారు. మార్కెట్ ఆఫీస్ లో క్యాబిన్లు ఏర్పాటు చేసి కంప్యూటర్లు బిగించారు. అప్పటి నుంచి ఆన్ లైన్ ద్వారానే పసుపు కొనుగోళ్లు జరుపుతున్నారు. కానీ ఇప్పటివరకు రాష్ట్రం, దేశంలోని మార్కెట్లకు అనుసంధానం చేయలేదు. దీంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడ పసుపు కొనుగోలుకు రావడం లేదు. స్థానిక వ్యాపారులు మాత్రమే ఆన్ లైన్ లో రేటు కోట్ చేస్తున్నారు. పసుపు కొనుగోళ్లకు ఇతర ప్రాంతాల వ్యాపారులు రాకపోవడంతో స్థానిక వ్యాపారులు చెప్పిందే ఫైనల్ అవుతోంది. దీంతో రైతుల పంట ఉత్పత్తులకు ఆశించిన రేటు రావడం లేదు. ఈ–నామ్ ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్లను రాష్ట్ర, దేశంలోని అన్ని మార్కెట్లకు అనుసంధానం చేస్తే రైతుల పంట ఉత్పత్తులకు మంచి రేటు వచ్చి లాభాలు వస్తాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులు బిడ్డింగ్ లో పాల్గొంటే పోటీ ఏర్పడి రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి. రైతులు క్వాలిటీ పసుపు తీసుకొస్తే మంచి ధర పొందవచ్చు. ప్రస్తుతం స్థానిక వ్యాపారులే బిడ్డింగ్ లో పాల్గొంటున్నారు. మెట్ పల్లి మార్కెట్ లో రైతుల పంట ఉత్పత్తులు,  పసుపునకు గరిష్ఠ ధర వచ్చేలా ఇదివరకే వ్యాపారులతో సమావేశం  నిర్వహించాం.
 
Tags:This nam that does not move forward.

Natyam ad